IT Technology
-
ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం.. చివరికి ఏమైందంటే?
బెంగళూరు : మంచి కంపెనీ. సంస్థ పేరుకు తగ్గట్లు ప్యాకేజీ. అందుకే ఓ టెక్కీ ఆ ఆ భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. కేవలం నాలుగు రౌండ్లు జరిగే ఒక్క ఇంటర్వ్యూ కోసమే ఏడు నెలలు కష్టపడ్డాడు. అలా అని సదరు టెక్కీ.. క్ బెంచ్ స్టూడెంటా అంటే అదీ కాదు. చదువులో టాపర్. ఎంఎన్ఎన్ఐటీ అలహాబాద్ పూర్వ విద్యార్థి. మరి ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలలు ఎందుకు కష్టపడాల్సి వచ్చిందని అడిగితే.. సదరు టెక్కీ ఏం చెప్పారంటే?ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాకు చెందిన చిత్రాంశ ఆనంద్. భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఒరాకిల్‌లో కంపెనీలో రెండేళ్ల పాటు పనిచేశాడు. ఏడాదికి రూ.40 లక్షలు ప్యాకేజీ. మంచి శాలరీ, అనుభవం కోసం మరో కంపెనీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేశాడు. చివరికి ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌లో తన అనుభవానికి తగ్గట్లు ఉద్యోగం ఉందని తెలుసుకుని అప్లయి చేశాడు.అనంతరం తన ఇంటర్వ్యూల కోసం ఏడు నెలల రీసెర్చ్ చేశాడు. రేయింబవళ్లు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యాడు. ఇందుకోసం లీట్‌కోడ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నాడు. ఇందులో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో నిర్వహించే టెక్నికల్ రౌండ్‌ను ఎలా చేధించవచ్చో తెలుసుకోవచ్చు. అలా ఏడు నెలల అనంతరం ఉబెర్ ఇంట్వ్యూకి అటెండ్ అయ్యాడు. నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూలో బోర్డ్ సభ్యులు అడిగిన రెండు ప్రశ్నలకు నేను చదవిన చదువుకు.. సంబంధం లేదు. అయినప్పటికీ వాటికి ఆన్సర్ ఇచ్చాడు. ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. రూ.60లక్షలు ఇచ్చేందుకు ఉబర్ ముందుకు రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.ఈ సందర్భంగా ఆనంద్ ఒరాకిల్,ఉబర్‌లో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాడు. ఒరాకిల్‌లో ఐదు రోజులకు మూడురోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి వచ్చింది. ఉబర్‌లో వారానికి రెండు రోజులు మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ అవసరమైతే ఎక్కువ గంటలు పనిచేస్తా. అందులో నాకెలాంటి అభ్యంతరం లేదు. నా కెరియర్ ప్రారంభంలో ఉంది కాబట్టి ఆఫీస్- పర్సనల్ లైఫ్ విషయాల్లో ఎలాంటి ఆందోళన చెందడం లేదు. నేను అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి పనిచేయాలి. ఆ తర్వాత లైఫ్ బ్యాలెన్స్ విషయాలపై దృష్టిసారిస్తా అని చెప్పుకొచ్చాడు. -
అమెరికాలో నివసిస్తున్న ఇండియన్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త!
ఆర్ధిక మాంద్యం దెబ్బకు చేస్తున్న ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. దీంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్న భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘దేశీయ వీసా రీవాలిడేషన్’ పేరుతో హెచ్-1బీ, ఎల్1 వీసాలను అమెరికాలోనే పునరుద్దరించే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం అమెరికాలో లేఆఫ్స్‌కు గురై.. కొత్త జాబ్ కోసం అన్వేషిస్తున్న వారికి భారీ ఊరట కలగనుంది. 2004 కి ముందు వీసా పునరుద్ధరణ లేదా స్టాంపింగ్ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, మార్పులు చేయడంతో హెచ్-1బీ వీసా దారులు రెన్యువల్ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపులతో ఈ సమస్యను పరిష్కరించాలని జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వీసా ఉంటేనే ఎంట్రీ లేఆఫ్స్ గురైన ఉద్యోగులు వీసా పునరుద్దరించేందుకు సమయం పడుతుంది. ఆ లోగా వీసా గడువు దాటితే దేశం వదిలి వెళ్లి పోవాలి. లేదంటే కొత్త ఉద్యోగం వెతుక్కొని వీసా రెన్యూవల్ చేయించుకోవాలి. అక్కడే వీసా లబ్ధి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వీసా రెన్యూవల్, ఉన్న ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం దొరుకుతుందా? లేదా? అన్న సందిగ్ధంతో ఆందోళన చెందుతున్నారు. జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి ఈ ఆందోళనలపై అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీసాల రెన్యూవల్ విషయంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో వీసాల విషయంలో జోబైడెన్ ప్రభుత్వం విధించిన నిబంధనల్ని సడలించింది. వీసా రెన్యూవల్ కోసం కొత్త కొత్త పథకాల్ని అందుబాటులోకి తెస్తుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం వీసా రెన్యూవల్‌ను చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. విదేశీ ఉద్యోగులు వీసా రెన్యూవల్లో ఇబ్బందులు పడకుండా వీసాల పునరుద్దరణ (రెన్యూవల్), స్టాంపింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇబ్బందుల్ని తొలగించాలనే సాధారణంగా ఆయా రంగాల్లో నిపుణులైన భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారికి హెచ్-1బీ వీసా తప్పని సరి. ఆ వీసాలను అమెరికన్ కంపెనీలు అభ్యర్ధులు అందిస్తాయి. అందుకే ఆ వీసాలకు భారీ ఎత్తున డిమాండ్ ఉంది. ప్రతి ఏడాది ఆ వీసాలు పొందిన చైనా, భారతీయులు వేలల్లో అమెరికాకు వెళుతుంటారు. అక్కడి వెళ్లిన వారు వీసా గడువు ముగిసి.. రెన్యూవల్ చేయించుకునే సమయంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఆ సమస్యల్ని అధిగమించేందుకు జోబైడెన్ ప్రభుత్వం నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (ఎన్ఐవీ) కేటగిరీల వీసా సేవల్ని పునఃప్రారంభించే ప్రణాళికలపై తీవ్రంగా కృషి చేస్తుంది.ఈ ఏడాది చివర్లో పైలట్‌ను ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం. వీసాలను పునరుద్ధరించడానికి దరఖాస్తుదారులు విదేశాలకు వెళ్లే అవసరాన్ని తగ్గిస్తుంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఎన్ని వీసాలో చెప్పలేం వీసాలను ఎన్ని పునరుద్దరిస్తారని విషయంపై యూఎస్ కాన్సులేట్ అధికారులు మాట్లాడుతూ.. వీసా రెన్యూవల్ ప్రాజెక్ట్ ప్రారంభంలో ఎంత మంది వీసా హోల్డర్లు అర్హులు అవుతారనే దానిపై స్పష్టత ఇవ్వలేం. తక్కువ సంఖ్యలో ప్రారంభించింది. దశల వారీ వీసాల జారీని పెంచుకుంటూ వెళతామని అన్నారు. -
బ్లాక్‌చైన్ టెక్నాలజీతో యువత బంగారు భవిష్యత్‌కు భరోసా
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలు! ఆర్థిక రంగానికి వెన్నెముకగా భావించే బ్యాంకింగ్ మొదలు సేవల రంగం వరకూ.. అన్నింటా ఆన్లైన్ కార్యకలాపాలే!! ఇలాంటి పరిస్థితుల్లో.. సదరు లావాదేవీలను పారదర్శకంగా.. ఎలాంటి లోపాలు లేకుండా.. హ్యాకింగ్‌కు గురికాకుండా నిర్వహించాల్సిన పరిస్థితి! ఇది ప్రత్యేకమైన సాంకేతికతతోనే సాధ్యం! అదే.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ!! అందుకే.. ఇప్పుడు బ్లాక్‌చైన్ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. సంస్థలు నైపుణ్యాలున్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి.. ఈ టెక్నాలజీతో ప్రయోజనాలు.. వినియోగిస్తున్న రంగాలు..అవసరమైన నైపుణ్యాలు.. అందుకోవడానికి మార్గాలపై ప్రత్యేక కథనం.. లావాదేవీలు వికేంద్రీకృత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తూ.. ఎలాంటి అవకతవకలు జరగకుండా.. హ్యాకింగ్‌కు గురికా కుండా..సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచేదే.. బ్లాక్ చైన్ టెక్నాలజీ. ముఖ్యంగా ప్రస్తుతం ఆర్థిక పరమైన లావా దేవీలు, భూముల రిజిస్ట్రేషన్, క్రిప్టో కరెన్సీ వంటివి ఆన్లై న్లోనే నిర్వహిస్తున్నారు. ఇలాంటి లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ రక్షణ కల్పిస్తుంది. గత కొన్నేళ్లుగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేక రంగాలకు విస్తరించింది. పటిష్ట సైబర్ రక్షణ నిర్దిష్టంగా ఒక లావాదేవీని వికేంద్రీకృత వ్యవస్థలో పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ వినియోగం, దానికి సంబంధించిన అప్లికేషన్స్‌పై పెద్ద కస రత్తే జరుగుతోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక పటి ష్టమైన సైబర్ రక్షణ వ్యవస్థగా పేర్కొనొచ్చు. ఏదైనా ఒక విలువైన లావాదేవీని నిర్వహించే సమయంలో.. అది ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాకింగ్‌కు గురి కాకుండా భద్రత కల్పించే టెక్నాలజీ ఇది. సదరు లావాదేవీ నిర్వహణలో పాల్పం చుకునే వ్యక్తులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిరోధించే డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్‌గా ఇది నిలుస్తోంది. వికేంద్రీకృత వ్యవస్థ బ్లాక్ చైన్ టెక్నాలజీ.. వికేంద్రీకృత విధానంలో.. లావా దేవీలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహిస్తుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. నగదు నిర్వహణ లేదా రుణ మంజూరు వంటి విషయాల్లో అనేక దశలు ఉంటాయి. ఒక్కో దశలో ఒక్కో వ్యక్తి/అధికారి కీలక పాత్ర పోషిస్తారు. కొన్నిసార్లు ఏదో ఒక దశలో ఎక్కడో ఒక చోట అవక తవకలకు ఆస్కారం ఉంటుంది. కానీ అదే లావాదేవీని బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో నిర్వహిస్తే..ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో.. ప్రతి లావాదేవీలో భాగస్వా ములైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్‌గా ఏర్పడతా యి. ఒక బ్లాక్‌లో ఉన్న వారితో కొత్త లావాదేవీ జరిగితే.. అది అంతకుముందే ఏర్పడిన బ్లాక్‌కు అనుబంధంగా మరో ప్రత్యేకమైన బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ చైన్ మాదిరిగా రూపొందుతాయి. ఈ మొత్తం చైన్‌లో ఏ బ్లాక్‌లోనైనా.. ఏ చిన్న మార్పు జరిగినా.. ఆ లావాదేవీ జరిగిన బ్లాక్‌లో నమోదవుతుంది. ఇది సదరు నెట్‌వర్క్‌లో నిక్షిప్తం అవుతుంది. దీంతో..ఏదైనా తేడా వస్తే.. సదరు చైన్‌లోని వారందరికీ తెలిసిపోతుంది. అం టే.. ఏ స్థాయిలోనూ ఏ ఒక్క వ్యక్తి కూడా సొంతంగా, అనధికారికంగా, ఎలాంటి మార్పు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా మోసాలు అరికట్టేందుకు సాధ్యమవుతుంది. ఒకవేళ సదరు లావాదేవీలో.. ఏదై నా మార్పు చేయాల్సి వస్తే.. సదరు డిస్ట్రిబ్యూటెడ్æనెట్ వర్క్‌లోని అధీకృత అధికారులు లేదా వ్యక్తులందరూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికోసం వారికి ప్రత్యేకంగా హ్యాష్ ‘కీ’ పేరిట పాస్వర్డ్ కేటాయిస్తారు. అన్ని రంగాలకు విస్తరణ వాస్తవానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీని.. దశాబ్ద కాలం క్రితమే బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం రూపొందించారు. క్రిప్టో కరెన్సీలో వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు ఉండవు. అంతా ఆన్లైన్లోనే సాగుతుంది. దీనికి సంబంధించి సైబర్ దాడుల నుంచి రక్షణతోపాటు, అవకతవకలు జరగకుండా ఈ టెక్నాలజీని వినియోగించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ పనితీరు అత్యంత సమర్థంగా ఉండ టంతో.. ఇతర రంగాలు దీన్ని అందిపుచ్చుకుంటు న్నాయి. ముఖ్యంగా నగదు, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్ రంగం బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రిటైల్, ఈ-కామర్స్, మొబైల్ వ్యాలెట్స్, హెల్త్‌కేర్ విభాగాలు నిలుస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో సైతం ఇటీవల కాలంలో బ్లాక్ చైన్ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ప్రధానం గా భూముల రిజిస్ట్రేషన్స్‌లో ఈ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఎన్నికల సంఘం కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయం తో.. ఓటర్ల జాబితాను అనుసంధానం చేయడంతో పాటు, ఎక్కడి నుంచైనా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేసే యోచనలో ఉంది. హెల్త్‌కేర్ రంగంలో.. రోగులకు నిర్వహించే పరీక్షల వివరాలను బ్లాక్‌చైన్ టెక్నాలజీ విధానంలో నమోదు చేస్తున్నారు. ఫలితంగా పారదర్శకంగా సదరు పరీక్షల నిర్వహణతోపాటు సమయం వృథా కాకుండా.. బ్లాక్ చైన్ టెక్నాలజీ దోహదపడుతోంది. కెరీర్ స్కోప్ ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ ఊపందుకుంది. సంస్థలు ఆన్లైన్ కార్యకలాపాల్లో పారదర్శకత, భద్రత కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీ నిపుణులను నియమించు కుంటున్నాయి. 2022 నాటికి అంతర్జాతీయంగా ఐటీ రంగంలోని కొలువుల్లో దాదాపు పదిహేను శాతం బ్లాక్ చైన్ టెక్నాలజీ విభాగంలోనే ఉంటాయని అంచనా. బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి ఆయా రంగాల్లోని కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్స్‌ను, ప్రోగ్రామ్స్‌ను రూపొందించడం తప్పనిసరిగా మారు తోంది. ముఖ్యంగా క్రిప్టోగ్రఫీ నెట్వర్క్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, గేమ్ థియరీ వంటి వాటికి సంబంధించి ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు పొందాలి. సాలిడిటీ ప్రోగ్రా మింగ్ నేర్చుకోవడం ద్వారా కూడా అవకాశాలు అందుకునే వీలుంది. కంప్యూటర్ సైన్స్‌కు అనుకూలం బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగం.. కంప్యూటర్ సైన్స్ విద్యా ర్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ ఆధారిత సెక్యూరిటీ వ్యవస్థగా పేర్కొంటున్న బ్లాక్ చైన్ టెక్నాలజీని రూపొందించడానికి అవసరమైన ప్రోగ్రా మింగ్, అల్గారిథమ్స్, డేటాస్ట్రక్చర్స్, జావా, ఆర్, పైథాన్ వంటివి సీఎస్ఈ విద్యార్థులు సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో సీఎస్ఈ అభ్యర్థులు బ్లాక్‌చైన్ రంగంలో రాణించేందుకు వీలుంటుంది. ప్రత్యేక కోర్సులు బ్లాక్‌చైన్ టెక్నాలజీ నిపుణులకు జాబ్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. దాంతో విద్యాసంస్థలు.. బ్లాక్‌చై న్పై ప్రత్యేక కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–హైదరాబాద్, ఐఐటీ-ముంబై వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. అదే విధంగా బ్లాక్‌చైన్ కౌన్సిల్, గవర్నమెంట్ బ్లాక్‌చైన్ అసోసియేషన్, సెంట్రల్ బ్లాక్‌చైన్ బాడీస్ ఆఫ్ అమెరికా, ఇతర మూక్స్ సైతం ఆన్లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నాయి. ఉద్యోగాలు గ్లాస్ డోర్ సంస్థ అంచనాల ప్రకారం-అంతర్జాతీయ స్థాయిలో బ్లాక్ చైన్ రంగంలో ఉద్యోగాలు గత ఏడాది మూడు వందల శాతం పెరిగాయి. మొత్తం ఉద్యోగాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అదే విధంగా లింక్డ్ ఇన్ సర్వే ప్రకారం-2020లో టాప్ మోస్ట్ జాబ్ సెర్చెస్‌లో బ్లాక్ చైన్ ముందంజలో నిలవగా.. బ్లాక్ చైన్ డెవలపర్ ఉద్యోగాలు 330 శాతం పెరిగాయి. బ్లాక్ చైన్.. జాబ్ ప్రొఫైల్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగంలో.. బ్లాక్ చైన్ డెవలపర్, బ్లాక్ చైన్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్, బ్లాక్ చైన్ యుఎక్స్ డిజైనర్, క్వాలిటీ ఇంజనీర్, కన్సల్టెంట్, బ్లాక్ చైన్ లీగల్ కన్సల్టెంట్, బ్లాక్ చైన్ ఇంజనీర్, అనలిస్ట్,సెక్యూరిటీ మేనేజర్, కమ్యూనిటీ మేనేజర్, జూని యర్ డెవలపర్స్ తదితర జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి. ఉపాధి వేదికలు ఇండియన్ బ్లాక్ చైన్ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో.. ఐటీ సంస్థలు, ఫైనాన్షియల్ రంగాలు ముందంజలో నిలుస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్-46 శాతం, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండ్ మాన్యు ఫ్యాక్చరింగ్-12 శాతం, ఎనర్జీ అండ్ యుటిలిటీస్-12 శాతం,హెల్త్‌కేర్-11 శాతం, ప్రభుత్వ విభాగాలు-8 శాతం, రిటైల్ అండ్ కస్టమర్ సర్వీసెస్-4 శాతం, ఎంటర్టైన్ మెంట్ అండ్ మీడియా-1శాతం మేర అవకాశాలు కల్పిస్తున్నాయి. టెక్ స్కిల్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగంలో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. దీనికి సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్వేర్స్, ప్రోగ్రామింగ్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌పై అవగాహన తప్పనిసరి. ప్రాథమికంగా కోడింగ్ స్కిల్స్, సి++, డాట్ నెట్, ఎక్స్ఎంఎల్, పైథాన్, డెవ్ అప్స్, జనరిక్ ఎస్క్యూ ఎల్, హెచ్‌టీఎంఎల్, డేటాసైన్స్, నెట్ వర్క్ ప్రొటోకాల్స్, యూఐ డిజైన్ తదితర స్కిల్స్ ఉండాలి. -
కోవిడ్ ముందస్తు స్థాయికి నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాలు కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకున్నాయని జాబ్ సైట్ ఇండీడ్ వెల్లడించింది. ఉద్యోగ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వివరించింది. ‘నియామకాలు 2020 ఫిబ్రవరి స్థాయికి చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే జూలైలో ఐటీ టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రకటనలు 19 శాతం అధికమయ్యాయి. ప్రాజెక్ట్ హెడ్, ఇంజనీర్ వంటి ఇతర ఐటీ ఉద్యోగాలకు ప్రకటనలు 8–16 శాతం పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమవడం, కోవిడ్ –19 సవాళ్ల చుట్టూ పనిచేయడానికి వ్యాపార సంస్థలు చేసే ప్రయత్నాలు భారతీయ జాబ్ మార్కెట్‌ను రికవరీ వైపు నెట్టా యని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు. టెక్ జాబ్స్ జోరు ఎక్కువగా కొనసాగుతున్నప్పటికీ, రిటైల్, ఫుడ్ రంగంలో తిరిగి డిమాం డ్ రావడం వృద్ధిని మరింతగా పెంచడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ కీలకంగా ఉందన్నారు. ప్రాధాన్యతలలో మార్పు.. కంపెనీలు, ఉద్యోగార్ధులకు పరిశుభ్రత ప్రధాన ప్రాధాన్యతగా మారింది. హౌజ్కీపర్స్, కేర్‌టేకర్స్, క్లీనర్స్ ఉద్యోగాలు 60 శాతం దూసుకెళ్లాయి. వెటెరినరీ, థెరపీ, పర్సనల్ కేర్, చైల్డ్ కేర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. ఉద్యోగార్ధుల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును సూచించే ధోరణి ఇది. అభ్యర్థుల్లో ఆసక్తి విషయంలో విమానయానం 25 శాతం, అకౌంటింగ్ 8, కస్టమర్ రిలేషన్స్ 7, అడ్మిన్ 6 శాతం తగ్గాయి. ఉద్యోగ వృద్ధి వేగవంతం అవుతూనే ఉంది. ఎక్కువ మంది కార్మికులు ఉద్యోగాలు వెతుకుతున్నారు. కార్మిక మార్కెట్ పునర్ ప్రారంభంతో ముడిపడి ఉన్న రంగాలు ముందంజలో ఉన్నాయి’ అని ఇండీడ్ వివరించింది. ఈ ట్రెండ్ రాబోయే నెలల్లో కొనసాగవచ్చన్న ఆశను కలిగిస్తున్నాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
భాగ్యనగరికి ఐటీ హారం
సాక్షి, సిటీబ్యూరో, రాయదుర్గం/మాదాపూర్, న్యూస్‌లైన్: ‘భాగ్య’నగర కంఠసీమలో మరో మణిహారం చేరనుంది. అంతర్జాతీయ ఐటీ హబ్‌గా హైదరాబాద్ మారనుంది. నగరంలో ఐటీ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో నగరం ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుంది. సిటీలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగం పుంజుకోనుంది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం స్తబ్దుగా ఉన్న రియల్టీకి తాజా ఐటీఐఆర్ ప్రాజెక్టు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటికే నగరంలో కొలువుదీరాయి. అయితే నాలుగేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కొన్ని సంస్థలు ఇక్కడ ఐటీ కంపెనీలు పెట్టేందుకు వెనుకడుగేశాయి. రియల్ఎస్టేట్ కూడా మందగించింది. ఈ తరుణంలో తాజా ప్రకటన మళ్లీ నగరంలో రియల్ బూమ్ పెరిగేందుకు దోహదపడనుంది. 202 చదరపు కిలోమీటర్ల (50 వేల ఎకరాల) పరిధిలో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, హార్డ్‌వేర్ కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిధి పూర్తిగా నగరంలోనే ఉండటంతో నగరంలో పలు రియల్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఐటీఐఆర్ ఏర్పాటు చేసేది ఇక్కడే.. ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా నగరంలో మొత్తం 50 వేల ఎక రాల పరిధిలో మూడు క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో) పరిధిలో 86.7 చదరపు కిలోమీటర్లలో ఒకటి, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం) పరిధిలో 79.2 చదరపు కిలోమీటర్ల మేర మరొకటి, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో 10.3 చదరపు కిలోమీటర్ల మేర మరో క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు క్లస్లర్ల పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. వీటిని అనుసంధానిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి. పరిధిలో, ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి. పరిధిలో కూడా ఐటీఐఆర్‌ను అనుమతిస్తారు. దీన్ని 25 ఏళ్లలో (2013 నుంచి 2038 వరకూ) రెండు దశల్లో మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. ‘మెట్రో’తో మరింత జోష్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు మెట్రో రైల్ మరింత జోష్‌ను పెంచింది. ఐటీఐఆర్ ప్రతిపాదించిన మొదటి, మూడో క్లస్టర్లలో ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాలుండడం అదనపు అంశం. దీంతో ఈ ప్రాంతాల్లో ఇప్పుటికే అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతోంది. క్లస్టర్-1 పరిధిలో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ కింద గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్‌లతో మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, మియాపూర్, నానక్‌రాంగూడ, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల వరకు అభివృద్ధి శరవేగంగా జరిగింది. మియాపూర్‌లో 55 ఎకరాల్లో సుమారు రూ. 100 కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద బస్ టర్మినల్‌ను నిర్మించనున్నారు. ఇదే ప్రాంతంలో 104 ఎకరాల్లో మెట్రో రైల్వే డిపోను కూడా నిర్మించనున్నారు. దీనికి తోడు మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్ని హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ‘పారిశ్రామిక జోన్’గా ప్రకటించింది. దీంతో పలు కంపెనీలు సంస్థల్ని ఏర్పా టు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మెట్రో కారిడార్-1లో భాగంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 28.87 కి.మీ. మెట్రో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ మార్గాల్లో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారుల విస్తరణ, పిల్లర్లపై సెగ్మెంట్ల అమరిక జరుగుతోంది. 2015 ఆగస్టుకి ఈ మార్గంలో పనులు పూర్తిచేస్తామని ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. మెట్రో కారిడార్లలో మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైటెక్ సిటీ ఎదురుగా 2 లక్షల చ.అ. విస్తీర్ణంలో 2 మెట్రో మాల్స్‌ను నిర్మిం చేందుకు ఎల్అండ్టీ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. క్లస్టర్3 పరిధిలో విశేష అభివృద్ధి క్లస్టర్-3లోని ఉప్పల్, పోచారం ప్రాంతాలకు దగ్గర్లోని ప్రతిపాదిత నాగోల్-శిల్పారామం మెట్రోరైలు మార్గంలో ఉప్పల్, హబ్సిగూడల్లో స్టేషన్లు రానున్నాయి. మెట్రో రానుండటంతో ఇక్కడ రియల్ వ్యాపారం కూడా జోరుగానే సాగుతుంది. హెచ్ఎండీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్-2031లో ఉప్పల్ ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి వస్తుంది. పోచారంలోని రహేజా మైండ్‌స్పేస్, ఇన్ఫోసిస్, ఐటీ సెజ్ కంపెనీలతో ఈ ప్రాంతం హాట్‌కేక్‌లా మారింది. ‘ఎరేనా టౌన్‌సెంటర్’లో ఎన్ఎస్ఎల్ సంస్థ ఏకంగా 26 అంతస్తులతో పది టవర్లను నిర్మించింది. దీంతో బడా బడా నిర్మాణ సంస్థలు, దేశ, విదేశీ సంస్థలు ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తున్నాయి. రామంతాపూర్ వెళ్లే మార్గంలో 36 ఎకరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత సెజ్‌ను నూజివీడు సీడ్స్ ఏర్పాటు చేసింది. భాగ్యనగర్ మెటల్స్, ఐకానిక్, స్పేస్ డెవలపర్స్ సంస్థలు ఈ ప్రాంతంలో ఐటీ పార్కుల్ని ఏర్పాటు చేయనున్నాయి. జోడిమెట్ల చౌరస్తా నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో 23 ఎకరాల్లో చెన్నమనేని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ‘ఆవలోన్ కోట్స్’ పేరుతో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇదే ప్రాంతంలో సత్యవాణి కన్స్ట్రక్షన్స్, మోడీ బిల్డర్స్, సురానా కంపెనీ వంటి వివిధ సంస్థల భారీ నివాస సముదాయాలు, మల్టీప్లెక్స్‌లు కూడా రానున్నాయి. ఇప్పటికే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోరైల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాగోల్ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 100 ఎకరాల్లో రైల్వే డిపోను అభివృద్ధి చేయబోతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానిస్తూ నాగోలు-గౌరెల్లి రేడియల్ రోడ్డు కూడా ఏర్పాటు కానుంది. ఎల్బీనగర్ ఓపెన్ స్టేడియంలో 1.5 ఎకరాల్లో 1.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో మెట్రో మాల్స్ ఏర్పాటుకు మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో విశేషంగా అభివృద్ధి జరగనుంది. మార్కెట్ అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ అంతర్జాతీయ హబ్ గా మారుతుంది. మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ స్థాయి మల్టిప్లెక్స్‌లు, షా పింగ్‌మాళ్లు, భారీ నివాస సముదాయాలు వస్తాయి. మాదాపూర్, గచ్చిబౌలిలను మించిన ఐటీ రంగ అభివృద్ధి ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరకు జరుగుతుంది. ఎక్కడిక్కడ శాటిలైట్ నగరాలు వెలుస్తాయి. - జైవీర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ సద్వినియోగం చేసుకోవాలి ఐటీ రంగంలో హైదరాబాద్ నాల్గో స్థానంలో ఉంది. ఐటీఐఆర్‌తో మొదటి స్థానానికి వెళ్తుందని ఆశిస్తున్నాం. హైదరాబాద్‌లో ఉన్న మౌలిక వసతులు, మెట్రో, ఓఆర్ఆర్, అనుకూలమైన వాతావరణం వంటి కారణంగానే ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌కు ఐటీఐఆర్ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. - శేఖర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి హైదరాబాద్‌కు ఫ్యాబ్ సిటీ, లేపాక్షి నాలెడ్జ్ సెంటర్, గేమింగ్ అండ్ యానిమేషన్ సిటీ, రిలయన్స్ 100 అంతస్తుల సెజ్, హార్డ్ పార్క్ ప్రాజెక్టులు వస్తాయన్నారు. కానీ అవేమీ రాలే దు. వీటి పేర్లు చెప్పుకొని రియల్టర్లు బాగుపడ్డారే తప్ప ఉద్యోగాలేమీ రాలేదు. బోగస్ కంపెనీల మాయలో పడి ఐటీ ఉద్యోగులు మోసపోయారు. కనీసం ఇప్పుడైనా అలా జరగకుండా ఐటీఐఆర్‌ను పూర్తి చేయాలి. - నరేందర్, సీనియర్ సిస్టమ్స్ ఇంజినీర్ వైఎస్ హయాంలోనే ప్రతిపాదనలు హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చ డం అభినందనీయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ఐటీఐఆర్ ప్రతిపాదనలున్నాయి. ఇప్పుడు ఆమోదానికి నోచుకున్నాయి. కొత్త ప్రతిపాదనలతో లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. సిటీలోనే కాకుండా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఐటీ సంస్థలను ఏర్పాటు చేస్తే బాగుండేది. - మధుమూర్తి రొనంకి, కో ఫౌండర్, అధ్యక్షులు, ట్యాలెంట్ స్ప్రింట్ సంస్థ మౌలిక వసతులు కల్పించాలి కొత్తగా ఐటీ రంగంలో రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండడంతో ప్రత్యకంగా, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి వ స్తుంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రస్తుతం ఉన్న మౌలికవసతులను మరింతగా మెరుగు పర్చాలి. ్రపస్తుతం ఉన్న జనాభా స్థాయిలో కొత్తగా నగరానికి వచ్చే అవకాశం ఉంది. అందుకోసం శివారు ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్స్ నిర్మించాలి. - డి.శ్రీనివాస్‌కుమార్, ఐటీ ఉద్యోగి హైదరాబాద్‌కు మంచి గుర్తింపు కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు రావడం వల్ల సాంకేతికపరంగా హైదరాబాద్ మంచి గుర్తింపు పొందుతుంది. ఎంప్లాయ్మెంట్, గేమింగ్, ఐటీ రంగాల్లో రాబోయే తరాల వారికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలుంటాయి. వారి వల్ల మరింతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. రా్రష్టంలోని ప్రస్తుత వాతావరణం ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలి. - కిరణ్-డిలాయిట్ ఐటీ ఉద్యోగి