భాగ్యనగరికి ఐటీ హారం | Hyderabad IT denominator | Sakshi
Sakshi News home page

భాగ్యనగరికి ఐటీ హారం

Published Sun, Sep 22 2013 3:44 AM | Last Updated on Mon, Oct 22 2018 7:57 PM

భాగ్యనగరికి ఐటీ హారం - Sakshi

భాగ్యనగరికి ఐటీ హారం

 సాక్షి, సిటీబ్యూరో, రాయదుర్గం/మాదాపూర్, న్యూస్‌లైన్: ‘భాగ్య’నగర కంఠసీమలో మరో మణిహారం చేరనుంది. అంతర్జాతీయ ఐటీ హబ్‌గా హైదరాబాద్ మారనుంది. నగరంలో ఐటీ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో నగరం ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుంది. సిటీలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగం పుంజుకోనుంది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం స్తబ్దుగా ఉన్న రియల్టీకి తాజా ఐటీఐఆర్ ప్రాజెక్టు ఊపిరి పీల్చుకునేలా చేసింది.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇప్పటికే నగరంలో కొలువుదీరాయి. అయితే నాలుగేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కొన్ని సంస్థలు ఇక్కడ ఐటీ కంపెనీలు పెట్టేందుకు వెనుకడుగేశాయి. రియల్‌ఎస్టేట్ కూడా మందగించింది. ఈ తరుణంలో తాజా ప్రకటన మళ్లీ నగరంలో రియల్ బూమ్ పెరిగేందుకు దోహదపడనుంది. 202 చదరపు కిలోమీటర్ల (50 వేల ఎకరాల) పరిధిలో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, హార్డ్‌వేర్ కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిధి పూర్తిగా నగరంలోనే ఉండటంతో నగరంలో పలు రియల్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఐటీఐఆర్ ఏర్పాటు చేసేది ఇక్కడే..

ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా నగరంలో మొత్తం 50 వేల ఎక రాల పరిధిలో మూడు క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో) పరిధిలో 86.7 చదరపు కిలోమీటర్లలో ఒకటి, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం) పరిధిలో  79.2 చదరపు కిలోమీటర్ల మేర మరొకటి, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో 10.3 చదరపు కిలోమీటర్ల మేర మరో క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు క్లస్లర్ల పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. వీటిని అనుసంధానిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి. పరిధిలో, ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి. పరిధిలో కూడా ఐటీఐఆర్‌ను అనుమతిస్తారు. దీన్ని 25 ఏళ్లలో (2013 నుంచి 2038 వరకూ) రెండు దశల్లో మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు.

‘మెట్రో’తో మరింత జోష్


 ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు మెట్రో రైల్ మరింత జోష్‌ను పెంచింది. ఐటీఐఆర్ ప్రతిపాదించిన మొదటి, మూడో క్లస్టర్లలో ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాలుండడం అదనపు అంశం. దీంతో ఈ ప్రాంతాల్లో ఇప్పుటికే అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతోంది. క్లస్టర్-1 పరిధిలో సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్‌లతో మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, మియాపూర్, నానక్‌రాంగూడ, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల వరకు అభివృద్ధి శరవేగంగా జరిగింది.

మియాపూర్‌లో 55 ఎకరాల్లో సుమారు రూ. 100 కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద బస్ టర్మినల్‌ను నిర్మించనున్నారు. ఇదే ప్రాంతంలో 104 ఎకరాల్లో మెట్రో రైల్వే డిపోను కూడా నిర్మించనున్నారు. దీనికి తోడు మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్ని హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ‘పారిశ్రామిక జోన్’గా ప్రకటించింది. దీంతో పలు  కంపెనీలు సంస్థల్ని ఏర్పా టు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

 మెట్రో కారిడార్-1లో భాగంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు  28.87 కి.మీ. మెట్రో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎస్‌ఆర్ నగర్ మార్గాల్లో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారుల విస్తరణ, పిల్లర్లపై సెగ్మెంట్ల అమరిక జరుగుతోంది. 2015 ఆగస్టుకి ఈ మార్గంలో పనులు పూర్తిచేస్తామని ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి. మెట్రో కారిడార్లలో మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైటెక్ సిటీ ఎదురుగా 2 లక్షల చ.అ. విస్తీర్ణంలో 2 మెట్రో మాల్స్‌ను నిర్మిం చేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.
 
 క్లస్టర్3 పరిధిలో విశేష అభివృద్ధి

 క్లస్టర్-3లోని ఉప్పల్, పోచారం ప్రాంతాలకు దగ్గర్లోని ప్రతిపాదిత నాగోల్-శిల్పారామం మెట్రోరైలు మార్గంలో ఉప్పల్, హబ్సిగూడల్లో స్టేషన్లు రానున్నాయి. మెట్రో రానుండటంతో ఇక్కడ రియల్ వ్యాపారం కూడా జోరుగానే సాగుతుంది. హెచ్‌ఎండీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్-2031లో ఉప్పల్ ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి వస్తుంది. పోచారంలోని రహేజా మైండ్‌స్పేస్, ఇన్ఫోసిస్, ఐటీ సెజ్ కంపెనీలతో ఈ ప్రాంతం హాట్‌కేక్‌లా మారింది. ‘ఎరేనా టౌన్‌సెంటర్’లో ఎన్‌ఎస్‌ఎల్ సంస్థ ఏకంగా 26 అంతస్తులతో పది టవర్లను నిర్మించింది. దీంతో బడా బడా నిర్మాణ సంస్థలు, దేశ, విదేశీ సంస్థలు ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తున్నాయి.

రామంతాపూర్ వెళ్లే మార్గంలో 36 ఎకరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత సెజ్‌ను నూజివీడు సీడ్స్ ఏర్పాటు చేసింది. భాగ్యనగర్ మెటల్స్, ఐకానిక్, స్పేస్ డెవలపర్స్ సంస్థలు ఈ ప్రాంతంలో ఐటీ పార్కుల్ని ఏర్పాటు చేయనున్నాయి. జోడిమెట్ల చౌరస్తా నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో 23 ఎకరాల్లో చెన్నమనేని ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ‘ఆవలోన్ కోట్స్’ పేరుతో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇదే ప్రాంతంలో సత్యవాణి కన్‌స్ట్రక్షన్స్, మోడీ బిల్డర్స్, సురానా కంపెనీ వంటి వివిధ సంస్థల భారీ నివాస సముదాయాలు, మల్టీప్లెక్స్‌లు కూడా రానున్నాయి.

ఇప్పటికే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోరైల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాగోల్ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 100 ఎకరాల్లో రైల్వే డిపోను అభివృద్ధి చేయబోతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానిస్తూ నాగోలు-గౌరెల్లి రేడియల్ రోడ్డు కూడా ఏర్పాటు కానుంది. ఎల్బీనగర్ ఓపెన్ స్టేడియంలో 1.5 ఎకరాల్లో 1.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో మెట్రో మాల్స్ ఏర్పాటుకు మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో విశేషంగా అభివృద్ధి జరగనుంది.
 
  మార్కెట్ అభివృద్ధి చెందుతుంది
 హైదరాబాద్ అంతర్జాతీయ హబ్ గా మారుతుంది. మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ స్థాయి మల్టిప్లెక్స్‌లు, షా పింగ్‌మాళ్లు, భారీ నివాస సముదాయాలు వస్తాయి. మాదాపూర్, గచ్చిబౌలిలను మించిన ఐటీ రంగ అభివృద్ధి ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వరకు జరుగుతుంది. ఎక్కడిక్కడ శాటిలైట్ నగరాలు వెలుస్తాయి.
 -  జైవీర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్
 
 సద్వినియోగం చేసుకోవాలి
 ఐటీ రంగంలో హైదరాబాద్ నాల్గో స్థానంలో ఉంది. ఐటీఐఆర్‌తో మొదటి స్థానానికి వెళ్తుందని ఆశిస్తున్నాం. హైదరాబాద్‌లో ఉన్న మౌలిక వసతులు, మెట్రో, ఓఆర్‌ఆర్, అనుకూలమైన వాతావరణం వంటి కారణంగానే ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌కు ఐటీఐఆర్ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
  - శేఖర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు
 
 నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
 హైదరాబాద్‌కు ఫ్యాబ్ సిటీ, లేపాక్షి నాలెడ్జ్ సెంటర్, గేమింగ్ అండ్ యానిమేషన్ సిటీ, రిలయన్స్ 100 అంతస్తుల సెజ్, హార్డ్ పార్క్ ప్రాజెక్టులు వస్తాయన్నారు. కానీ అవేమీ రాలే దు. వీటి పేర్లు చెప్పుకొని రియల్టర్లు బాగుపడ్డారే తప్ప ఉద్యోగాలేమీ రాలేదు. బోగస్ కంపెనీల మాయలో పడి ఐటీ ఉద్యోగులు మోసపోయారు. కనీసం ఇప్పుడైనా అలా జరగకుండా ఐటీఐఆర్‌ను పూర్తి చేయాలి.
 - నరేందర్, సీనియర్ సిస్టమ్స్ ఇంజినీర్
 
 వైఎస్ హయాంలోనే ప్రతిపాదనలు  
 హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చ డం అభినందనీయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ఐటీఐఆర్ ప్రతిపాదనలున్నాయి. ఇప్పుడు ఆమోదానికి నోచుకున్నాయి. కొత్త ప్రతిపాదనలతో లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. సిటీలోనే కాకుండా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఐటీ సంస్థలను ఏర్పాటు చేస్తే బాగుండేది. - మధుమూర్తి రొనంకి,
 కో ఫౌండర్, అధ్యక్షులు, ట్యాలెంట్ స్ప్రింట్ సంస్థ
 
 మౌలిక వసతులు కల్పించాలి
 కొత్తగా ఐటీ రంగంలో రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండడంతో ప్రత్యకంగా, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి వ స్తుంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రస్తుతం ఉన్న మౌలికవసతులను మరింతగా మెరుగు పర్చాలి. ్రపస్తుతం ఉన్న జనాభా స్థాయిలో కొత్తగా నగరానికి వచ్చే అవకాశం ఉంది. అందుకోసం శివారు ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్స్ నిర్మించాలి.  
 -  డి.శ్రీనివాస్‌కుమార్, ఐటీ ఉద్యోగి
 
 హైదరాబాద్‌కు మంచి గుర్తింపు
 కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు రావడం వల్ల సాంకేతికపరంగా హైదరాబాద్ మంచి గుర్తింపు పొందుతుంది. ఎంప్లాయ్‌మెంట్, గేమింగ్, ఐటీ రంగాల్లో రాబోయే తరాల వారికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలుంటాయి. వారి వల్ల మరింతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. రా్రష్టంలోని ప్రస్తుత వాతావరణం ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలి.
 - కిరణ్-డిలాయిట్ ఐటీ ఉద్యోగి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement