రాష్ట్ర సర్కారు బడ్జెట్ ప్రతిపాదనల కంటే అధికంగా బహిరంగ మార్కెట్ రుణాలు
తెస్తామని చెప్పినది రూ.57 వేల కోట్లు.. అవుతున్నది రూ.70,500 కోట్లు.. అంటే 23శాతం అదనం
ఇప్పటికే సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు రూ. 40,500 కోట్లు
జనవరి–మార్చి మధ్య మరో రూ.30 వేల కోట్ల కోసం రిజర్వ్ బ్యాంకుకు ఇండెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన దానికంటే ఈసారి బహిరంగ మార్కెట్ రుణాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొన్నదానికంటే 23శాతం అదనంగా అప్పులు తీసుకోనుంది. రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ద్వారా రుణ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్‌ను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.40,500 కోట్ల రుణాలను సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్‌బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.
ఇప్పుడు చివరి త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు) నెలకు రూ.10వేల కోట్ల చొప్పున మరో రూ.30 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. అంటే బహిరంగ మార్కెట్ నుంచి తీసుకునే రుణం రూ.70,500 కోట్లకు చేరనుంది. రాష్ట్ర సర్కారు బడ్జెట్‌లో పేర్కొన్న రుణ సమీకరణ అంచనా రూ.57,112 కోట్లు మాత్రమే. కానీ రుణాలు అంతకన్నా రూ.13 వేల కోట్లు (23 శాతం) అదనంగా పెరగనున్నాయి.
ప్రతి నెలా నాలుగు సార్లు..: ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు (చివరి త్రైమాసికం) ప్రతి నెలా నాలుగు దఫాల్లో ఆర్బీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐకి ఇచ్చిన ఇండెంట్‌లో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలు కావడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులపై ఆధారపడకుండా బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకోవాలని భావిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు నెలల కాలంలో రైతు భరోసా, రేషన్ కింద సన్న బియ్యం సరఫరా, పింఛన్ల పెంపు వంటి పథకాలను అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో నిధుల అవసరం పెరగనుందని పేర్కొంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనూ బడ్జెట్ ప్రతిపాదనల కంటే ఎక్కువగా బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.40,615 కోట్లు రుణ సేకరణను ప్రతిపాదించగా.. సవరించిన అంచనాల్లో రూ.49,618 కోట్లు చూపారు. అంటే రూ.9వేల కోట్లకుపైనే అదనంగా తీసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment