land development
-
భారతీ రియల్టీకి ఏరోసిటీ డెవలప్మెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:ఏరోసిటీ కమర్షియల్ డెవలప్మెంట్ పనులను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) తాజాగా భారతీ రియల్టీ కన్సార్షియంకు అప్పగించింది. ఢిల్లీలోని ఏరోసిటీలో గేట్‌వే, డౌన్‌టౌన్ డిస్ట్రిక్ట్స్ డిజైన్, డెవలప్, ఫైనాన్స్, కన్స్ట్రక్ట్, ఆపరేట్, మేనేజ్, మెయింటెయిన్ ప్రాతిపదికన ఫేజ్–1లో 4.5 లక్షల చదరపు మీటర్లు, ఫేజ్–2లో సైతం ఇంతే విస్తీర్ణంలో కమర్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును కన్సార్షియం చేపట్టనుంది. ఫేజ్–1 అభివృద్ధికి గాను వార్షిక లీజు కింద 2036 వరకు ఏటా డీఐఏఎల్కు రూ.363.5 కోట్లను భారతీ రియల్టీ చెల్లించనుంది. దీనితోపాటు అదనంగా రూ.1,837 కోట్లు వన్ టైం పేమెంట్ చేయనుంది. గడువు మరో 30 ఏళ్లు పొడిగించినట్టయితే భారతీ రియల్టీ వార్షిక లీజు మొత్తంపై 50 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. భారతీ రియల్టీ ఫేజ్–2 ప్రాజెక్టు చేపట్టాలంటే ఫేజ్–1 మాదిరిగా అదనపు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. -
పనిచేయని ఎల్‌డీబీ బ్యాంకుల మూసివేత: సీఎం ఫడ్నవీస్
ముంబై: ఆగిపోయిన భూ అభివృద్ధి బ్యాంకులను మూసివేసి వాటి ఆస్తులను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పని చేయని బ్యాంకుల పరిస్థితిపై గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను తమ ప్రభుత్వం స్వీకరించిందని సీఎం ఫడ్నవీస్ మంగళవారం అన్నారు. వాటి ద్వారా 2,800 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రూ. 500 కోట్ల విలువైన బ్యాంకుల ఆస్తులను ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలా లేక అమ్మివేయాలా అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 1,046 మంది ఎల్‌డీబీ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకం సొమ్మును 2.5 రెట్లు పెంచామని, దీని విలువ రూ. 70.12 కోట్లని అన్నారు. వరికి రూ. 250 ప్రోత్సాహకాన్ని ఇస్తున్నామని ఆయన అన్నారు. ఈ మొత్తం రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని అన్నారు. ముడి చక్కెరకు మెట్రిక్ టన్నుకు రూ. 1000 ఎగుమతి సబ్సిడీ కూడా అందిస్తున్నామన్నారు. ఇది కేంద్రం ఇస్తున్న రూ. 4000కు అదనం అన్నారు. ఇప్పటి వరకు ఎనమిది నుంచి పది లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెర ఎగుమతి జరిగిందని చెప్పారు. అక్రమ నిల్వలను నిరోధించడానికి చక్కెర ఎగుమతి ఉపయోగపడుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రశ్నించగా యావత్మాల్, ఉస్మానాబాద్ జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలపై సర్వే పూర్తయిందని చెప్పారు. వ్యవసాయ సంక్షోభం ఎదుర్కొంటున్న రైతులకు నేరుగా సంక్షేమ పథకాలు అందటానికి ఐఏఎస్ అధికారులు నేతృత్వంలో సంబంధిత జిల్లాల్లో పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. -
16వేల ఎకరాల భూమి అన్యాక్రాంతం
రాజధాని పరిసరాల్లో దేవుడి భూమిలో వాణిజ్య సముదాయాలు వాటిని స్వాధీనం చేసుకుంటామన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు యాదగిరి గుట్టలో నేటి నుంచే అభివృద్ధి పనులు ప్రారంభం అధికారులతో మంత్రి సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 16,148 ఎకరాల దేవాదాయ, ధర్మాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అయినట్టు అధికారులు లెక్క తేల్చారు. వీటిలో అధిక భాగం వ్యవసాయ భూములుగా సాగుచేస్తుండగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నట్టు గుర్తించారు. రాజధాని పరిసరాల్లో దేవుడి భూమిని ఆక్రమించి వాణిజ్య సముదాయాలు నిర్మించినట్టు నిగ్గు తేల్చారు. దేవాదాయశాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి వివరాలు వెల్లడించారు. తెలంగాణలో ప్రధానమైన యాదగిరి గుట్ట, బాసర, వేములవాడ, భద్రాచలం ఆలయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. అన్యాక్రాంతమయిన దేవాదాయశాఖ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. దేవాదాయ, ధర్మాదాయ ట్రిబ్యునల్ ఇంకా అవిభాజ్యంగానే ఉన్నందున దాన్ని విభజించాక మరోసారి నిర్ధారించుకుని ఆక్రమణదారులపై చర్యలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శాఖలో సరిపడా సిబ్బంది లేనందున ఇంత వరకూ నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దేవాదాయశాఖకు మొత్తం 84 వేల ఎకరాల భూములున్నాయని, ఇందులో 12,386 ఎకరాల తరి భూములుండగా, 71,238 ఎకరాలు కుష్కి భూములున్నాయని వివరించారు. 37,087 ఎకరాలు అర్చకుల అధీనంలో ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆయా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు కొనసాగుతున్నాయని తెలిపారు. యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతిగా మార్చాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆలయ అభివృద్ధికి 14 వందల ఎకరాలమేర భూ సేకరణ చేపట్టనున్నామని, ప్రస్తుతానికి 200 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖకు బదిలీ చేసి ఇందులో అభివృద్ధి పనులను శనివారం నుంచే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు నడుంబిగించిందన్నారు. ఐదు జిల్లాల్లో 67 స్నాన ఘాట్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలు కల్పిస్తామని, దీని కోసం ఇప్పటికే రూ. 100 కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. జనవరిలో టెండర్లు పిలిచి సదుపాయాల కల్పన, స్నాన ఘాట్ల నిర్మాణం చేపడతామని మంత్రి వివరించారు. అక్షరాభ్యాస్యాలు అధికంగా నిర్వహించే జూన్ నెలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాసర సరస్వతి ఆలయంలో సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ధార్మిక పరిషత్తుల ఏర్పాటుకు అందిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరావుతో పాటు చీఫ్ ఇంజనీర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘ల్యాండ్‌పూలింగ్’కు చిక్కులు!
ప్రతాప్‌సింగారం మెగా వెంచర్‌కు అడ్డంకులు సర్వే దశలోనే చతికిలబడ్డ హెచ్ఎండీఏ సరిహద్దులు తేలక ప్రాజెక్టు పక్కదారి.. సాక్షి, సిటీబ్యూరో: భూ అభివృద్ధి పథకం ద్వారా నగర శివార్లలో మరోసారి రియల్ బూమ్‌ను సృష్టించాలనుకొన్న హెచ్ఎండీఏకు చుక్కెదురైంది. భూములిచ్చేందుకు రైతులు ముందుకొచ్చినా...వాటిని అభివృద్ధి చేసేందుకు సవాలక్ష ఆంక్షలను సాకుగా చూపుతూ హెచ్ఎండీఏ వెనుకడుగు వేస్తోంది. ముఖ్యంగా భూముల సరిహద్దులు తేలడం లేదంటూ... సర్వే దశలోనే చతికిలబడ్డ అధికారులు తమ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఏకంగా ‘ల్యాండ్ పూలింగ్ స్కీం’కే తిలోదకాలిచ్చేందుకు పూనుకొన్నారు. ఫలితంగా శివారు ప్రాంతాల్లోని భూముల్లో సిరులు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. భూ అభివృద్ధి పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం) కింద నగరం చుట్టుపక్క ప్రాంతాల్లోని రైతుల నుంచి భూమిని సేకరించి కొత్త లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలని ఏడాది క్రితం హెచ్ఎండీఏ నిర్ణయించింది. రైతులకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లో 40 శాతం భూమి (ప్లాట్లు) తిరిగి అప్పగించాలనుకొంది. ఆయా లేఅవుట్లలో రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక అవసరాలకు కొంత భూమిని మినహాయించి అభివృద్ధి చేసినందుకు గాను మిగతా భూమిని హెచ్ఎండీఏ తీసుకొంటుంది. ఇదీ... ల్యాండ్ పూలింగ్ స్కీం ఉద్దేశం. ఈ మేరకు ఉప్పల్‌కు సమీపంలోని ప్రతాప్‌సింగారం వద్ద మూసీని ఆనుకొని ఉన్న 300ల ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. ఇక్కడ కొత్త లేఅవుట్ అభివృద్ధికి భూ సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపిన హెచ్ఎండీఏ ఆ తర్వాత మనసు మార్చుకొంది. ప్రతాప్‌సింగారం వద్ద 300 ఎకరాల భూముల్లో రెవిన్యూ, హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగాల సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే నిర్వహించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న భూములకు, రికార్డుల్లోని భూములకు పొంతనే లేదని, పైగా సరిహద్దులు కూడా పక్కాగా తేలడం లేదంటున్నారు. రికార్డుల్లో ఉన్న భూ యజమాని పేర్లు, ప్రస్తుతం పొజిషన్లో ఉన్న యజమాని పేర్లకు సంబంధం లేకుండా ఉందని, వీటిని సేకరిస్తే కోర్టు వివాదాలు ఉత్పన్నమవుతాయన్న కారణాన్ని సాకుగా చూపుతూ ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టేసినట్లు సమాచారం. ఆశ అడియాసే... తమ భూములను హెచ్ఎండీఏకు ఇస్తే (60-40 ప్రాతిపదికన) అభివృద్ధి చేసిన ప్లాట్లు వస్తాయని ఆశించిన చిన్న, సన్నకారు రైతులకు నిరాశే మిగిలింది. అర ఎకరం భూమినిస్తే వెయ్యి చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్ దక్కుతుందని, దీన్ని అమ్ముకోవడం ద్వారా ఆర్థికంగా సమస్యలను నుంచి బయటపడవచ్చని పేద రైతులు ఆశించారు. కాగా, ఆయా భూముల్లో సర్వే నిర్వహించిన అధికారులు ఇక్కడ మొత్తం 450 మంది రైతులకు చెందిన భూములున్నట్లు గుర్తించారు. ఎక్కడ భూమి తీసుకొంటే అక్కడే ప్లాట్ ఇవ్వాలన్నది నిబంధన. ఒకేచోట నాలుగైదు ఎకరాల భూమి ఉన్నరైతులకు ఇది సాధ్యమే. అయితే... మొత్తం రైతుల్లో 1/2 ఎకరా భూమి ఉన్నవారే ఎక్కువగా ఉండటంతో రోడ్లు, పార్కు వంటి వాటి కి భూములు పోయిన వారికి అక్కడే ప్లాట్లు ఇవ్వడం అసాధ్యంగా మారింది. ఇదే విషయమై చివర్లో రైతులు మెలికపెడితే చిక్కులు ఎదురవుతాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే ప్రాజెక్టును పక్కకు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో జాప్యంపై సంబంధిత అధికారిని వివరణ కోరగా ఫిజికల్ సర్వేలో ఆయా భూములు రెవిన్యూ రికార్డుల్లోని సరిహద్దుతో మ్యాచ్ కావట్లేదని, ఇప్పుడు వీటిని సరిచేసే పనిలో నిమగ్నమయ్యామని సమాధానం ఇచ్చారు.