ముంబై: ఆగిపోయిన భూ అభివృద్ధి బ్యాంకులను మూసివేసి వాటి ఆస్తులను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పని చేయని బ్యాంకుల పరిస్థితిపై గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను తమ ప్రభుత్వం స్వీకరించిందని సీఎం ఫడ్నవీస్ మంగళవారం అన్నారు. వాటి ద్వారా 2,800 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రూ. 500 కోట్ల విలువైన బ్యాంకుల ఆస్తులను ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలా లేక అమ్మివేయాలా అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 1,046 మంది ఎల్‌డీబీ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకం సొమ్మును 2.5 రెట్లు పెంచామని, దీని విలువ రూ. 70.12 కోట్లని అన్నారు. వరికి రూ. 250 ప్రోత్సాహకాన్ని ఇస్తున్నామని ఆయన అన్నారు. ఈ మొత్తం రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని అన్నారు.
ముడి చక్కెరకు మెట్రిక్ టన్నుకు రూ. 1000 ఎగుమతి సబ్సిడీ కూడా అందిస్తున్నామన్నారు. ఇది కేంద్రం ఇస్తున్న రూ. 4000కు అదనం అన్నారు. ఇప్పటి వరకు ఎనమిది నుంచి పది లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెర ఎగుమతి జరిగిందని చెప్పారు. అక్రమ నిల్వలను నిరోధించడానికి చక్కెర ఎగుమతి ఉపయోగపడుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రశ్నించగా యావత్మాల్, ఉస్మానాబాద్ జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలపై సర్వే పూర్తయిందని చెప్పారు. వ్యవసాయ సంక్షోభం ఎదుర్కొంటున్న రైతులకు నేరుగా సంక్షేమ పథకాలు అందటానికి ఐఏఎస్ అధికారులు నేతృత్వంలో సంబంధిత జిల్లాల్లో పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు.
పనిచేయని ఎల్‌డీబీ బ్యాంకుల మూసివేత: సీఎం ఫడ్నవీస్
Published Tue, May 12 2015 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement