Rahul Gandhi Slams PM Modi Over Lok Sabha Speech On Manipur - Sakshi
Sakshi News home page

మణిపూర్‌ తగలబడిపోతుంటే నవ్వు ఎలా వచ్చింది?.. ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం

Published Fri, Aug 11 2023 3:44 PM | Last Updated on Fri, Aug 11 2023 3:53 PM

Rahul Gandhi Fire On PM Modi Over Lok Sabha Speech On Manuipur - Sakshi

సాక్షి, ఢిల్లీ: నిన్న లోక్‌సభలో నవ్వుతూ కనిపించిన ప్రధానికి దేశంలో ఏం జరుగుతుందో తెలియదా? అంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ నిలదీశారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తన ప్రసంగంలో ఎక్కువ భాగం విపక్షాల తీరు, ప్రత్యేకించి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ క్రమంలో ఆయన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. 

సైన్యానికి అవకాశం ఇస్తే రెండు రోజుల్లో మణిపూర్‌ పరిస్థితిని సరిదిద్దేది. మణిపూర్‌లో దారుణ పరిస్థితులను చూసి కేంద్ర బలగాలే ఆశ్చర్యపోయాయి. నిప్పుల గుండం లాంటి మణిపూర్‌ను చల్లార్చాల్సింది బోయి బీజేపీ.. మరింత ఆజ్యం పోసింది అని మండిపడ్డారు రాహుల్‌ గాంధీ. ప్రధానిగా మోదీ కనీసం మణిపూర్‌కు వెళ్లాల్సింది. అక్కడి ప్రజలకు నేనున్నా అని భరోసా ఇవ్వాల్సింది. నేను మీ ప్రధాని.. ఎలాంటి సమస్య ఉన్నా కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకుందాం అని ఆయన అనాల్సింది. కానీ, ఆయనలో అలాంటి ఉద్దేశం ఏం కనిపించడం లేదు. మణిపూర్‌ మంటలు ఆరడం ఆయనకు ఇష్టం లేనట్లుంది అని రాహుల్‌ అన్నారు. 

భారత్‌ను హత్య చేశారు అని నేను అనలేదు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారు అని ఊరికే అనలేదు. ‘బీజేపీ మణిపూర్‌ను, భారత్‌ను హత్య చేసి.. రెండుగా చీల్చింది’ ఇదీ నేను అన్నమాట.  మణిపూర్‌ మండుతుంటే.. ప్రజలు చనిపోతుంటే.. మోదీ మాత్రం నవ్వుతూ పార్లమెంట్‌లో కనిపించారు. మణిపూర్‌ ఇష్యూను తమాషాగా మార్చారు. ప్రధాని స్థానంలో ఉన్న మోదీ.. మణిపూర్‌లో జరుగుతున్న హింసను ఎందుకు ఆపలేకపోయారు?. దేశంలో ఇంత హింస జరుగుతుంటే.. ప్రధాని రెండు గంటలపాటు నవ్వుతూ ఎగతాళి చేశారు. అలాంటి వ్యవహార శైలి మోదీకి సరికాదు.  

ఇక్కడ ప్రశ్న 2024లో మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? కాదా? అనికాదు.. మణిపూర్‌లో జనాల్ని, పిల్లల్ని ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ప్రధాని అయ్యాక రాజకీయ నాయకుడిగా ఉండడం మానేయాలి.  ఆయన దేశ వాణికి ప్రతినిధి అవుతాడు. అలాంటప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి చిల్లర రాజకీయ నాయకుడిలా కాకుండా.. ప్రధాని తన వెనుక ఉన్న భారతీయ ప్రజల గుండెబరువుతో మాట్లాడాలి. కానీ, మోదీ అలాకాకుండా వ్యవహరించడం బాధాకరం. అలాంటి ప్రధాని వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement