గుంటూరు నగరపాలెం పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్.విజయ్‌పాల్‌పై తదుపరి విచారణ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు నగరపాలెం పోలీసులను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈమేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ప్రతివాదులుగా ఉన్న పోలీసులు, ఫిర్యాదుదారు రఘురామకృష్ణరాజుకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
2021లో సీఐడీ అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా నగరపాలెం పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఇందులో నిందితునిగా ఉన్న విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ కోసం ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, సిద్దార్థ్ దవే, న్యాయవాదులు వరుణ్ బైరెడ్డి, చోడిశెట్టి శరణ్ వాదనలు వినిపించారు. 2021లో జరిగిన ఘటనపై మూడేళ్ల తరువాత 2024లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారన్నారు. ఇంత అసాధారణ జాప్యం ఎందుకు జరిగిందో ఫిర్యాదుదారు చెప్పలేదని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment