సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మణిపూర్‌లో భరతమాతను బీజేపీ ప్రభుత్వం హత్య చేసిందని గర్జించారు. రాష్ట్రంలో హింసాకాండను అరికట్టడంలో, శాంతిని నెలకొల్పడంలో నరేంద్ర మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని ఆరోపించారు. బీజేపీ నాయకులు ముమ్మాటికీ దేశద్రోహులేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో రెండోరోజు బుధవారం కూడా చర్చ కొనసాగింది. ఈ చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత సభలో ఆయన మాట్లాడడం ఇదే మొదటిసారి. దాదాపు 30 నిమిషాల పాటు ప్రసంగం సాగింది. బీజేపీపై, మోదీ సర్కారుపై దుమ్మెత్తి పోశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో మోదీ సభలో లేరు. అలాగే తన ‘భారత్ జోడో యాత్ర’ అనుభవాలను రాహుల్ పంచుకున్నారు.
ఒకవైపు ఆయన ప్రసంగం కొనసాగుతుండగా, మరోవైపు సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విపక్ష ఎంపీలు ‘ఇండియా.. ఇండియా’ అని నినాదాలు చేయగా, అధికార పక్ష సభ్యులు ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గౌతమ్ అదానీ గురించి మాట్లాడడానికి సభకు రాలేదని, భయపడకండి అని బీజేపీ సభ్యులకు చురక అంటిస్తూ రాహుల్ తన ప్రసంగం ప్రారంభించారు. సభలో ఆయన ఏం మాట్లాడారంటే...
ప్రజల మద్దతుతోనే పాదయాత్ర దిగి్వజయం
భారత్ జోడో యాత్ర ఇంకా పూర్తి కాలేదు. ఈ యాత్ర ప్రారంభించినప్పుడు ఎందుకు నడుస్తున్నారు? మీ లక్ష్యం ఏమిటి? అని చాలామంది అడిగారు. పాదయాత్ర చేయాలని ఎందుకు అనుకున్నానో తొలుత తెలియలేదు. నేను దేన్ని ప్రేమిస్తానో అర్థం చేసుకోవడానికి, దేనికోసం నేను మరణానికి కూడా సిద్ధమో గుర్తించడానికి, మోదీకి చెందిన జైలుకు వెళ్లడానికి యాత్ర చేస్తున్నట్లు క్రమంగా తెలుసుకున్నా. నేను నిత్యం 10 కిలోమీటర్లు పరుగెత్తేవాడిని.
అలాంటిది పాదయాత్రలో రోజుకు 25 కిలోమీటర్లు నడవలేనా అనుకున్నా. అప్పట్లో నాలో అహంకారం ఉండేది. భారత్ జోడో యాత్ర ఆ అహంకారాన్ని మాయం చేసింది. యాత్ర మొదలైన తర్వాత రెండు మూడు రోజుల్లోనే నాకు ఒళ్లు నొప్పులు ప్రారంభమయ్యాయి. నాలో అహంకారం పూర్తిగా మాయమైంది. పాదయాత్రలో ప్రజలు నాకు అండగా నిలిచారు. వారి మద్దతుతోనే యాత్ర దిగి్వజయంగా కొనసాగించా. ప్రతిరోజూ ప్రజలు చెప్పింది విన్నాను. నా వద్దకు ఓ రైతు వచ్చాడు. అతడికి పంటల బీమా దక్కలేదని చెప్పాడు.
అతడి ఆకలి బాధ నాకు అర్థమైంది. ఆ తర్వాత నా యాత్ర తీరు మారిపోయింది. అప్పటినుంచి చుట్టుపక్కల ప్రజల నినాదాలు నాకు వినిపించలేదు. బాధితుల ఆవేదనే వినిపించేది. భారత్ జోడో యాత్ర పూర్తి కాలేదు. తూర్పు నుంచి పశి్చమ భారతదేశం వరకూ పాదయాత్ర కొనసాగిస్తా. దేశంలో వేర్వేరు భాషలు ఉన్నాయని చెబుతుంటారు. ఇది నేల, ఇది బంగారం, ఇది వెండి అని అంటుంటారు. కానీ, సత్యం ఏమిటంటే ఈ దేశం ఓ గొంతుక. దాన్ని వినాలంటే మన మనసులోని అహంకారాన్ని, విద్వేషాన్ని విడనాడాలి. అప్పుడే దేశం గొంతుక మనకు వినిపిస్తుంది.
ప్రజల గొంతుకను హత్య చేశారు
భారత్ అంటేనే ఓ గొంతుక. భారత్ మన ప్రజల గొంతుక. అది ప్రజల హృదయ స్పందన. అలాంటి గొంతుకను మీరు(బీజేపీ ప్రభుత్వం) మణిపూర్‌లో హత్య చేశారు. అంటే భరతమాతను హత్య చేశారు. మణిపూర్ ప్రజలను హత్య చేయడం ద్వారా భారతదేశాన్ని హత్యచేశారు. అందుకే మీ ప్రధాని( మోదీ) మణిపూర్ వెళ్లడం లేదు. మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహులు. మీరు భరతమాత రక్షకులు కాదు. భరతమాతను హత్య చేసిన హంతకులు. నా తల్లి ఈ సభలోనే ఉన్నారు. మరో తల్లి అయిన భరతమాత మణిపూర్‌లో హత్యకు గురైంది. మణిపూర్‌లో హింసను అరికట్టనంత వరకూ నా తల్లి హత్యకు గురవుతూనే ఉంటుంది.
దేశాన్ని దహనం చేసే కుట్రలు
సైన్యం ఒక్క రోజులో మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించగలదు. కానీ, కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని మణిపూర్‌లో మోహరించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మణిపూర్‌లో భారతదేశాన్ని హత్య చేయాలనుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల మాటలు వినడం లేదు. కేవలం ఇద్దరి మాటలే వింటున్నారు. రావణాసురుడు కేవలం మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలే విన్నాడు. అలాగే మోదీ కేవలం గౌతమ్ అదానీ, అమిత్ షా మాటలనే ఆలకిస్తున్నారు.
రావణుడి అహంకారమే లంకను దహనం చేసింది. రావణుడి అహంకారమే అతడిని అంతం చేసింది. మీరు దేశం మొత్తం కిరోసిన్ చల్లుతున్నారు. మణిపూర్‌లో కిరోసిన్ చల్లి నిప్పు రగిలించారు. హరియాణాలోనూ ఇప్పుడు అదే చేస్తున్నారు. దేశాన్ని దహనం చేసేందుకు మీరు కుతంత్రాలు పన్నుతున్నారు. దేశమంతటా భరతమాతను అంతం చేస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రసంగం అనంతరం ఆయన సభ నుంచి బయటకు వెళ్తూ ఇతర సభ్యుల వైపు చూస్తూ ‘ఫ్లైయింగ్ కిస్’ ఇచ్చారు.
మణిపూర్ బాధితుల ఆవేదన విన్నా
కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లాను. అక్కడికి ప్రధాని ఇప్పటికీ వెళ్లలేదు. మోదీ దృష్టిలో మణిపూర్ లేదు. మణిపూర్ భారతదేశంలో ఒక భాగం కాదని అనుకుంటున్నారు. నేను ‘మణిపూర్’ అనే పదాన్ని వాడాను. కానీ, మణిపూర్ అనేదే లేదు. దానిని రెండుగా విభజించారు. బీజేపీ ప్రభుత్వం మణిపూర్‌ను విచి్ఛన్నం చేసింది. నేను మణిపూర్‌లో సహాయక శిబిరాలకు వెళ్లాను. అక్కడున్న మహిళలు, పిల్లలతో మాట్లాడాను. ఒక మహిళను ‘అక్క.. మీకు ఏమైంది?’ అని అడిగా. దానికి ఆమె ‘నాకు ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు.
నా కళ్ల ముందే అతడిని కాలి్చచంపారు. రాత్రంతా నేను నా బిడ్డ మృతదేహం పక్కనే కూర్చున్నాను. ఆ తర్వాత భయపడి కట్టుబట్టలతో, చేతిలో ఓ ఫొటోతో నా ఇంటిని విడిచిపెట్టాను’ అని ఆమె నాతో చెప్పింది. మరో మహిళను ‘మీకు ఏమైంది?’ అని అడగ్గానే, ఆమెకు జరిగింది గుర్తుకు వచ్చి వణికిపోవడం మొదలుపెట్టింది. సొమ్మసిల్లి పడిపోయింది. మణిపూర్‌లో హిందూస్తాన్‌ను బీజేపీ హత్య చేసిందని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు.
Comments
Please login to add a commentAdd a comment