సాక్షి, ముంబై : ‘ ప్రతి పదేళ్లకోసారి ఓ కొత్త సవాల్ వచ్చి పడుతూనే ఉంది. 1980 దశకంలో సినిమా వీడియోలు వచ్చాయి. అంతే ఇక సినిమా థియేటర్ల పని అయిపోయిందన్నారు. 2010లో టెర్రరిజమ్ బాంబు దాడులు, ఆ తర్వాత మల్టీ ప్లెక్సులు, ఓటీటీలు వచ్చాయి. అంతే సింగిల్ థియేటర్ కథ ముగింసిందన్నారు. ఇప్పుడు 2020లో కరోనా ముట్టడించింది. ఇంతకాలం కష్టనష్టాలకోడ్చి బయట పడిందీ ఓ ఎత్తు. ఇప్పుడు కరోనా తెచ్చిన కష్టాల నుంచి బయట పడడం ఓ ఎత్తు. ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముంబై నగరంలోని ‘భారత మాతా సినిమా’ థియేటర్ యజమాని కపిల్ భోపాత్కర్ వ్యాఖ్యానించారు.
1939లో ఏర్పాటైన ఈ సినిమా హాలు పేరు ముందు లక్ష్మీ థియేటర్. ‘నేషనల్ కార్పొరేషన్ మిల్’ స్థలంలో ఓ మూలన, ఆ మిల్లులో పనిచేసే కార్మికుల వినోదం కోసం ఏర్పాటయింది. కార్మికుల షిప్టులను దృష్టిలో పెట్టుకొని సినిమా ఆటల వేలలుండేవి. 1982–83 మధ్య ఆ కార్పొరేషన్ పరిధిలోని 60 బట్టల మిల్లుల్లో కార్మికులు సమ్మె చేశారు. ఆ సందర్భంగా మొదటిసారి సినిమా హాలుకు కష్టాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల అక్కడి నుంచి మిల్లులు, మిల్లులోని కార్మికులు పెద్దపెద్ద మిల్లులకు తరలి పోయారు. (బాయ్‌కాట్ సల్మాన్ ఖాన్)
సినిమా వీడియోలు రంగప్రవేశం చేయడంతో ఇక ‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందంటూ బంధు మిత్రులు హెచ్చరించారని, అయితే మానవుడు సంఘ జీవని, ఇంట్లో కూర్చొని సినిమా చూసే బదులు మిత్రులతో కలిసి సినిమాకు వెళ్లడానికే ఎవరైనా ఇష్ట పడతారంటూ ఓ జర్నలిస్టు మిత్రుడు తన భుజం తట్టినట్లు కపిల్ తెలిపారు. ఆ తర్వాత మల్టీప్లెక్స్‌లు, నేటి ఓటీటీల వల్ల సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆయన చెప్పారు. ఓటీటీ అంటే ఒవర్ ది టాప్ అని అర్థం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు, స్లింగ్ టీవీ తదితర యాప్‌లు ఓటీటీ పద్ధతిలో సినిమాలను మనకు ప్రసారం చేస్తున్నాయి. (సుశాంత్ సింగ్ విశేషాలెన్నో!)
ఇలాంటి పోటీలను తట్టుకొని ఇప్పటికీ ‘భారత మాతా సినిమా’ మనుగడ సాగించడానికి టిక్కెట్ ధర అతి తక్కువగా ఉండడం, ఎక్కువగా మరాఠీ చిత్రాలను ఆడించడమే కారణం. టాప్ క్లాస్ టిక్కెట్ ధర కేవలం 80 రూపాయలే. ఒకప్పుడు 750 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటైన ఆ సినిమా హాలు సీట్ల ఆధునీకరణ వల్ల 600 సీట్లకు పరిమితమైంది. మరోసారి ఆధునీకరించడం కోసం మార్చి ఒకటవ తేదీన సినిమా హాలును మూసి వేశారు. ఆ తర్వాత లాక్‌డౌన్ వచ్చింది. తెరచుకునే అవకాశం లేకుండా పోయింది. సినిమా హాలు శాశ్వతంగా మూసివేసి అక్కడ మరో వ్యాపారం నిర్వహించాలంటే అందుకు చట్టం అనుమతించడం లేదు. 1992లో తీసుకొచ్చిన చట్ట ప్రకారం ఓ సినిమా హాలును మూసివేసినట్లయితే ఆ స్థలంలో మూడోవంతు స్థలంలోనైనా మరో సినిమా థియేటర్ నిర్మించాలి. అందుకనే సింగిల్ థియేటర్లు మూత పడిన చోట పుట్టుకొచ్చిన మల్టీఫ్లెక్స్‌లలో సినిమా హాళ్లు వెలిశాయి. అంత స్థలం తనకు లేకపోవడం వల్ల హాలును మూసివేయలేక పోతున్నానంటూ కపిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై నగరంలోని దాదాపు వంద సింగిల్ థియేటర్ల పరిస్థితి ఇలాగే ఉంది. దేశవ్యాప్తంగా సింగ్ థియేటర్ల పరిస్థితి బాగోలేదు. (ఇప్పట్లో ముంబైకి వచ్చే సాహసం చేయను)
Comments
Please login to add a commentAdd a comment