‘భారత మాత’ ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ‘భారత్ మాతాకి జై’ అని నినాదం చేయనందుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేసింది. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేయాల్సిందిగా పఠాన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు ఈ వివాదం పఠాన్ సస్పెన్షన్‌కు దారితీసింది. ఆయన సస్పెన్షన్‌ను బీజీపీ, ఆరెస్సెస్ పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా సమర్ధించడం ఆశ్చర్యకరం. విశ్వంలో అల్లా ఒక్కడే దేవుడని నమ్మే ముస్లింలు కనకదుర్గకు ప్రతిరూపంగా హిందుత్వ జాతీయవాదులు కొలిచే భారత మాతాకు జై అని నినాదం చేయాలంటే వారి మత విశ్వాసాలను కాదనడమే. పరమత వాదాన్ని దౌర్జన్యంగా రుద్దడమే. ప్రస్తుత సందర్భంలో భారత దేశానికి భారత మాతను ప్రతిరూపంగా చూద్దాం అంటే ఆమె చేతిలో దేశ పటానికి బదులు ఆరెస్సెస్ జెండా ఉంటుంది.
అసలు భారత మాత ఎలా పుట్టింది?
బ్రిటీష్ పరిపాలనలో భారత దేశం నలిగిపోతున్నప్పుడు 1905లో భారత్ మాత అనే పదం పుట్టుకొచ్చింది. అందుకనే భారత మాత వెనకాల కనిపించే మ్యాప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్ దేశాలు కూడా ఉంటాయి. అదే సంవత్సరంలో బెంగాల్, బంగ్లాదేశ్‌గా, పశ్చిమ బెంగాల్‌గా విడిపోయింది. తొలుత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అదబిందో ఘోష్ భారతమాత అనే పదానికి శ్రీకారం చుట్టారు. అప్పటి గుజరాత్ రాజకీయవేత్త, రచయిత కేఎం మున్షీ అసలు దేశభక్తి ఏమిటని అరబిందో ఘోష్‌ను ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన తన ఇంటిగోడపై వేలాడుతున్న బ్రిటీష్ పాలనలోని భారత మ్యాప్‌ను చూపిస్తూ ‘ఇది భారత మాత చిత్రం. నగరాలు, నదులు, పర్వతాలు ఆమె శరీర భాగాలు, ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు, పెద్దలు ఆమె నరాలు. ఆమెను తొమ్మిది విధాలుగా పూజించాలి’ అని చెబుతారు. ఆయన వ్యాఖ్యలు భారత మాతా అవతరణకు నాంది పలికాయి.
బెంగాల్ సాహిత్యం నుంచి భారత మాత దేవతా రూపాన్ని సంతరించుకుంది. కాళీ, దుర్గ, చండీలను బెంగాల్ ప్రజలు ఎక్కువ పూజిస్తారు. ఆనంద్ మఠ్ ద్వారా ముందుగా భారత మాతకు ప్రచారం లభించింది. తర్వాత బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ గీతాన్ని భారత మాతకు ఆపాదించడం వల్ల మరింత ప్రచారం లభించింది. వాస్తవానికి ఆయన దుర్గాదేవిని ఉద్దేశించి వందేమాతరం గీతాన్ని రాశారు. ఓ సందర్భంలో ఈ గీతాన్ని జాతీయ గీతంగా అంగీకరించాలనే చర్చ వచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యతిరేకించారు. ఠాగూర్ మేనల్లుడు, తొలి భారత ఆధునిక పెయింటర్‌గా గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ భారత మాతకు చిత్ర రూపం ఇచ్చారు. ఆయన కూడా భారత మాతను దుర్గాదేవి రూపానికి దగ్గరగా ఉండేలా చిత్రించారు. అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో ఈ చిత్రాలను విరివిగా ఉపయోగించారు.
రానురాను ఈ చిత్రం భారతమాతకు పది చేతులున్నట్లు, సింహంపై స్వారీ చేస్తున్నట్లు రూపాంతరం చెందింది. చివరకు ఆమె చేతులోకి ఆరెస్సెస్ జెండా కూడా వచ్చి చేరింది. భారత మాతకు వారణాసిలో, మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లో, హరిద్వార్‌లో ఆలయాలు వెలశాయి. ఇంత చరిత్ర కలిగిన భారత మాతకు ‘జై’ కొడితే దేశానికి జై కొట్టినట్లా? హిందుత్వ జాతీయవాదుల దేవతకు జై కొట్టినట్లా? మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండైన వారిస్ పఠాన్ మాత్రం తాను ‘ఐ లవ్ మై కంట్రీ’ అని, ‘జై హింద్’ అనమంటే అంటానని చెబుతున్నారు.