16వేల ఎకరాల భూమి అన్యాక్రాంతం
- రాజధాని పరిసరాల్లో దేవుడి భూమిలో వాణిజ్య సముదాయాలు
- వాటిని స్వాధీనం చేసుకుంటామన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
- యాదగిరి గుట్టలో నేటి నుంచే అభివృద్ధి పనులు ప్రారంభం
- అధికారులతో మంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 16,148 ఎకరాల దేవాదాయ, ధర్మాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అయినట్టు అధికారులు లెక్క తేల్చారు. వీటిలో అధిక భాగం వ్యవసాయ భూములుగా సాగుచేస్తుండగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నట్టు గుర్తించారు. రాజధాని పరిసరాల్లో దేవుడి భూమిని ఆక్రమించి వాణిజ్య సముదాయాలు నిర్మించినట్టు నిగ్గు తేల్చారు. దేవాదాయశాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం మంత్రి వివరాలు వెల్లడించారు. తెలంగాణలో ప్రధానమైన యాదగిరి గుట్ట, బాసర, వేములవాడ, భద్రాచలం ఆలయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. అన్యాక్రాంతమయిన దేవాదాయశాఖ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. దేవాదాయ, ధర్మాదాయ ట్రిబ్యునల్ ఇంకా అవిభాజ్యంగానే ఉన్నందున దాన్ని విభజించాక మరోసారి నిర్ధారించుకుని ఆక్రమణదారులపై చర్యలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
శాఖలో సరిపడా సిబ్బంది లేనందున ఇంత వరకూ నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దేవాదాయశాఖకు మొత్తం 84 వేల ఎకరాల భూములున్నాయని, ఇందులో 12,386 ఎకరాల తరి భూములుండగా, 71,238 ఎకరాలు కుష్కి భూములున్నాయని వివరించారు. 37,087 ఎకరాలు అర్చకుల అధీనంలో ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆయా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతిగా మార్చాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆలయ అభివృద్ధికి 14 వందల ఎకరాలమేర భూ సేకరణ చేపట్టనున్నామని, ప్రస్తుతానికి 200 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖకు బదిలీ చేసి ఇందులో అభివృద్ధి పనులను శనివారం నుంచే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు నడుంబిగించిందన్నారు.
ఐదు జిల్లాల్లో 67 స్నాన ఘాట్‌లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలు కల్పిస్తామని, దీని కోసం ఇప్పటికే రూ. 100 కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. జనవరిలో టెండర్లు పిలిచి సదుపాయాల కల్పన, స్నాన ఘాట్‌ల నిర్మాణం చేపడతామని మంత్రి వివరించారు.
అక్షరాభ్యాస్యాలు అధికంగా నిర్వహించే జూన్ నెలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాసర సరస్వతి ఆలయంలో సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ధార్మిక పరిషత్తుల ఏర్పాటుకు అందిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరావుతో పాటు చీఫ్ ఇంజనీర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.