‘ల్యాండ్‌పూలింగ్’కు చిక్కులు!
- ప్రతాప్‌సింగారం మెగా వెంచర్‌కు అడ్డంకులు
- సర్వే దశలోనే చతికిలబడ్డ హెచ్‌ఎండీఏ
- సరిహద్దులు తేలక ప్రాజెక్టు పక్కదారి..
సాక్షి, సిటీబ్యూరో: భూ అభివృద్ధి పథకం ద్వారా నగర శివార్లలో మరోసారి రియల్ బూమ్‌ను సృష్టించాలనుకొన్న హెచ్‌ఎండీఏకు చుక్కెదురైంది. భూములిచ్చేందుకు రైతులు ముందుకొచ్చినా...వాటిని అభివృద్ధి చేసేందుకు సవాలక్ష ఆంక్షలను సాకుగా చూపుతూ హెచ్‌ఎండీఏ వెనుకడుగు వేస్తోంది. ముఖ్యంగా భూముల సరిహద్దులు తేలడం లేదంటూ... సర్వే దశలోనే చతికిలబడ్డ అధికారులు తమ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఏకంగా ‘ల్యాండ్ పూలింగ్ స్కీం’కే తిలోదకాలిచ్చేందుకు పూనుకొన్నారు.
ఫలితంగా శివారు ప్రాంతాల్లోని భూముల్లో సిరులు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. భూ అభివృద్ధి పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం) కింద నగరం చుట్టుపక్క ప్రాంతాల్లోని రైతుల నుంచి భూమిని సేకరించి కొత్త లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలని ఏడాది క్రితం హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. రైతులకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో 40 శాతం భూమి (ప్లాట్లు) తిరిగి అప్పగించాలనుకొంది.
ఆయా లేఅవుట్లలో రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక అవసరాలకు కొంత భూమిని మినహాయించి అభివృద్ధి చేసినందుకు గాను మిగతా భూమిని హెచ్‌ఎండీఏ తీసుకొంటుంది. ఇదీ... ల్యాండ్ పూలింగ్ స్కీం ఉద్దేశం. ఈ మేరకు ఉప్పల్‌కు సమీపంలోని ప్రతాప్‌సింగారం వద్ద మూసీని ఆనుకొని ఉన్న 300ల ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. ఇక్కడ కొత్త లేఅవుట్ అభివృద్ధికి భూ సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపిన హెచ్‌ఎండీఏ ఆ తర్వాత మనసు మార్చుకొంది.
ప్రతాప్‌సింగారం వద్ద 300 ఎకరాల భూముల్లో రెవిన్యూ, హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ విభాగాల సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే నిర్వహించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న భూములకు, రికార్డుల్లోని భూములకు పొంతనే లేదని, పైగా సరిహద్దులు కూడా పక్కాగా తేలడం లేదంటున్నారు. రికార్డుల్లో ఉన్న భూ యజమాని పేర్లు, ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్న యజమాని పేర్లకు సంబంధం లేకుండా ఉందని, వీటిని సేకరిస్తే కోర్టు వివాదాలు ఉత్పన్నమవుతాయన్న కారణాన్ని సాకుగా చూపుతూ ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టేసినట్లు సమాచారం.
ఆశ అడియాసే...
తమ భూములను హెచ్‌ఎండీఏకు ఇస్తే (60-40 ప్రాతిపదికన) అభివృద్ధి చేసిన ప్లాట్లు వస్తాయని ఆశించిన చిన్న, సన్నకారు రైతులకు నిరాశే మిగిలింది. అర ఎకరం భూమినిస్తే వెయ్యి చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్ దక్కుతుందని, దీన్ని అమ్ముకోవడం ద్వారా ఆర్థికంగా సమస్యలను నుంచి బయటపడవచ్చని పేద రైతులు ఆశించారు.
కాగా, ఆయా భూముల్లో సర్వే నిర్వహించిన అధికారులు ఇక్కడ మొత్తం 450 మంది రైతులకు చెందిన భూములున్నట్లు గుర్తించారు. ఎక్కడ భూమి తీసుకొంటే అక్కడే ప్లాట్ ఇవ్వాలన్నది నిబంధన. ఒకేచోట నాలుగైదు ఎకరాల భూమి ఉన్నరైతులకు ఇది సాధ్యమే. అయితే... మొత్తం రైతుల్లో 1/2 ఎకరా భూమి ఉన్నవారే ఎక్కువగా ఉండటంతో రోడ్లు, పార్కు వంటి వాటి కి భూములు పోయిన వారికి అక్కడే ప్లాట్లు ఇవ్వడం అసాధ్యంగా మారింది.
ఇదే విషయమై చివర్లో రైతులు మెలికపెడితే చిక్కులు ఎదురవుతాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే ప్రాజెక్టును పక్కకు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో జాప్యంపై సంబంధిత అధికారిని వివరణ కోరగా ఫిజికల్ సర్వేలో ఆయా భూములు రెవిన్యూ రికార్డుల్లోని సరిహద్దుతో మ్యాచ్ కావట్లేదని, ఇప్పుడు వీటిని సరిచేసే పనిలో నిమగ్నమయ్యామని సమాధానం ఇచ్చారు.