Bharat Mata
-
రాహుల్ గాంధీకి మతి తప్పినట్లుంది.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రసంగం సమయంలో తను ప్రస్తావించిన ‘భరత మాత’మాటను తొలగించారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన మతి తప్పినట్లుగా అనిపిస్తోందని జోషి వ్యాఖ్యానించారు. అన్ పార్లమెంటరీ మాటలను తొలగించామేతప్ప, భరతమాత అనే మాటను కాదని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌పై మేము(కేంద్రం) చర్చకు అంగీకరిస్తామని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కలలో కూడా అనుకోని ఉండరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినట్లుగా, ఈ అంశంపై మనం సున్నితంగా వ్యవహరించాలి. ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన తన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని అనిపిస్తోంది. రాహుల్ గాంధీ సభకు రాలేదు. మా సమాధానం వినలేదు.గ్రాండ్ ఓల్డ్ అని పిలవబడే పార్టీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం’ అనిపేర్కొన్నారు. మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..ఏదో హడావుడి చేయాలన్న రాహుల్ గాంధీ ప్రయత్నం మరోసారి ఫెయిల్, ఫ్లాప్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ‘రాహుల్ తప్పుడు భాషను వాడుతున్నారు. భరత మాత బిడ్డ ఎవరూ కూడా ఆమె హత్య గురించి మాట్లాడరు, ఆలోచించరు. దేశానికి అప్రతిష్ట తెచ్చేందుకే ఇలా మాట్లాడుతున్నారన్న విషయం రాహుల్ వాడిన భాషను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది’అని ఆరోపించారు. చదవండి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కవిత కరచాలనం #WATCH | Parliamentary Affairs Minister Pralhad Joshi says, "Congress & other opposition parties never thought that we would agree for a discussion on Manipur...Like PM Narendra Modi & Union Home Minister Amit Shah said we should be sensitive about the issue. Today, as well what… pic.twitter.com/SqhHrJkHge— ANI (@ANI) August 11, 2023 -
భరతమాతను హత్యచేశారంటే.. బల్లలు చరుస్తారా ?
న్యూఢిల్లీ: మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వంపై విపక్షాలు చేసిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్‌కు ఘాటుగా స్మృతి తన స్పందన తెలిపారు. ‘ సభలో ఆయన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. భరతమాత హత్యకు గురైందంటూ సభలోనే వ్యాఖ్యలు చేయడం పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి. ఆయన ఇలాంటి తీవ్రవ్యాఖ్యలు చేస్తుంటే తోటి కాంగ్రెస్ సభ్యులు చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తారా ?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ నా ముందే ప్రసంగం చేశారు. ముందు వరసలో మహిళా సభ్యులు ఉండగా ఆయన(రాహుల్) గాలిలో ముద్దులు విసిరారు. ఇలాంటి అసభ్య సైగలు గతంలో మరెవరూ చేయలేదు. ఈ (గాంధీ)కుటుంబం సంస్కృతి ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసొచ్చింది’ అని వ్యాఖ్యానించారు. స్మృతి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా కొందరు మహిళా బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ ఫ్లయింగ్ కిస్‌పై ఫిర్యాదుచేశారు. కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఆర్టికల్ రద్దు వల్లే అది సాధ్యమైంది ‘విపక్ష కూటమి పార్టీ నేత ఒకరు తమిళనాడులో.. భారత్ అంటే ఉత్తరభారతమే అని వివాదాస్పద వ్యాఖ్యచేశారు. దమ్ముంటే ఈ అంశంపై రాహుల్ మాట్లాడారు. మరో నేత కశ్మీర్‌పై రెఫరెండం కోరతారు. ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో వస్తున్నాయా ?. మీ కూటమి ‘ఇండియా’ కాదు. భారత్‌లో అవినీతిని పెంచారు’ అని ఆవేశంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్లో కొనసాగడంపై స్మృతి ఎద్దేవా చేశారు. ‘ రక్తంతో తడిసిన కశ్మీర్ లోయ అది. యాత్ర పేరుతో అక్కడికెళ్లి స్నో బాల్స్‌తో ఆడుకున్నారు. ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ రద్దుచేయడం వల్లే అక్కడ అల్లర్లు తగ్గి నెలకొన్న ప్రశాంతత కారణంగా మీరు ఆ పని చేయగలిగారు. ఆ ఆర్టికల్‌ను మళ్లీ తెస్తామని అక్కడి వారికి రాహుల్ హామీ ఇచ్చి వచ్చారు. కానీ అది ఎన్నటికీ సాధ్యపడదు. ఆర్టికల్ పునరుద్ధరణ ఉండదు’ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో అత్యయక స్థితిని స్మృతి గుర్తుచేశారు. ‘ మీ పాలనా చరిత్ర అంతా రక్తసిక్తం. 1984 సిక్కుల వ్యతిరేక అల్లర్లు, కశ్మీర్లో అశాంతి..’ అని వ్యాఖ్యానించారు. -
Manipur violence: మణిపూర్‌లో భరతమాత హత్య
సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మణిపూర్‌లో భరతమాతను బీజేపీ ప్రభుత్వం హత్య చేసిందని గర్జించారు. రాష్ట్రంలో హింసాకాండను అరికట్టడంలో, శాంతిని నెలకొల్పడంలో నరేంద్ర మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని ఆరోపించారు. బీజేపీ నాయకులు ముమ్మాటికీ దేశద్రోహులేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో రెండోరోజు బుధవారం కూడా చర్చ కొనసాగింది. ఈ చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత సభలో ఆయన మాట్లాడడం ఇదే మొదటిసారి. దాదాపు 30 నిమిషాల పాటు ప్రసంగం సాగింది. బీజేపీపై, మోదీ సర్కారుపై దుమ్మెత్తి పోశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో మోదీ సభలో లేరు. అలాగే తన ‘భారత్ జోడో యాత్ర’ అనుభవాలను రాహుల్ పంచుకున్నారు. ఒకవైపు ఆయన ప్రసంగం కొనసాగుతుండగా, మరోవైపు సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విపక్ష ఎంపీలు ‘ఇండియా.. ఇండియా’ అని నినాదాలు చేయగా, అధికార పక్ష సభ్యులు ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గౌతమ్ అదానీ గురించి మాట్లాడడానికి సభకు రాలేదని, భయపడకండి అని బీజేపీ సభ్యులకు చురక అంటిస్తూ రాహుల్ తన ప్రసంగం ప్రారంభించారు. సభలో ఆయన ఏం మాట్లాడారంటే... ప్రజల మద్దతుతోనే పాదయాత్ర దిగి్వజయం భారత్ జోడో యాత్ర ఇంకా పూర్తి కాలేదు. ఈ యాత్ర ప్రారంభించినప్పుడు ఎందుకు నడుస్తున్నారు? మీ లక్ష్యం ఏమిటి? అని చాలామంది అడిగారు. పాదయాత్ర చేయాలని ఎందుకు అనుకున్నానో తొలుత తెలియలేదు. నేను దేన్ని ప్రేమిస్తానో అర్థం చేసుకోవడానికి, దేనికోసం నేను మరణానికి కూడా సిద్ధమో గుర్తించడానికి, మోదీకి చెందిన జైలుకు వెళ్లడానికి యాత్ర చేస్తున్నట్లు క్రమంగా తెలుసుకున్నా. నేను నిత్యం 10 కిలోమీటర్లు పరుగెత్తేవాడిని. అలాంటిది పాదయాత్రలో రోజుకు 25 కిలోమీటర్లు నడవలేనా అనుకున్నా. అప్పట్లో నాలో అహంకారం ఉండేది. భారత్ జోడో యాత్ర ఆ అహంకారాన్ని మాయం చేసింది. యాత్ర మొదలైన తర్వాత రెండు మూడు రోజుల్లోనే నాకు ఒళ్లు నొప్పులు ప్రారంభమయ్యాయి. నాలో అహంకారం పూర్తిగా మాయమైంది. పాదయాత్రలో ప్రజలు నాకు అండగా నిలిచారు. వారి మద్దతుతోనే యాత్ర దిగి్వజయంగా కొనసాగించా. ప్రతిరోజూ ప్రజలు చెప్పింది విన్నాను. నా వద్దకు ఓ రైతు వచ్చాడు. అతడికి పంటల బీమా దక్కలేదని చెప్పాడు. అతడి ఆకలి బాధ నాకు అర్థమైంది. ఆ తర్వాత నా యాత్ర తీరు మారిపోయింది. అప్పటినుంచి చుట్టుపక్కల ప్రజల నినాదాలు నాకు వినిపించలేదు. బాధితుల ఆవేదనే వినిపించేది. భారత్ జోడో యాత్ర పూర్తి కాలేదు. తూర్పు నుంచి పశి్చమ భారతదేశం వరకూ పాదయాత్ర కొనసాగిస్తా. దేశంలో వేర్వేరు భాషలు ఉన్నాయని చెబుతుంటారు. ఇది నేల, ఇది బంగారం, ఇది వెండి అని అంటుంటారు. కానీ, సత్యం ఏమిటంటే ఈ దేశం ఓ గొంతుక. దాన్ని వినాలంటే మన మనసులోని అహంకారాన్ని, విద్వేషాన్ని విడనాడాలి. అప్పుడే దేశం గొంతుక మనకు వినిపిస్తుంది. ప్రజల గొంతుకను హత్య చేశారు భారత్ అంటేనే ఓ గొంతుక. భారత్ మన ప్రజల గొంతుక. అది ప్రజల హృదయ స్పందన. అలాంటి గొంతుకను మీరు(బీజేపీ ప్రభుత్వం) మణిపూర్‌లో హత్య చేశారు. అంటే భరతమాతను హత్య చేశారు. మణిపూర్ ప్రజలను హత్య చేయడం ద్వారా భారతదేశాన్ని హత్యచేశారు. అందుకే మీ ప్రధాని( మోదీ) మణిపూర్ వెళ్లడం లేదు. మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహులు. మీరు భరతమాత రక్షకులు కాదు. భరతమాతను హత్య చేసిన హంతకులు. నా తల్లి ఈ సభలోనే ఉన్నారు. మరో తల్లి అయిన భరతమాత మణిపూర్‌లో హత్యకు గురైంది. మణిపూర్‌లో హింసను అరికట్టనంత వరకూ నా తల్లి హత్యకు గురవుతూనే ఉంటుంది. దేశాన్ని దహనం చేసే కుట్రలు సైన్యం ఒక్క రోజులో మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించగలదు. కానీ, కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని మణిపూర్‌లో మోహరించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మణిపూర్‌లో భారతదేశాన్ని హత్య చేయాలనుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల మాటలు వినడం లేదు. కేవలం ఇద్దరి మాటలే వింటున్నారు. రావణాసురుడు కేవలం మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలే విన్నాడు. అలాగే మోదీ కేవలం గౌతమ్ అదానీ, అమిత్ షా మాటలనే ఆలకిస్తున్నారు. రావణుడి అహంకారమే లంకను దహనం చేసింది. రావణుడి అహంకారమే అతడిని అంతం చేసింది. మీరు దేశం మొత్తం కిరోసిన్ చల్లుతున్నారు. మణిపూర్‌లో కిరోసిన్ చల్లి నిప్పు రగిలించారు. హరియాణాలోనూ ఇప్పుడు అదే చేస్తున్నారు. దేశాన్ని దహనం చేసేందుకు మీరు కుతంత్రాలు పన్నుతున్నారు. దేశమంతటా భరతమాతను అంతం చేస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రసంగం అనంతరం ఆయన సభ నుంచి బయటకు వెళ్తూ ఇతర సభ్యుల వైపు చూస్తూ ‘ఫ్లైయింగ్ కిస్’ ఇచ్చారు. మణిపూర్ బాధితుల ఆవేదన విన్నా కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లాను. అక్కడికి ప్రధాని ఇప్పటికీ వెళ్లలేదు. మోదీ దృష్టిలో మణిపూర్ లేదు. మణిపూర్ భారతదేశంలో ఒక భాగం కాదని అనుకుంటున్నారు. నేను ‘మణిపూర్’ అనే పదాన్ని వాడాను. కానీ, మణిపూర్ అనేదే లేదు. దానిని రెండుగా విభజించారు. బీజేపీ ప్రభుత్వం మణిపూర్‌ను విచి్ఛన్నం చేసింది. నేను మణిపూర్‌లో సహాయక శిబిరాలకు వెళ్లాను. అక్కడున్న మహిళలు, పిల్లలతో మాట్లాడాను. ఒక మహిళను ‘అక్క.. మీకు ఏమైంది?’ అని అడిగా. దానికి ఆమె ‘నాకు ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. నా కళ్ల ముందే అతడిని కాలి్చచంపారు. రాత్రంతా నేను నా బిడ్డ మృతదేహం పక్కనే కూర్చున్నాను. ఆ తర్వాత భయపడి కట్టుబట్టలతో, చేతిలో ఓ ఫొటోతో నా ఇంటిని విడిచిపెట్టాను’ అని ఆమె నాతో చెప్పింది. మరో మహిళను ‘మీకు ఏమైంది?’ అని అడగ్గానే, ఆమెకు జరిగింది గుర్తుకు వచ్చి వణికిపోవడం మొదలుపెట్టింది. సొమ్మసిల్లి పడిపోయింది. మణిపూర్‌లో హిందూస్తాన్‌ను బీజేపీ హత్య చేసిందని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. -
Manipur Violence: మాటల తూటాలు.. అట్టుడికిన లోక్‌సభ
►మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు లోక్‌సభలో పెను దుమారం సృష్టించాయి. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తొలిసారిగా సభలో మాట్లాడిన ఆయన ఘాటు వ్యాఖ్యలతో బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రెండోరోజు బుధవారం కూడా కొనసాగింది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి. ►మణిపూర్‌లో హింసాకాండను అరికట్టడంలో నరేంద్ర మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని రాహుల్ నిప్పులు చెరిగారు. మణిపూర్ ప్రజలను హత్య చేయడం ద్వారా భారతదేశాన్ని హత్యచేశారని, అందుకే ప్రధాని అక్కడికి వెళ్లడం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు దేశ భక్తులు కాదు, ముమ్మాటికీ దేశ ద్రోహులేనని మండిపడ్డారు. విపక్షాల ఆరోపణలను లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. ►మణిపూర్ అంశాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని విపక్షాలపై ధ్వజమెత్తారు. అగి్నకి ఆజ్యం పోయవద్దని సూచించారు. పొరుగు దేశం మయన్మార్ నుంచి కుకీ తెగ గిరిజనులు మణిపూర్‌కు వలస రావడం వల్లే అక్కడ సమస్య మొదలైందని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో ఘర్షణలు తగ్గు ముఖం పట్టాయని వెల్లడించారు. హింసకు ఇక స్వస్తి పలికి శాంతియుతంగా కలిసిమెలసి ఉండాలని మణిపూర్ తెగలకు ఆయన విజ్ఞప్తి చేశా రు. మణిపూర్‌లో శాంతిని కోరుకుంటూ అమిత్ షా ప్రతిపాదించిన తీర్మానాన్ని లోక్‌సభలో ఆమోదించారు. రాజకీయం చేయడం సిగ్గుచేటు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం న్యూఢిల్లీ: మణిపూర్ అంశంలో ప్రతిపక్షాల వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ వ్యవహారాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. విపక్ష నేత రాహుల్ గాంధీ తీరును తప్పుపట్టారు. మణిపూర్‌లో ముఖ్యమంత్రిని మార్చడం గానీ, రాష్ట్రపతి పాలన గానీ అవసరం లేదని తేలి్చచెప్పారు. మణిపూర్‌లో శాంతిని కాంక్షిస్తూ అమిత్ షా ప్రతిపాదించిన తీర్మానాన్ని లోక్‌సభలో ఆమోదించారు. సభలో అమిత్ షా ప్రసంగం ఆయన మాటల్లోనే... రాహుల్ 13సార్లు విఫలం ‘‘మణిపూర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెద్ద డ్రామా నడిపించారు. ఆయన పర్యటనకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. వాటిని తిరస్కరించారు. చురాచాంద్పూర్కు హెలికాప్టర్లో వెళ్లాలని కోరితే రోడ్డు మార్గంలో వెళ్తానన్నారు. మొదటిరోజు సత్యాగ్రహం చేశారు. రెండోరోజు హెలికాప్టర్లో వెళ్లారు. 13 సార్లు రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాయకుడు(రాహుల్ గాం«దీ) ఈ సభలో ఉన్నారు. ఆయన 13 సార్లు విఫలమయ్యారు. మహారాష్ట్రలోని విదర్భలో కళావతి అనే పేద మహిళతో కలిసి రాహుల్ భోజనం చేశారు. ఆమె అనుభవిస్తున్న కష్టాలను ఈ సభలో ప్రస్తావించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఆరేళ్లు అధికారంలో ఉంది. కానీ, కళావతి పేదరికాన్ని పోగొట్టడం కోసం రాహుల్ చేసిందేమీ లేదు. మోదీ ప్రభుత్వమే కళావతికి ఇళ్లు, కరెంటు, గ్యాస్ సౌకర్యాలు కలి్పంచింది. రేషన్ సరుకులు ఇస్తోంది. మోదీ సర్కారు ఎన్నో ఘనతలు సాధించింది ప్రధాని మోదీ గత తొమ్మిదేళ్లలో 50 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆయన శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో మణిపూర్‌లో ఎన్నోసార్లు హింసాత్మక సంఘటనలు జరిగాయి. అప్పట్లో హోంమంత్రి మణిపూర్‌లో పర్యటించలేదు. కానీ, నేను ఆ రాష్ట్రంలో 23 రోజులపాటు పర్యటించా. ఈశాన్యంలో గత తొమ్మిదేళ్లలో 8 వేల మంది సాయుధ తీవ్రవాదులు లొంగిపోయారు. దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. ఎన్నో ఘనతలు సాధించింది. ఆ వీడియో వెనుక ఆంతర్యం ఏమిటి? ‘‘మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న జరిగింది. ఈ వీడియో జూలై 19న బయటికొచి్చంది. వీడియోను సోషల్ మీడియాలో పెట్టే బదులు రాష్ట్ర డీజీపీకి అందజేస్తే బాగుండేది. తద్వారా నేరçస్తులను వెంటనే గుర్తించి, అరెస్టు చేసేందుకు వీలుండేది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారు. దాని వెనుక ఆంతర్యం ఏమిటి? వీడియో బయటపడిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసింది. అందువల్లే అసలు సమస్య మయన్మార్‌లో 2021లో అక్కడి సైనిక ప్రభుత్వం మిలిటెంట్లపై కఠిన చర్యలు ప్రారంభించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడున్న కుకీలు మన దేశంలోని మణిపూర్‌కు వలసవచ్చారు. మణిపూర్ లోయలోని అడవుల్లో వారు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అందువల్ల ఇక్కడ సమస్య మొదలైంది. వలసవచి్చన కుకీల స్థావరాలను గ్రామాలుగా అధికారికంగా ప్రకటిస్తున్నారని వదంతులు రావడంతో అశాంతి ప్రారంభమైంది. మైతేయిలను ఎస్టీల్లో చేర్చే ప్రక్రియ ప్రారంభించాలని మణిపూర్ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో సమస్య ఇంకా ముదిరింది. మణిపూర్‌లో ఘర్షణల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. హింసను చాలావరకు అరికట్టాం. కాంగ్రెస్‌కు అవినీతి పనులు అలవాటే ప్రభుత్వాలను కాపాడుకోవడానికి అవినీతికి పాల్పడిన ఘన చరిత్ర కాంగ్రెస్‌దే. విపక్ష కూటమి అసలు రూపం ప్రజలకు తెలుసు. 1999లో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వాజ్‌పేయి తప్పుడు మార్గాలు ఎంచుకోలేదు. మౌనంగా పదవి నుంచి దిగిపోయారు. ముడుపులు ఇచ్చి ప్రభుత్వాలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు అలవాటే. 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని అలాగే రక్షించుకున్నారు. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా అదేవిధంగా సంక్షోభం నుంచి గట్టెక్కింది. కాంగ్రెస్ పార్టీ అసలు రంగు ఇదే. బీజేపీ ఎప్పటికీ విలువలకు కట్టుబడి ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలకు విశ్వాసం లేకపోవచ్చు గానీ ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పొందిన నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమే. ఆయన రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఇలా జరగడం 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అవినీతి.. క్విట్ ఇండియా, వారసత్వ రాజకీయాలు.. క్విట్ ఇండియా, బుజ్జగింపు రాజకీయాలు.. క్విట్ ఇండియా అని మేము నినదిస్తున్నాం. చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.. చేతులు జోడించి ప్రారి్థస్తున్నా. హింసకు ఇక స్వస్తి పలికి శాంతియుతంగా కలిసిమెలసి ఉండాలని మణిపూర్ తెగలను కోరుతున్నా. సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు జరపడానికి కుకీలు, మైతేయిలు ముందుకు రావాలి. మణిపూర్ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు. అరాచకాలను ఎవరూ సమరి్థంచరు. మణిపూర్‌లో జరిగిన ఘటనలు సిగ్గుచేటు. వాటిని రాజకీయం చేయడం సిగ్గుచేటు. మణిపూర్‌లో అగి్నకి ఆజ్యం పోయవద్దని ప్రతిపక్షాలను కోరుతున్నా. మణిపూర్‌లో జరిగిన ఘర్షణల్లో మే 3వ తేదీ నుంచి ఇప్పటిదాక 152 మంది మరణించారు. 14,898 మంది నిందితులు అరెస్టయ్యారు. 1,106 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరణాలు తగ్గుతున్నాయి. మే నెలలో 107 మంది, జూన్‌లో 30 మంది, జూలైలో 15 మంది మరణించారు. మణిపూర్ ముఖ్యమంత్రిని తొలగించే అవకాశం లేదు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించే విషయంలో సీఎం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. అక్కడ రాష్ట్రపతి పాలన అవసరం లేదు’’ అని అమిత్ వివరించారు. -
‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందా?!
సాక్షి, ముంబై : ‘ ప్రతి పదేళ్లకోసారి ఓ కొత్త సవాల్ వచ్చి పడుతూనే ఉంది. 1980 దశకంలో సినిమా వీడియోలు వచ్చాయి. అంతే ఇక సినిమా థియేటర్ల పని అయిపోయిందన్నారు. 2010లో టెర్రరిజమ్ బాంబు దాడులు, ఆ తర్వాత మల్టీ ప్లెక్సులు, ఓటీటీలు వచ్చాయి. అంతే సింగిల్ థియేటర్ కథ ముగింసిందన్నారు. ఇప్పుడు 2020లో కరోనా ముట్టడించింది. ఇంతకాలం కష్టనష్టాలకోడ్చి బయట పడిందీ ఓ ఎత్తు. ఇప్పుడు కరోనా తెచ్చిన కష్టాల నుంచి బయట పడడం ఓ ఎత్తు. ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముంబై నగరంలోని ‘భారత మాతా సినిమా’ థియేటర్ యజమాని కపిల్ భోపాత్కర్ వ్యాఖ్యానించారు. 1939లో ఏర్పాటైన ఈ సినిమా హాలు పేరు ముందు లక్ష్మీ థియేటర్. ‘నేషనల్ కార్పొరేషన్ మిల్’ స్థలంలో ఓ మూలన, ఆ మిల్లులో పనిచేసే కార్మికుల వినోదం కోసం ఏర్పాటయింది. కార్మికుల షిప్టులను దృష్టిలో పెట్టుకొని సినిమా ఆటల వేలలుండేవి. 1982–83 మధ్య ఆ కార్పొరేషన్ పరిధిలోని 60 బట్టల మిల్లుల్లో కార్మికులు సమ్మె చేశారు. ఆ సందర్భంగా మొదటిసారి సినిమా హాలుకు కష్టాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల అక్కడి నుంచి మిల్లులు, మిల్లులోని కార్మికులు పెద్దపెద్ద మిల్లులకు తరలి పోయారు. (బాయ్‌కాట్ సల్మాన్ ఖాన్) సినిమా వీడియోలు రంగప్రవేశం చేయడంతో ఇక ‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందంటూ బంధు మిత్రులు హెచ్చరించారని, అయితే మానవుడు సంఘ జీవని, ఇంట్లో కూర్చొని సినిమా చూసే బదులు మిత్రులతో కలిసి సినిమాకు వెళ్లడానికే ఎవరైనా ఇష్ట పడతారంటూ ఓ జర్నలిస్టు మిత్రుడు తన భుజం తట్టినట్లు కపిల్ తెలిపారు. ఆ తర్వాత మల్టీప్లెక్స్‌లు, నేటి ఓటీటీల వల్ల సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆయన చెప్పారు. ఓటీటీ అంటే ఒవర్ ది టాప్ అని అర్థం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు, స్లింగ్ టీవీ తదితర యాప్‌లు ఓటీటీ పద్ధతిలో సినిమాలను మనకు ప్రసారం చేస్తున్నాయి. (సుశాంత్ సింగ్ విశేషాలెన్నో!) ఇలాంటి పోటీలను తట్టుకొని ఇప్పటికీ ‘భారత మాతా సినిమా’ మనుగడ సాగించడానికి టిక్కెట్ ధర అతి తక్కువగా ఉండడం, ఎక్కువగా మరాఠీ చిత్రాలను ఆడించడమే కారణం. టాప్ క్లాస్ టిక్కెట్ ధర కేవలం 80 రూపాయలే. ఒకప్పుడు 750 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటైన ఆ సినిమా హాలు సీట్ల ఆధునీకరణ వల్ల 600 సీట్లకు పరిమితమైంది. మరోసారి ఆధునీకరించడం కోసం మార్చి ఒకటవ తేదీన సినిమా హాలును మూసి వేశారు. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. తెరచుకునే అవకాశం లేకుండా పోయింది. సినిమా హాలు శాశ్వతంగా మూసివేసి అక్కడ మరో వ్యాపారం నిర్వహించాలంటే అందుకు చట్టం అనుమతించడం లేదు. 1992లో తీసుకొచ్చిన చట్ట ప్రకారం ఓ సినిమా హాలును మూసివేసినట్లయితే ఆ స్థలంలో మూడోవంతు స్థలంలోనైనా మరో సినిమా థియేటర్ నిర్మించాలి. అందుకనే సింగిల్ థియేటర్లు మూత పడిన చోట పుట్టుకొచ్చిన మల్టీఫ్లెక్స్‌లలో సినిమా హాళ్లు వెలిశాయి. అంత స్థలం తనకు లేకపోవడం వల్ల హాలును మూసివేయలేక పోతున్నానంటూ కపిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై నగరంలోని దాదాపు వంద సింగిల్ థియేటర్ల పరిస్థితి ఇలాగే ఉంది. దేశవ్యాప్తంగా సింగ్ థియేటర్ల పరిస్థితి బాగోలేదు. (ఇప్పట్లో ముంబైకి వచ్చే సాహసం చేయను) -
ఉద్యమ సూరీడు
‘మరణం నా తలుపు తడుతోంది. నా మనస్సు అనంతత్వం వైపు ఎగిరిపోతోంది. అలాంటి ఆహ్లాదకర, అలాంటి తీక్షణ, అలాంటి గంభీర క్షణంలో నేను మీకు ఏం ఇవ్వగలను? ఒక్కటే ఒక్కటి ఇవ్వగలను! అది నా కల. నా బంగారు స్వప్నం ఇవ్వగలను. ఏప్రిల్18, 1930న జరిగిన చిట్టగాంగ్ తూర్పు దిక్కు తిరుగుబాటును మరచిపోకండి! భారతమాత స్వేచ్ఛ కోసం త్యాగాలు చేస్తూ బలిపీఠాలు ఎక్కిన దేశభక్తుల పేర్లు మీ గుండెలలో లిఖించుకోండి! ’ఒక విప్లవకారుడు తన సహచరులకి రాసిన ఆఖరి లేఖ ఇది. ఆ ఉత్తరం రాసిన తరువాత ఆయనను ఉరి తీశారు. బ్రిటిష్ పాలన నాటి జైళ్ల గోడలకి నోరొస్తే మొదట తీవ్ర జాతీయవాదుల మీద జరిగిన అకృత్యాల గురించి చెబుతాయి. చిట్టగాంగ్ కేంద్ర కారాగారపు గోడలు మాత్రం ఆ విప్లవకారుడి మీద జరిగిన చిత్రవధ గురించి పలుకుతాయి. ఆ ఉరి కంబానికి నోరుంటే ఆ శిక్ష అమలైన తీరు ఎంత ఘోరమో మొదట చెబుతుంది. కారాగారంలోని గదిలో నుంచి ఆ విప్లవకారుడిని బ్రిటిష్ పోలీసులు, అధికారులు ఈడ్చుకుని వచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో హింసించారు. పరమ కిరాతకంగా ప్రవర్తించారు. సుత్తితో కొట్టి పళ్లన్నీ ఊడగొట్టారు. చేతులూ కాళ్లూ సుత్తితోనే కొట్టి విరిచేశారు. కీళ్లు బద్దలుకొట్టారు. అన్ని గోళ్లు ఊడబెరికారు. అంత బాధను ఆయన మౌనంగానే భరించడం విశేషం. ఆఖరికి స్పృహ తప్పిన ఆ దేహాన్నే ఉరికంబం ఎక్కించి, శిక్ష అమలు చేశారు. భౌతికకాయాన్ని ఒక బోనులో పెట్టి సముద్రంలోకి విసిరేశారు. జనవరి 12, 1934న ఈ ఘాతుకం జరిగింది. సూర్యకుమార్ సేన్ అనే విప్లవవీరుడి మరణ దృశ్యమిది. సూర్యసేన్గా, మాస్టర్‌దా పేరుతో ప్రసిద్ధుడైన ఆయనంటే శ్వేతజాతికి ఎందుకంత ద్వేషం? ఆయన మీద అంత క్రూరత్వం ఎందుకు? సూర్యసేన్ (మార్చి 22, 1894–జనవరి 12, 1934) వంగదేశంలోని చిట్టగాంగ్ దగ్గరి నవ్‌పారాలో జన్మించారు (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది). తండ్రి నిరంజన్ సేన్. తల్లి శీలాబాలా దేవి. నిరంజన్ ఉపాధ్యాయుడు. సూర్యసేన్ మొదట తీవ్ర జాతీయవాదిగా విప్లవోద్యమంలో పనిచేశారు. కొద్దికాలం భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు. చిట్టగాంగ్ జిల్లా శాఖ అధ్యక్షుడు కూడా అయ్యారు. మళ్లీ విప్లవోద్యమం వైపే నడిచారు. వంగ భంగ (బెంగాల్ విభజన) సమయంలో సేన్ నవ్‌పారాలో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్నారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం తరువాత తీవ్ర జాతీయవాదంగా కూడా పరిణమించింది. చిట్టగాంగ్‌లోనే ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు తన అధ్యాపకుల నుంచి తొలిసారి భారత స్వాతంత్య్రోద్యమం గురించి ఆయన విన్నారు. పైగా ఆనాడు బెంగాల్లో అనేక తీవ్ర జాతీయవాద సంస్థలు పనిచేసేవి. వాటిలో అనుశీలన్ సమితి ఒకటి. శరత్‌చంద్రబోస్ ఈ సంస్థను ఆరంభించారు. శరత్చంద్రకు స్వామి వివేకానంద, సిస్టర్ నివేదితల అండ ఉండేది. అనుశీలన్ సమితి సాయుధ పంథాని నమ్మింది. సంస్థ కోసం నిబద్ధతతో పనిచేస్తామని కొత్త సభ్యుల చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించేవారు. బెంగాలీల ఆరాధ్యదేవత కాళీమాత బొమ్మ ఎదురుగా ఆయుధాలను వినియోగించడంలో వారు తర్ఫీదు తీసుకునేవారు. సతీశ్‌చంద్ర చక్రవర్తి అనే అధ్యాపకుడు సమితిలో పనిచేసేవారు. ఆయన ప్రోద్బలంతో సేన్ అనుశీలన్ సమితిలో సభ్యుడయ్యారు. అనుశీలన్ సమితి అనే పేరు బంకించంద్ర ఛటర్జీ రాసిన ఒక వ్యాసం నుంచి విప్లవకారులు తీసుకుని తమ సంస్థకు పెట్టుకున్నారు. తరువాత 1916 నాటికి బీఏ చదవడానికి సేన్ బెర్హంపూర్ వెళ్లారు. అక్కడ యుగాంతర్ పార్టీలో చేరారు. ఇది కూడా తీవ్ర జాతీయవాద సంస్థే. సాయుధ పంథాను నమ్మేదే. 1918లో బీఏ పూర్తి చేసి చిట్టగాంగ్ వచ్చిన సేన్ నందన్‌కానన్ అనే చోట ఉపాధ్యాయునిగా చేరారు. అక్కడ జుగాంతర్ పార్టీని స్థాపించడానికి ప్రయత్నాలు ఆరంభించారు. ఇంగ్లిష్ వారి చమురు సంస్థలో, టీతోటలో సమ్మె జరిగితే దానిని సూర్యసేన్ నాయకత్వంలోని యుగాంతర్ పార్టీ చిట్టగాంగ్ శాఖ సమర్థించింది. జలియన్‌వాలా బాగ్ ఉదంతానికి నిరసనగా ఉద్యమం నిర్వహించింది. సేన్ గొప్ప వక్త. మనుషులను ఏకం చేయగలిగే ఆకర్షణ ఉన్నవారు. నిర్వహణా సామర్థ్యం కలవారు. అందుకే అనతికాలంలోనే అందరి చేతా మాస్టర్‌దా అని పిలిపించుకునేటంత గౌరవం సంపాదించారు. ఆ తరువాతే సేన్ జీవితం చిన్న మలుపు తిరిగింది. 1921లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపునిచ్చారు. పైగా కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలోనే ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానం విషయంలో చిత్తరంజన్‌దాస్ కీలకంగా వ్యవహరించారు. దాస్‌తో సేన్‌కు సాన్నిహిత్యం ఉండేది. ఏమైనప్పటికీ ఆ సమయంలో సేన్ కూడా జాతీయ కాంగ్రెస్ పట్ల, గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షణ పెంచుకున్నారు. కానీ 1922 ఫిబ్రవరిలో జరిగిన చౌరీచౌరా ఉదంతంతో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం నిలిపివేశారు. ఆయన నిర్ణయం దేశంలో ఒక నిరాశా ప్రభంజనాన్ని వదిలిపెట్టింది. రాజకీయ శూన్యాన్ని ఏర్పరించింది. యువకులలో ఎక్కువ మంది కాంగ్రెస్ అప్పటిదాకా బోధించిన అహింసా, విన్నపాల మార్గం మీద ఒక్కసారిగా నమ్మకం కోల్పోయారు. విశాఖమన్యంలో రామరాజు, ఉత్తర పరగణాలలో చంద్రశేఖర ఆజాద్, చిట్టగాంగ్‌లో సూర్యసేన్ అలాంటి వారే. బ్రిటిష్ జాతి నుంచి దేశానికి విముక్తి కల్పించడమనేది ఒక్క సాయుధ సమరంతోనే సాధ్యమని వీరంతా నమ్మారు. బ్రిటిష్ వారి ఆయుధాలను దొంగిలించాలి. వాటితోనే బ్రిటిష్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేయాలి. ఇందుకు గెరిల్లా పోరాట పంథాను అనుసరించాలి. చిత్రంగా రామరాజు, ఆజాద్, సేన్ ముగ్గురిదీ ఒకటే ఆలోచన. ఒకటే వ్యూహం. వీరు ఒకరికి ఒకరు తెలియదనే చెప్పాలి. తెలిసే అవకాశం లేదు. ఒక కాలం, ఆ కాలం పంచిన క్షోభ వీరిలో ఏకాభిప్రాయానికి ఆస్కారం కల్పించింది. కానీ సేన్ మధ్య మధ్య మళ్లీ కాంగ్రెస్ కార్యకలాపాలలో కూడా పాలు పంచుకునేవారు. సూర్యసేన్ దాదాపు తను పుట్టి పెరిగిన చిట్టగాంగ్‌ను తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. గణేశ్ ఘోష్, లోక్‌నాథ్ బాల్, అంబికా చక్రవర్తి, అనంత్‌సింగ్, నిర్మల్ సేన్, అన్రూప్సేన్, నాగేశ్ సేన్, చారుబికాస్ దత్ వంటి విప్లవకారులతో తన ఉద్యమం నిర్వహించారు. కల్పనా దత్, ప్రీతిలాల్ వదేదార్ అనే ఇద్దరు మహిళలు కూడా ఆయన ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. చిట్టగాంగ్‌లో విప్లవ సేనల ప్రభుత్వం ఏర్పడింద -
‘భారత్ మాతా కూడా మీటూ బాధితురాలే’
చెన్నై : చెన్నై లయోలా కాలేజీలో నిర్వహించిన ఓ ఆర్ట్ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారింది. ఈ నెల 19, 20 తేదిల్లో కాలేజీలో ‘స్ట్రీట్ అవార్డ్ ఫెస్టివల్’ పేరుతో ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు. ‘అక్మే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించడం కోసం ఉద్దేశించిన ఈ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలు, వాటి క్యాప్షన్లు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని కించపరిచేలా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలకు ‘భారత్ మాతా కూడా మీటూ బాధితురాలే’, ‘రచయిత గౌరీ లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉంది’, ‘పీఎం మోదీ సామ్రాజ్యవాదాన్ని అనుసరిస్తారు’ అంటూ వివాదాస్పద క్యాప్షన్లు పెట్టారు. దాంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమా ఆనంద్ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘స్ట్రీట్ అవార్డ్ ఫెస్టివల్’ అని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. స్ట్రీట్ అవార్డ్స్ అంటే.. మన జాతీయ చిహ్నాలను.. దేశ ప్రధానిని అవమానించడమేనా’ అని ప్రశ్నించారు. మరో బీజేపీ కార్యకర్త మాట్లాడుతూ.. ‘లయోలా కాలేజీ కేంద్రం నుంచి నిధులు పొందుతుంది. కానీ ఇక్కడ లౌకిక భావనను పూర్తిగా దెబ్బ తీస్తున్నారు. జాతీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘ఒక వేళ కాలేజీ యాజమాన్యమే ఇలాంటి కార్యకలపాలను ప్రోత్సాహిస్తుందని తెలిస్తే.. కేంద్రం నుంచి కాలేజికి వచ్చే నిధులను నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరతామ’ని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. కాలేజీ ప్రాంగణాన్ని తప్పుడు కార్యక్రమాల కోసం దుర్వినియోగం చేసినందుకు తాము ఎంతో బాధపడుతున్నామని.. క్షమించమని కోరింది. -
గిరిజన ‘భారతమాత’
సాక్షి, న్యూఢిల్లీ : భారతమాత అంటే.. ఇప్పటివరకూ ఎరుపు రంగు చీర, చేతిలో జాతీయ జెండా, వెనకల సింహం.. ఇప్పటివరకూ అందరికీ తెలిసిన చిత్తరవు ఇదే. అయితే వచ్చే ఏడాది మార్చిలో త్రిపుర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భారతమాత రూపు పూర్తిగా మారనుంది. త్రిపురలో మెజారిటీ జనాభా గిరిజనులు కావడంతో.. వారి సంస్రదాయ వేష ధారణలోనే భారతమాతను బీజేపీ చిత్రీకరిస్తోంది. త్రిపుర సహా.. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు జనాభా అత్యధికమే. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన రూపంతో ఉన్న భారతమాత చిత్రాన్ని అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులను తిరిగి దేశవారసులుగా చేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. వారిని కొందరు దేశం నుంచి పరాయికరించారని వారు అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులంతా.. ఒకే సంప్రదాయానికి చెందినవారని త్రిపుర బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ దుదోకర్ చెప్పారు. త్రిపురలో దెబ్బోర్మ, త్రిపురి/త్రిపుర, రీనాగ్, చక్మా గిరిజనులు 78 శాతం జనాభా కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. ఈ గిరిజనులను ఏకతాటి మీదకు తెచ్చేందుకు, వారిని భారతీయుల్లో ఒకరని చెప్పడానికి ఇదే మంచి మార్గమని ఆయన స్పష్టం చేశారు. త్రిపురలోని బీజేపీ కార్యకర్తలంతా.. పార్టీ కార్యక్రమాల్లో ఈ ఫొటోను తప్పక ఉపయోగించాలని ఆయన ఆదేశించారు. -
మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్య
సాక్షి, ఇండోర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుస్తాన్ (భారత్) కేవలం హిందువుల కోసమేనని అయన స్పష్టం చేశారు. అయితే హిందుస్తాన్‌లో ఇతర మతస్తులు కూడా జీవించవచ్చని ఆయన చెప్పారు. ఇండోర్‌లో శనివారం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. జర్మన్ల కోసం జర్మనీ, బ్రిటీషర్ల కోసం బ్రిటన్, అమెరికన్ల కోసం అమెరికా.. అలాగే హిందువుల కోసం హిందుస్తాన్ అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందుస్తాన్‌లో హిందువులేకాక.. ఇతర మతస్తులు కూడా జీవించేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇక్కడ హిందువులు అంటే.. భారతమాత బిడ్డలని ఆయన విశ్లేషించారు. పురాతన భారతీయ వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే వారసులంతా భారతీయులే.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదని మోహన్ భగవత్ చెప్పారు. భారతదేశాన్ని ఏ ఒక్క పార్టీనో, లేక ఏ ఒక్క వ్యక్తో అభివృద్ధి చేయడం అసాధ్యమని.. సమాజం కూడా తమవంతు పాత్ర పోషిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. కేవలం ప్రభుత్వం వల్లే సమాజంలో మార్పు, అభివృద్ధి జరగదని.. ఇందుకోసం అందరూ కృషి చేయాలని అయన పిలుపునిచ్చారు. -
'ఇండియాలో పుట్టినవారికి ఇద్దరు తల్లులు'
'భారత్ మాతాకీ జై' నినాదం గురించి దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చోపచర్చలు, వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. దాని గురించి చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా మరో విషయం చెప్పారు. భారతదేశంలో పుట్టిన వాళ్లకు ఇద్దరు తల్లులు ఉంటారని, ఒకరు కన్న తల్లి కాగా మరొకరు భారత మాత అని ఆయన అన్నారు. ఉజ్జయినిలో క్షిప్ర నది ఒడ్డున జరుగుతున్న సింహస్త కుంభమేళాలో భాగంగా గురువారం ప్రారంభమైన మూడు రోజుల 'విచార్ మహాకుంభ్' సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జీవించడానికి వస్తున్న ప్రతి ఒక్కరినీ భారతమాత తన ఒడిలోకి తీసుకుందని మోహన్ భగవత్ అన్నారు. ఈ సదస్సులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. -
'కమ్యూనిజం లో నిజం లేదు'
భారత్ మాతాకీ జై అనేది ఓ మత నినాదం కాదని.. దానర్థం ప్రజలని.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ భారత్ మాతాకీ జై అనాలని సూచించారు. విజయవాడ గుణదల ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం ‘అమరవీరులకు అవమానం... జాతీయ సమైక్యత’ అనే అంశంపై జరిగిన సమావేశంలో వెంకయ్య పాల్గొని మాట్లాడారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య భావ దరిద్రుడన్నారు. విద్యాలయాల్లోకి విచ్చినకర శక్తులు చొరబడి విద్య కాకుండా వామపక్ష భావజాలాన్ని రుద్దుతున్నాయన్నారు. కమ్యూనిజంలో నిజం లేదని విమర్శించారు. విదేశీ భావజాలాన్ని దేశంపై రుద్దుతోందన్నారు. కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఏబీవీపీ, బీజేపీ నాయకులు సిద్ధాంతపరంగా అంశాలపై చర్చించి ప్రజలకు వాస్తవాలు తెలిసే దిశగా కృషి చేయాలని సూచించారు. -
‘భారత మాత’ ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ‘భారత్ మాతాకి జై’ అని నినాదం చేయనందుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేసింది. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేయాల్సిందిగా పఠాన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు ఈ వివాదం పఠాన్ సస్పెన్షన్‌కు దారితీసింది. ఆయన సస్పెన్షన్‌ను బీజీపీ, ఆరెస్సెస్ పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా సమర్ధించడం ఆశ్చర్యకరం. విశ్వంలో అల్లా ఒక్కడే దేవుడని నమ్మే ముస్లింలు కనకదుర్గకు ప్రతిరూపంగా హిందుత్వ జాతీయవాదులు కొలిచే భారత మాతాకు జై అని నినాదం చేయాలంటే వారి మత విశ్వాసాలను కాదనడమే. పరమత వాదాన్ని దౌర్జన్యంగా రుద్దడమే. ప్రస్తుత సందర్భంలో భారత దేశానికి భారత మాతను ప్రతిరూపంగా చూద్దాం అంటే ఆమె చేతిలో దేశ పటానికి బదులు ఆరెస్సెస్ జెండా ఉంటుంది. అసలు భారత మాత ఎలా పుట్టింది? బ్రిటీష్ పరిపాలనలో భారత దేశం నలిగిపోతున్నప్పుడు 1905లో భారత్ మాత అనే పదం పుట్టుకొచ్చింది. అందుకనే భారత మాత వెనకాల కనిపించే మ్యాప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్ దేశాలు కూడా ఉంటాయి. అదే సంవత్సరంలో బెంగాల్, బంగ్లాదేశ్‌గా, పశ్చిమ బెంగాల్‌గా విడిపోయింది. తొలుత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అదబిందో ఘోష్ భారతమాత అనే పదానికి శ్రీకారం చుట్టారు. అప్పటి గుజరాత్ రాజకీయవేత్త, రచయిత కేఎం మున్షీ అసలు దేశభక్తి ఏమిటని అరబిందో ఘోష్‌ను ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన తన ఇంటిగోడపై వేలాడుతున్న బ్రిటీష్ పాలనలోని భారత మ్యాప్‌ను చూపిస్తూ ‘ఇది భారత మాత చిత్రం. నగరాలు, నదులు, పర్వతాలు ఆమె శరీర భాగాలు, ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు, పెద్దలు ఆమె నరాలు. ఆమెను తొమ్మిది విధాలుగా పూజించాలి’ అని చెబుతారు. ఆయన వ్యాఖ్యలు భారత మాతా అవతరణకు నాంది పలికాయి. బెంగాల్ సాహిత్యం నుంచి భారత మాత దేవతా రూపాన్ని సంతరించుకుంది. కాళీ, దుర్గ, చండీలను బెంగాల్ ప్రజలు ఎక్కువ పూజిస్తారు. ఆనంద్ మఠ్ ద్వారా ముందుగా భారత మాతకు ప్రచారం లభించింది. తర్వాత బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ గీతాన్ని భారత మాతకు ఆపాదించడం వల్ల మరింత ప్రచారం లభించింది. వాస్తవానికి ఆయన దుర్గాదేవిని ఉద్దేశించి వందేమాతరం గీతాన్ని రాశారు. ఓ సందర్భంలో ఈ గీతాన్ని జాతీయ గీతంగా అంగీకరించాలనే చర్చ వచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యతిరేకించారు. ఠాగూర్ మేనల్లుడు, తొలి భారత ఆధునిక పెయింటర్‌గా గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ భారత మాతకు చిత్ర రూపం ఇచ్చారు. ఆయన కూడా భారత మాతను దుర్గాదేవి రూపానికి దగ్గరగా ఉండేలా చిత్రించారు. అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో ఈ చిత్రాలను విరివిగా ఉపయోగించారు. రానురాను ఈ చిత్రం భారతమాతకు పది చేతులున్నట్లు, సింహంపై స్వారీ చేస్తున్నట్లు రూపాంతరం చెందింది. చివరకు ఆమె చేతులోకి ఆరెస్సెస్ జెండా కూడా వచ్చి చేరింది. భారత మాతకు వారణాసిలో, మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లో, హరిద్వార్‌లో ఆలయాలు వెలశాయి. ఇంత చరిత్ర కలిగిన భారత మాతకు ‘జై’ కొడితే దేశానికి జై కొట్టినట్లా? హిందుత్వ జాతీయవాదుల దేవతకు జై కొట్టినట్లా? మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండైన వారిస్ పఠాన్ మాత్రం తాను ‘ఐ లవ్ మై కంట్రీ’ అని, ‘జై హింద్’ అనమంటే అంటానని చెబుతున్నారు. -
భారత మాత గా కుష్భు
సాక్షి, చెన్నై: భారత మాతగా నటి కుష్భును చిత్రీకరిస్తూ కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మదురైలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ రచ్చకెక్కింది. బీజేపీ నాయకులు కాంగ్రెస్ వర్గాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినీ ప్రేక్షకాభిమానుల ఆరాధ్య దేవత కుష్భు. ఆమెకు గతంలో ఆలయాన్ని సైతం నిర్మించారంటే అభిమానం ఏ పాటిదో అర్థంచేసుకోవచ్చు. సినీ వినీలాకాశం నుంచి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డీఎంకేలో అడుగు పెట్టారు. అయితే, అక్కడి రాజకీయాలు కుష్భు తట్టుకోలేకపోయారు. చివరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్భు ఆ పార్టీలో సెలబ్రెటీ అయ్యారు. ఆమె నేతృత్వంలో సభలు, సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ వర్గాలు ఉరకలు పరుగులు తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గణతంత్ర వేడుకల్లో భాగంగా మదురైలో కాంగ్రెస్ నాయకులు కుష్భు మీదున్న అభిమానంతో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మదురై ఉత్తన్ కుడి బస్టాండ్ వద్ద గత నెల 26న ఓ ఫ్లెక్సీని కాంగ్రెస్ వర్గాలు ఏర్పాటు చేశాయి. అయితే, దీనిని ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. అతి పెద్ద ఫ్లెక్సీ కావడంతో అందులో ఉన్నదెవరో గుర్తించ లేని పరిస్థితి. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సింహంపై భారత మాత చేతిలో జెండాను పెట్టుకున్నట్టుగా ఈ ఫ్లెక్సీని రూపొందించారు. తొలుత ఈ ఫ్లెక్సీని పెద్దగా పట్టించుకోలేదు. బుధవారం ఆ పరిసర వాసులు తీక్షణంగా పరిశీలించడంతో అందులో కుష్బు ముఖం ఉన్నట్లు బయట పడింది. సమాచారం అందుకున్న అక్కడి బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్గాలపై దుమ్మెత్తి పోశారు. వారం రోజులకు పైగా ఈ వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉన్నా, పోలీసులు పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత మాతగా ఆ ఫ్లెక్సీలో ఉన్న చిత్రం ఖుష్భుగా గుర్తించడంతో వివాదం రాజుకుంది. ఆ ఫ్లెక్సీని తొలగించాల్సిందేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగమేఘాలపై ఆ ఫ్లెక్సీని తొలగించి, అందులోని పేర్ల ఆధారంగా దానిని ఏర్పాటు చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయడం కొసమెరుపు.