అధైర్యం వద్దు..
అమ్రాబాద్/కోడేరు/కొల్లాపూర్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను బుధవారం మహానేత కూతురు వైఎస్ షర్మిల పరామర్శించారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. మొదట అమ్రాబాద్‌కు చెందిన పర్వతనేని (బోగం) రంగయ్య కుటుంబాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు షర్మిలకు పూలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం షర్మిల రంగయ్య, వైఎస్‌ఆర్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. రంగయ్య భార్య అనసూయమ్మను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ మరణవార్తను టీవీలో చూస్తూ గుండెపోటుతో చనిపోయాడని కుటుంబసభ్యులు ఆమెకు వివరించారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని షర్మిల వారిని ఓదార్చారు. నాన్న మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు జగనన్న మాట ఇచ్చారని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లలను మంచిగా చదివించాలని సూచించారు.
అనంతరం కోడేరు మండలం ఎత్తం గ్రామంలో వైఎస్‌ఆర్ మరణ వార్త విని చనిపోయిన పుట్టపాగ నర్సింహా కుటుంబాన్ని షర్మిల పరామర్శించి ఓదార్చారు. కుటుంబస్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. నర్సింహాకు వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని, ఆయన వార్తలను టీవీల్లో చూస్తుండేవారని, మహానేత మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడని మృతుని భార్య శంకరమ్మ, కొడుకు రామస్వామి, కూతురు కవిత రోదిస్తూ వివరించారు. ఉన్నత చదువులు చదవాలని, ఖర్చులు తాము భరిస్తామని నర్సింహా కూతురు కవితకు షర్మిల భరోసాఇచ్చారు. కూలీనాలి పనులు చేస్తూ తన భర్తచేసిన అప్పులను తీరుస్తున్నానని శంకరమ్మ అన్నారు. అధైర్యపడొద్దని తమవంతు సహాయం అందిస్తామని షర్మిల వెన్నుతట్టారు.
అధైర్యపడొద్దు.. మీ కుటుంబానికి అండగా మేముంటామని కటికె రామచందర్ కుటుంబసభ్యులకు వైఎస్ షర్మిల భరోసాఇచ్చారు. వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కొల్లాపూర్ వాసి కటెక రామచందర్ కుటుంబాన్ని మంగళవారం రాత్రి ఆమె పరామర్శించి.. అతని భార్య శంకరాబాయి అడిగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు.