న్యూఢిల్లీ: మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వంపై విపక్షాలు చేసిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్‌కు ఘాటుగా స్మృతి తన స్పందన తెలిపారు. ‘ సభలో ఆయన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. భరతమాత హత్యకు గురైందంటూ సభలోనే వ్యాఖ్యలు చేయడం పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి.
ఆయన ఇలాంటి తీవ్రవ్యాఖ్యలు చేస్తుంటే తోటి కాంగ్రెస్ సభ్యులు చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తారా ?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ నా ముందే ప్రసంగం చేశారు. ముందు వరసలో మహిళా సభ్యులు ఉండగా ఆయన(రాహుల్) గాలిలో ముద్దులు విసిరారు. ఇలాంటి అసభ్య సైగలు గతంలో మరెవరూ చేయలేదు. ఈ (గాంధీ)కుటుంబం సంస్కృతి ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసొచ్చింది’ అని వ్యాఖ్యానించారు. స్మృతి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా కొందరు మహిళా బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ ఫ్లయింగ్ కిస్‌పై ఫిర్యాదుచేశారు. కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
ఆర్టికల్ రద్దు వల్లే అది సాధ్యమైంది
‘విపక్ష కూటమి పార్టీ నేత ఒకరు తమిళనాడులో.. భారత్ అంటే ఉత్తరభారతమే అని వివాదాస్పద వ్యాఖ్యచేశారు. దమ్ముంటే ఈ అంశంపై రాహుల్ మాట్లాడారు. మరో నేత కశ్మీర్‌పై రెఫరెండం కోరతారు. ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో వస్తున్నాయా ?. మీ కూటమి ‘ఇండియా’ కాదు. భారత్‌లో అవినీతిని పెంచారు’ అని ఆవేశంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లో కొనసాగడంపై స్మృతి ఎద్దేవా చేశారు. ‘ రక్తంతో తడిసిన కశ్మీర్ లోయ అది.
యాత్ర పేరుతో అక్కడికెళ్లి స్నో బాల్స్‌తో ఆడుకున్నారు. ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ రద్దుచేయడం వల్లే అక్కడ అల్లర్లు తగ్గి నెలకొన్న ప్రశాంతత కారణంగా మీరు ఆ పని చేయగలిగారు. ఆ ఆర్టికల్‌ను మళ్లీ తెస్తామని అక్కడి వారికి రాహుల్ హామీ ఇచ్చి వచ్చారు. కానీ అది ఎన్నటికీ సాధ్యపడదు. ఆర్టికల్ పునరుద్ధరణ ఉండదు’ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో అత్యయక స్థితిని స్మృతి గుర్తుచేశారు. ‘ మీ పాలనా చరిత్ర అంతా రక్తసిక్తం. 1984 సిక్కుల వ్యతిరేక అల్లర్లు, కశ్మీర్‌లో అశాంతి..’ అని వ్యాఖ్యానించారు.
భరతమాతను హత్యచేశారంటే.. బల్లలు చరుస్తారా ?
Published Thu, Aug 10 2023 4:11 AM | Last Updated on Thu, Aug 10 2023 4:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment