Womens Degree College
-
గురుకులాల్లో ఫీ‘జులుం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ఇకపై చదువు‘కొనా’ల్సిందే. గత విద్యా సంవత్సరం వరకు ఉచిత విద్యను అందించిన ఈ కళాశాలల్లో ప్రతి కోర్సుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫీజులు ఖరారు చేసింది. సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థినుల నుంచి కోర్సును బట్టి రూ.4 వేల నుంచి రూ.14 వేల వరకు ఫీజులు వసూలు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. గత నెలలోనే జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఇప్పుడు బయటకు రావడంతో విద్యార్థి సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు కళాశాలలకు, హాస్టళ్లకు ఎలాంటి ఫీజులు లేకుండా విద్యార్థినులు చదువుకున్నారు. అలాంటిది ఇప్పుడు భారీగా ఫీజులు చెల్లించమనడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి ఫీజుల పిడుగు..సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కేటగిరీ కింద ఏడేళ్ల క్రితం రెండు మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో ఒకటి కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కంచికచర్లలోనూ, మరొకటి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో కలికిరిలోనూ ఏర్పాటు చేశారు. ఎస్సీ మహిళలకు డిగ్రీ స్థాయిలో ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో విద్యతో పాటు హాస్టల్ సదుపాయాన్ని ప్రభుత్వమే సమకూరుస్తోంది. విద్యార్థినుల నెత్తిన ఫీజుల బండ: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలకు గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా నిధులను విడుదల చేసేవారు. రెండు కళాశాలల్లో సుమారు 600 మంది చదువుకుంటున్నారు. కంచికచర్ల కళాశాలలో బీకామ్ (జనరల్) కోర్సుకు రూ.4,225, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)కు రూ.14,172 ఫీజు నిర్ణయించగా, కలికిరిలో బీకామ్ (జనరల్)కు రూ.5,400, బీకామ్ (సీఏ)కి రూ.10,845, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)కు రూ.11,045గా ఖరారు చేశారు. ఫీజుల వసూలు నిలిపివేయాలి: ఎస్ఎఫ్ఐ గురుకుల డిగ్రీ కళాశాలల్లోని విద్యార్థులు ఫీజులు చెల్లించాలంటూ ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్ ప్రకటనలో పేర్కొన్నారు. -
'ఒకరోజు ఆగండి, మా పిల్లలు లేచి వస్తారు'
సాక్షి, మదనపల్లె: మూఢనమ్మకాలు, విపరీతమైన భక్తి భావాలతో యుక్తవయసులోని ఇద్దరు యువతులను తల్లిదండ్రులు అతికిరాతకంగా హత్యచేశారు. జాతీయ బాలికల దినోత్సవం రోజునే చోటుచేసుకున్న ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. పట్టణంలోని టీచర్స్ కాలనీ శివనగర్‌లో భార్యాభర్తలు వల్లూరుపల్లె పురుషోత్తం నాయుడు, పద్మజ ఉంటున్నారు. పురుషోత్తం నాయుడు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ కాగా, పద్మజ మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపాల్. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) ఇద్దరు కుమార్తెలు. పద్మజకు విపరీతమైన భక్తి భావాలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. చదవండి: (సోదరుడితో శారీక సంబంధం.. ప్రియుడి హత్య) కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న డిఎస్పీ ఈ నేపథ్యంలో.. ఆదివారం ఏకాదశి సందర్భంగా ఇంట్లో ప్రత్యేక పూజలు చేసేందుకు నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంలో వ్యాయామానికి ఉపయోగించే డంబెల్స్ సహాయంతో తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లలను కొట్టి అతికిరాతకంగా హత్యచేశారు. అనంతరం తల్లిదండ్రుల అరుపులు, కేకలతో విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు తల్లిదండ్రులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ‘సత్యలోకం తిరిగి వస్తుంది. మా బిడ్డలను మేం తిరిగి బతికించుకుంటాం.. ఒకరోజు గడువు ఇవ్వండి, మా పిల్లలు లేచి వస్తారు’అని ఆ తల్లిదండ్రులిద్దరూ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (ప్రేమోన్మాది ఘాతుకం.. కత్తితో కర్కషంగా..) -
‘పది’ ఫెయిల్.. అయినా గ్రూప్–1 ఆఫీసర్‌నయ్యా
సాక్షి, అనంతపురం: తొలి ప్రయత్నంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించలేకపోయినా.. తర్వాత కష్టపడి చదువుకుని గ్రూప్–1 అధికారినయ్యానంటూ అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య అన్నారు. మంగళవారం స్థానిక కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డేలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని, ఇందుకు తన జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒకేచోట ఉంటే వ్యక్తిగతంగా, సమాజపరంగా ఎలాంటి అభివృద్ధి సాధించలేమన్నారు. తాను మొదట ఎస్ఐ ఉద్యోగం సాధించి అక్కడితో ఆగిపోకుండా ప్రయత్నించి గ్రూప్–1 ఆఫీసర్‌గా మారినట్లు వివరించారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైనట్లు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఆడపిల్లలంటే ఎంతో గౌరవమన్నారు. ఇంగ్లిష్‌పై పట్టుసాధిస్తే విరివిగా ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. సమాజ సేవ చేయాలనే ధృక్పథాన్ని అలవరుచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఎంపీకి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శంకరయ్య, రాజనీతిశాస్త్ర ఉపన్యాసకులు రామమూర్తి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
విల్లామేరీ విద్యార్థినులు ఉద్యమ స్ఫూర్తి
-
హు‘షోర్’.. ఫ్రెషర్స్..
-
మహిళా డిగ్రీ కళాశాల స్థలం ‘డబుల్ ’ఇళ్లకు..
వనపర్తిటౌన్: వనపర్తిలో మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కేటాయించారని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. అందువల్లే కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదని తెలిపారు. ఉపముఖ్యమంత్రి సూచన మేరకు మార్చారని చెప్పారు. అదే సమీపంలో 8ఎకరాలు కేటాయిస్తే రూ.19కోట్ల 40లక్షల వ్యయంతో భవన నిర్మాణం చేపడతామని అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన, జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పెద్దమందడికి మంజూరైన ఎస్సీ బాలికల రెసిడెన్షియల్ బుద్దారం గండిలోని ఎస్సీ రెసిడెన్షియల్‌లోనే కొనసాగుతుందని, దాని సొంత భవన నిర్మాణానికి రూ.13కోట్ల 10లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే చిన్నమందడిలో ఐదు ఎకరాల స్థలంలో నిర్మిస్తామన్నారు. శ్రీరంగాపూర్‌కు బాలుర ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వనపర్తిలో 6వ వార్డుకు అంగన్వాడీ సెంటర్ మంజూరైందని, గార్లబండతండా, ఊరంచుతండా, సవాయిగూడెంతండా, కారడిగూడిసెతండా, లక్ష్మీనగర్‌తండా, బోక్యాతండా, ధన్సింగ్తం డా, కాలిబిక్యాతండా తదితర ప్రాంతాలకు మీనీ అంగన్వాడీ కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. అంతకుముందు మధ్యాహ్నం ఎన్ఎస్యూఐ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే చిన్నారెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభించారు. రాహుల్‌గాంధీ స్ఫూర్తి, కాం గ్రెస్ సిద్దాంతాలను నమ్మి ఎన్ఎస్యూ సభ్యత్వం తీసుకున్నారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్, జిల్లా అధ్యక్షుడు కృష్ణవర్ధన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగాధర్, వెంకటేష్, వెంకటస్వామి, భువనేశ్వరి, ఖమర్మియ్యా, విజయలక్ష్మీ, నందిమల్ల శ్యామ్, రాధాకృష్ణ, చంద్రమౌళి, ప్రభాకర్‌రెడ్డి, అబ్దుల్లా, జాన్ పాల్గొన్నారు. -
ఒకే రోజు 10 వేల మొక్కలు నాటిన విద్యార్థులు
సంగారెడ్డి మున్సిపాలిటీ :రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ హరితహరం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల అవరణలో హాస్టల్ విద్యార్థులు ఒకే రోజు 10 వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్చార్జి కమిషనర్, ఎజేసీ, వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతుగా కనీసం 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఇప్పటికే పట్టణంలో 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా తాము 90 వేల మొక్కలు నాటామన్నారు. అగస్టు 15 నాటికి పట్టణంలోని మున్సిపల్ పార్కులు, స్కూల్ గ్రౌండ్లతో పాటు శ్మశానవాటిక స్థలాలతో పాటు పంచాయతీరాజ్, ఆర్ండ్బీ మున్సిపల్ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతామన్నారు. మున్సిపల్ చెర్‌పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ హరిత తెలంగాణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా సేవా కార్యక్రమంగా చూసి ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. కార్యక్రంలో డిప్యూటీ ఇంజినీర్ ధర్మారెడ్డి, ఏఈ మహేష్, వార్డు కౌన్సిలర్ యాకుబ్‌అలీతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
సీఎం వస్తున్నారు..
9,10 తేదీల్లో కేసీఆర్ పర్యటన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడి హన్మకొండ : వరంగల్ నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు రోజులపాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను కడియం శ్రీహరి సోమవారం చూచాయగా తెలిపారు. హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జూలై 9న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరానికి వచ్చే అవకాశం ఉంది. వరంగల్‌లో నెలకొల్పనున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్‌కు 10న సీఎం శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్మించనున్న మహిళా డిగ్రీ కాలేజీకి సైతం సీఎం శంకుస్థాపన చేస్తారు’ అంటూ సీఎం పర్యటన వివరాలు వెల్లడించారు. అంతేకాక జిల్లాకు సైనిక్ స్కూల్ సైతం మంజూరైంద ంటూ డిప్యూటీ సీఎం తెలిపారు. రాబోయే రెండు మూడు నెలల్లో సైనిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామంటూ తెలిపారు. వరంగల్‌లో నెలకొల్పిన కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీని ఎక్కడికీ తరలించడం లేదని శ్రీహరి హామీ ఇచ్చారు. వరంగల్ నుంచే హెల్త్ వర్సిటీ కార్యకలాపాలు జరుగుతాయని ఆయన చెప్పారు. రెండు రోజులపాటు.. హారితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జిల్లాకు వస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. కేయూ క్యాంపస్‌లో జరిగే హరితహారం కార్యక్రమంలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పర్యటనలోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వరంగల్ బ్రాంచ్, మహిళా డిగ్రీ కళాశాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు హంటర్ రోడ్డులో ఉన్న స్టేట్ సైన్స్ సెంటర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. సీఎం పర్యటనకు సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. 2015 జనవరిలో రెండు రోజుల పర్యటనకు సీఎం కేసీఆర్ వరంగల్ వచ్చారు. ఆ తర్వాత అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వరుసగా నాలుగు రోజులపాటు వరంగల్‌లోనే ఉన్నారు. ఈ సందర్భంగా మురికి వాడల్లో పర్యటించిన సీఎం అనూహ్యంగా తొమ్మిది మురికి వాడల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కేవలం రెండు కాలనీల్లోనే ఇంటి నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. మిగిలిన కాలనీల్లో ఇంటి నిర్మాణాలపై స్తబ్దత నెలకొంది. ఈసారి జూలై 9,10 తేదీల్లో సీఎం నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పనుల్లో కదలిక వచ్చేందుకు ఆస్కారం ఉంది. మందకకొడిగా సాగుతున్న ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు పనులు వేగం పుంజుకోనున్నాయి. -
త్వరలో మరో మహిళా డిగ్రీ కళాశాల
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో మహిళా విద్యను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు కాకినాడలో మాత్రమే మహిళా డిగ్రీ కళాశాల ఉంది. రెండో కళాశాలను అమలాపురంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నెలకొల్పనున్నారు. అమలాపురంలో ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల ఉంది. ప్రభుత్వం నియమించిన కమిటీ అమలాపురంలో సోమవారం పర్యటించి అధ్యయనం చేసింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కమిటీ సందర్శించింది. కోనసీమలో ఉన్న 29 ప్రైవేటు జూని యర్ కళాశాలలో దాదాపు 6,600 మంది బాలికలు చదువుతున్నట్టు కమిటీ గుర్తించింది. రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణ, అధ్యాపకుడు కె.శ్రీనివాసరావుతో కూడిన బృందం ఈ అధ్యయనం చేసింది. అమలాపురం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కేఎస్ రాజబాబు బృందానికి వివరాలు అందజేశారు. డిగ్రీ కళాశాలకు 24 మంది అధ్యాపకు లు, 12 మంది అధ్యాపకేతర సిబ్బంది అవసరమని కమిటీ ప్రభుత్వానికి సమర్పించనున్న నివేదికలో పేర్కొం ది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రస్తుతం అమలాపురంలో ఉన్న ప్రభు త్వ జూనియర్ బాలికల కళాశాలలోనే మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు కమిటీ ప్రతినిధి చప్పిడి కృష్ణ సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ విభాగాల్లో తరగతికి 60 మంది విద్యార్థుల చొప్పున కళాశాల ప్రారంభం కానుం ది. జిల్లా మంత్రి తోట నరసింహం అమలాపురంలో కళాశాల ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తెచ్చా రు. సీఎం ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించడంతో కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. -
ఎయిడ్స్ నిర్మూలనకు కృషి
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎయిడ్స్ నిర్మూలనలో యువతను భాగస్వామ్యం చేసేందుకు విద్యాసంస్థలు కీలకపాత్ర పోషించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీశాక్స్) ఆధ్వర్యంలో రెడ్ రిబ్బన్‌క్లబ్ మాస్టర్ ట్రైనీలకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవీ-ఎయిడ్స్‌పై వివిధ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను చైతన్యపరిచినందుకు 16 మంది మాస్టర్ట్రైనీలను ఈ సందర్భంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. వీరీలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఐ.నాగేశ్వరరావు(జేకేసీ కళాశాల-గుంటూరు), వి. వెంకటేష్ (ఎస్‌కేవీబీఆర్ కళాశాల-నరసరావుపేట), బి. మాధవిగ్లోరి(ఎస్వీఆర్ఎం కళాశాల-నగరం)లను సత్కరించారు. అదే విధంగా విద్యార్థులను చైతన్య పర్చడంలో కృషిచేసినందుకు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (బాపట్ల), పీఎన్సీ అండ్ కేఆర్ కళాశాల (నరసరావుపేట), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(గుంటూరు)లకు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకటించారు. కార్యక్రమంలో కళాశాల విద్య ఆర్జేడీ ఎం. ప్రసాదరావు, కళాశాల ఇన్చార్జ్ సీహెచ్ పుల్లారెడ్డి, రెడ్‌రిబ్బన్ క్లబ్ జిల్లా కో-ఆర్డినేటర్ బాలిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.