Rangayya
-
‘పది’ ఫెయిల్.. అయినా గ్రూప్–1 ఆఫీసర్నయ్యా
సాక్షి, అనంతపురం: తొలి ప్రయత్నంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించలేకపోయినా.. తర్వాత కష్టపడి చదువుకుని గ్రూప్–1 అధికారినయ్యానంటూ అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య అన్నారు. మంగళవారం స్థానిక కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డేలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని, ఇందుకు తన జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒకేచోట ఉంటే వ్యక్తిగతంగా, సమాజపరంగా ఎలాంటి అభివృద్ధి సాధించలేమన్నారు. తాను మొదట ఎస్ఐ ఉద్యోగం సాధించి అక్కడితో ఆగిపోకుండా ప్రయత్నించి గ్రూప్–1 ఆఫీసర్గా మారినట్లు వివరించారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైనట్లు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి మాట్లాడుతూ తనకు ఆడపిల్లలంటే ఎంతో గౌరవమన్నారు. ఇంగ్లిష్పై పట్టుసాధిస్తే విరివిగా ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. సమాజ సేవ చేయాలనే ధృక్పథాన్ని అలవరుచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఎంపీకి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శంకరయ్య, రాజనీతిశాస్త్ర ఉపన్యాసకులు రామమూర్తి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
అధైర్యం వద్దు..
అమ్రాబాద్/కోడేరు/కొల్లాపూర్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను బుధవారం మహానేత కూతురు వైఎస్ షర్మిల పరామర్శించారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. మొదట అమ్రాబాద్కు చెందిన పర్వతనేని (బోగం) రంగయ్య కుటుంబాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు షర్మిలకు పూలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం షర్మిల రంగయ్య, వైఎస్ఆర్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. రంగయ్య భార్య అనసూయమ్మను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ మరణవార్తను టీవీలో చూస్తూ గుండెపోటుతో చనిపోయాడని కుటుంబసభ్యులు ఆమెకు వివరించారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని షర్మిల వారిని ఓదార్చారు. నాన్న మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు జగనన్న మాట ఇచ్చారని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లలను మంచిగా చదివించాలని సూచించారు. అనంతరం కోడేరు మండలం ఎత్తం గ్రామంలో వైఎస్ఆర్ మరణ వార్త విని చనిపోయిన పుట్టపాగ నర్సింహా కుటుంబాన్ని షర్మిల పరామర్శించి ఓదార్చారు. కుటుంబస్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. నర్సింహాకు వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని, ఆయన వార్తలను టీవీల్లో చూస్తుండేవారని, మహానేత మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడని మృతుని భార్య శంకరమ్మ, కొడుకు రామస్వామి, కూతురు కవిత రోదిస్తూ వివరించారు. ఉన్నత చదువులు చదవాలని, ఖర్చులు తాము భరిస్తామని నర్సింహా కూతురు కవితకు షర్మిల భరోసాఇచ్చారు. కూలీనాలి పనులు చేస్తూ తన భర్తచేసిన అప్పులను తీరుస్తున్నానని శంకరమ్మ అన్నారు. అధైర్యపడొద్దని తమవంతు సహాయం అందిస్తామని షర్మిల వెన్నుతట్టారు. అధైర్యపడొద్దు.. మీ కుటుంబానికి అండగా మేముంటామని కటికె రామచందర్ కుటుంబసభ్యులకు వైఎస్ షర్మిల భరోసాఇచ్చారు. వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కొల్లాపూర్ వాసి కటెక రామచందర్ కుటుంబాన్ని మంగళవారం రాత్రి ఆమె పరామర్శించి.. అతని భార్య శంకరాబాయి అడిగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు.