మహిళా డిగ్రీ గురుకులాల్లో భారీగా ఫీజులు పెంచిన ప్రభుత్వం
డిగ్రీ కోర్సులకు రూ.4,225 నుంచి రూ.14 వేలకుపైగా వసూలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ఇకపై చదువు‘కొనా’ల్సిందే. గత విద్యా సంవత్సరం వరకు ఉచిత విద్యను అందించిన ఈ కళాశాలల్లో ప్రతి కోర్సుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫీజులు ఖరారు చేసింది. సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థినుల నుంచి కోర్సును బట్టి రూ.4 వేల నుంచి రూ.14 వేల వరకు ఫీజులు వసూలు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది.
గత నెలలోనే జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఇప్పుడు బయటకు రావడంతో విద్యార్థి సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు కళాశాలలకు, హాస్టళ్లకు ఎలాంటి ఫీజులు లేకుండా విద్యార్థినులు చదువుకున్నారు. అలాంటిది ఇప్పుడు భారీగా ఫీజులు చెల్లించమనడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు.
ఉన్నట్టుండి ఫీజుల పిడుగు..
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కేటగిరీ కింద ఏడేళ్ల క్రితం రెండు మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో ఒకటి కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కంచికచర్లలోనూ, మరొకటి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో కలికిరిలోనూ ఏర్పాటు చేశారు. ఎస్సీ మహిళలకు డిగ్రీ స్థాయిలో ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో విద్యతో పాటు హాస్టల్ సదుపాయాన్ని ప్రభుత్వమే సమకూరుస్తోంది.
విద్యార్థినుల నెత్తిన ఫీజుల బండ: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలకు గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా నిధులను విడుదల చేసేవారు. రెండు కళాశాలల్లో సుమారు 600 మంది చదువుకుంటున్నారు. కంచికచర్ల కళాశాలలో బీకామ్ (జనరల్) కోర్సుకు రూ.4,225, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)కు రూ.14,172 ఫీజు నిర్ణయించగా, కలికిరిలో బీకామ్ (జనరల్)కు రూ.5,400, బీకామ్ (సీఏ)కి రూ.10,845, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)కు రూ.11,045గా ఖరారు చేశారు.
ఫీజుల వసూలు నిలిపివేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ
గురుకుల డిగ్రీ కళాశాలల్లోని విద్యార్థులు ఫీజులు చెల్లించాలంటూ ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment