మాట్లాడుతున్న ఎంపీ తలారి రంగయ్య
సాక్షి, అనంతపురం: తొలి ప్రయత్నంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించలేకపోయినా.. తర్వాత కష్టపడి చదువుకుని గ్రూప్–1 అధికారినయ్యానంటూ అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య అన్నారు. మంగళవారం స్థానిక కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డేలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని, ఇందుకు తన జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒకేచోట ఉంటే వ్యక్తిగతంగా, సమాజపరంగా ఎలాంటి అభివృద్ధి సాధించలేమన్నారు. తాను మొదట ఎస్‌ఐ ఉద్యోగం సాధించి అక్కడితో ఆగిపోకుండా ప్రయత్నించి గ్రూప్–1 ఆఫీసర్‌గా మారినట్లు వివరించారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైనట్లు గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఆడపిల్లలంటే ఎంతో గౌరవమన్నారు. ఇంగ్లిష్‌పై పట్టుసాధిస్తే విరివిగా ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. సమాజ సేవ చేయాలనే ధృక్పథాన్ని అలవరుచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఎంపీకి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శంకరయ్య, రాజనీతిశాస్త్ర ఉపన్యాసకులు రామమూర్తి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment