మణిపుర్ పోలీసులకు చెందిన సుమారు 4,500 ఆయుధాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు. కేంద్రం వెంటనే రాష్ట్ర పాలనా బాధ్యతలు తీసుకోవాల్సిన అసాధారణమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఇది. మణిపుర్ ఏళ్లుగా తుపాకుల నీడలో, మత్తుమందుల ప్రభావంలో, బలవంతపు వసూళ్ల మధ్య బతికింది. వీటన్నింటి నుంచి బయటపడేందుకు రాష్ట్రానికి న్యాయమైన అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇదే. రాజకీయంగా చర్చలు ప్రారంభించాలి. ఆర్థిక పరిపుష్టికి ఊతమివ్వాలి. మణిపుర్‌లోని అన్ని తెగలు కూడా దృఢమైన, న్యాయమైన పాలన కోసం ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రపతి పాలనలో సమర్థమైన అధికార యంత్రాంగం మణిపుర్‌ను మళ్లీ సరైన మార్గంలో పెట్టగలదు.
మణిపుర్ నివురుగప్పిన నిప్పులా అసందిగ్ధ భవిష్యత్తుకేసి చూస్తోంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు, దుకాణాలు, రహదారులు కూడా ధ్వంస మైపోయి రాష్ట్రం నిర్జీవమైన మట్టిదిబ్బ రూపం సంతరించుకుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మణిపుర్ ప్రస్తావన పార్లమెంటులో వచ్చింది. కానీ ఇరుపక్షాల పరస్పర నిందారోపణలతో ఒరిగింది శూన్యం. దేశ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను అమలు చేసే క్రమంలో అసాం రైఫిల్స్, మణిపుర్ పోలీసుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం కూడా పరిస్థితి మరింత దిగజారేందుకు కారణమైంది.
ఈ ఏడాది మే 4న కాంగ్పోకీ జిల్లాలో ఇద్దరు అమాయక మహిళలపై జరిగిన అకృత్యాలు సుప్రీంకోర్టును సైతం నిర్ఘాంతపోయేలా చేశాయి. రాష్ట్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించగా కొందరి ప్రయోజనాలు, పక్షపాతాలతో రాజకీయాలు నడిచాయి. జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగితే కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా అస్సలు సహించరాదు. అధ్వాన్నమైన స్థితి ఏమిటంటే... సంఘటన జరిగిన తొలిరోజే పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయకపోవడం. వారిని ఉద్యోగాల్లోంచి తొలగించేందుకు ఇంతకంటే బలమైన కారణం కని పించదు.
కొన్ని రోజుల తరువాత ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినా పరిస్థితి ఎక్కడిదక్కడే ఉంది. పోలీసులు, నాయకులు తమ బాధ్యతలను విస్మరించి, వారి వారి తెగల్లో హీరోలు కావాలని అనుకుంటే ఇంతకంటే ఎక్కువేమీ ఆశించలేము. ఈ ఘటన తరువాతి రోజే ఇంఫాల్‌లో కార్లు కడిగే పనిచేస్తున్న ఇద్దరు మహిళలపై దారుణమైన నేరం జరిగింది. రాష్ట్రం స్పందన భిన్నంగా ఏమీ లేదు. దౌర్భాగ్యకరమైన స్థితి ఏమిటంటే, ఈ మూక దాడుల్లో మహిళలూ భాగస్వాములు కావడం!
రాష్ట్ర పోలీసులకు చెందిన సుమారు 4,500 ఆయుధాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు. కేంద్రం వెంటనే రాష్ట్ర పాలనా బాధ్యతలు తీసు కోవాల్సిన అసాధారణమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఇది. నిఘా వర్గాలు కూడా దీనిపై కచ్చితంగా నివేదిక అందించే ఉంటాయి. రాష్ట్రం తనదైన కారణాలతో నోరు మెదపదు కానీ అంతర్గత ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిది. నిబద్ధత కలిగిన హోంశాఖ కార్యదర్శి ఎవరైనా సరే... మణిపుర్ ఘటనపై సీరియస్‌గా స్పందించి ఉండేవారు.
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలుతున్న వైనాన్ని గమనించి రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా సిఫారసు చేసేవారు. అయితే జరిగిందేమిటి? ఎత్తుకెళ్లిన ఆయుధాలు తిరిగి ఇచ్చేయండి సామీ అని రాష్ట్ర డీజీపీ స్వయంగా బతి మాలడం, ఆయుధాల సేకరణ కోసం రాజకీయ నేతల ఇళ్ల ముంగిట్లో డ్రాప్‌బాక్స్‌ల ఏర్పాటుచేయడం!
మణిపుర్ విషయంలో కేంద్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఇదే. రాష్ట్రం సాధారణ స్థితికి చేరుకుని తన కాళ్లపై తాను నిలబడగలగాలంటే కనీసం రెండేళ్లపాటు రాజకీయాలను దూరంగా పెట్టాలి. నిష్పక్షపాతమైన, ప్రొఫెషనల్‌గా వ్యవహరించే యంత్రాంగం పాలనా విధులు చేపట్టాలి. మణిçపుర్‌ను మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు ఈ కార్యాచరణ అనుసరించడం మేలు:
1. రాష్ట్ర పెద్దగా బాధ్యతగా వ్యవహరించలేకపోయిన, ప్రజల నైతిక మద్దతు కోల్పోయిన ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలి. కుకీలతోపాటు కొందరు మైతేయిల్లోనూ ముఖ్యమంత్రిపై విశ్వాసం పోయింది. శాంతిభద్రతలు భయంకరంగా ఉన్నాయని బీజేపీ నేతలే కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించడం ద్వారా ప్రధానమంత్రి రాష్ట్రానికి మాత్రమే కాకుండా, తనకు తాను మేలు చేసుకున్న వారవుతారు. 2. రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రంలోని విశ్రాంత అధికారుల్లో సమర్థులను ఎన్నుకుని గవర్నర్‌గా నియమించాలి. 3. ఐఏఎస్, ఐపీఎస్, రక్షణ శాఖల నుంచి ఒక్కొక్కరిని గవర్నర్‌కు సలహాదారులుగా నియమించాలి.
జి.ఎస్.పంధేర్, హర్జీత్ సంధూ, ఎ.ఎన్.ఝా, నిఖిలేష్ ఝా, జాన్ షిల్సీ, జర్నేల్ సింగ్, బీ.ఎల్.వోహ్రా లాంటి అత్యుత్తమ అధికారులను పరి గణనలోకి తీసుకోవచ్చు. ఆర్థిక, పారిశ్రామిక పరిస్థితిని పునరుద్ధరించేందుకు ఆర్థికరంగ నిపుణులు ఒకరిని కూడా సలహాదారుగా నియ మించుకోవచ్చు. 4. ప్రత్యేక హక్కుల చట్టంతో సైన్యాన్ని తీసుకు రావద్దు. ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రాన్ని పాలించలేమన్న సంకే తాన్ని పంపడం అనవసరం. పైగా ఏఎఫ్‌ఎస్‌పీఏతో సైన్యాన్ని దింపితే అది పాత గాయాలను మళ్లీ రేపవచ్చు. 5. క్షేత్రస్థాయి పోలీసింగ్ మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. అవసరమైతే జిల్లా మేజిస్ట్రేట్‌లు, ఎస్పీలను డిప్యుటేషన్‌పై బయటి రాష్ట్రాల నుంచి తీసుకురావచ్చు.
6. ఆయుధాలు ఎత్తుకెళ్లిన వారిని ‘సిట్’లు అరెస్ట్ చేసేలా చూడాలి. దుండగుల చేతుల్లో 4,500 ఆయుధాలున్నాయంటే మణి పుర్ ఇప్పుడు సాయుధ రాష్ట్రమనే లెక్క. ఆయుధాలు ఎత్తుకెళ్లిన వారి పేర్లు వెల్లడించకపోతే తగిన చర్యలుంటాయని పోలీసులను హెచ్చరించాలి. దోపిడి సమయంలో అక్కడే ఉన్నవారిపై చట్టపరమైన విచారణ జరగాలి. 7. మిలిటెంట్లకు వ్యతిరేకంగా భద్రతాదళాలు తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగిస్తున్న మహిళా వర్గాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
తగినంత మంది మహిళ అధికారిణులు, సిబ్బందిని ఈ కార్యక్రమాల కోసం ఉపయోగించాలి. 8. నిందితుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, నేర విచారణ బృందాలను ఏర్పాటు చేయాలి. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం బాధితుల్లో కలిగించేందుకు ఇది అత్యవసరం. 9. కుకీ మిలిటెంటు గ్రూపులు ఇరవై ఐదింటిపై చర్యలను నిలిపి వేయడంపై ఉన్న గందరగోళాన్ని తొలగించాలి. పద్నాలగు క్యాంపుల్లోని 2,200 మంది కేడర్ వద్ద ఉన్న ఆయుధాలను సమీక్షించాలి. కుకీ, మైతేయి మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్న బలవంతపు వసూళ్ల చెక్ పోస్టులను పెకిలించాలి.
నల్ల మందు మాఫియాపై స్థానిక పోలీసులు కఠిన చర్యలకు దిగాలి. ఈ మాఫియాలో కొందరు రాజకీయ నేతలూ మిలాఖత్ అయి ఉన్నారు. డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతున్న అదనపు ఎస్పీ థౌనావోజామ్ బృందం తనకు తగిన మద్దతు లేదని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటువంటి వారిని మళ్లీ నియమించుకుని డ్రగ్ మాఫియా ఆటలు కట్టేలా చూడాలి. 10. నిరాశ్రయులైనవారు మళ్లీ తమ ఇళ్లకు చేరుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఇందుకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేయాలి.
పాలన యంత్రాంగ చక్రాలు కదలడం మొదలై, అది ప్రజలకు స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టిన తరువాత రెండో దశ కార్య కలాపాలకు శ్రీకారం చుట్టాలి. పోలీసు కౌన్సిల్స్ ఏర్పాటు చేసి అందులో తటస్థులైన విద్యావేత్తలు, జర్నలిస్టులు, పౌర సమాజపు సభ్యులను చేర్చాలి. గతంలో భయంతో లేదా తమ తెగలకు నిబద్ధంగా ఉండాలన్న కారణంతో కొందరు సభ్యులు రాజీనామా చేశారు. తటస్థులను సభ్యులుగా చేయడం ద్వారా శాంతి స్థాపన సాధ్యం.
చివరగా... ఘర్షణల సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు తెగువ చూపిన వారిని బహిరంగంగా గౌరవించాలి. కుకీలున్న చోట మైతేయిలను, మైతేయిల ప్రాబల్యం ఉన్న చోట కుకీలను కాపాడిన ఘటనలు కోకొల్లలు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్ సంక్షోభాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరి ష్కారం దీర్ఘకాలికమైందిగా ఉండాలి. ప్రతి తెగకూ తమ బాధలు చెప్పుకునేందుకు అనువైన వేదిక, ప్రాతినిధ్యం కల్పించాలి. అప్పుడు మాత్రమే ఉగ్రవాదులు ఆయుధాలు వదిలేయడం సాధ్యమవుతుంది. కంచెలు, కందకాలు తొలగిపోతాయి.
యశోవర్ధన్ ఆజాద్
కేంద్ర మాజీ సమాచార కమిషనర్,విశ్రాంత ఐపీఎస్ అధికారి, డీప్‌స్ట్రాట్ ఛైర్మన్
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment