కలియబోర్: ప్రధానమంత్రి పదవిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఉండి ఉంటే మణిపూర్‌లో హింసకు నాలుగు రోజుల్లోనే పుల్‌స్టాప్ పడి ఉండేదని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం అస్సామ్‌లోని నగావ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తలుచుకుంటే మణిపూర్ హింసను సైన్యం సాయంతో మూడు రోజుల్లో ఆపగలిగేవారని అన్నారు.
కానీ, అలా చేయడం బీజేపీకి ఇష్టం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ నాలుగు నెలలుగా మండుతున్నా, మన ప్రధాని ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదు. అదే కాంగ్రెస్ ప్రధానే ఉంటే మూడు రోజుల్లోనే అక్కడికి వెళ్లి ఉండేవారు. నాలుగో రోజుకల్లా అక్కడ హింస ఆగిపోయి ఉండేది’అని ఆయన చెప్పారు. ‘నేతలు వస్తుంటారు, పోతుంటారు. కానీ, మనస్సు నిండా విద్వేషాన్ని, అహంకారాన్ని నింపుకున్న వారు త్వరలోనే కనుమరుగవుతారు’అని రాహుల్ పేర్కొన్నారు.
జై శ్రీ రాం, మోదీ నినాదాలు, రాహుల్ ఫ్లయింగ్ కిస్‌లు...
నగావ్ జిల్లాలో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్‌కు నిరసన సెగ తగిలింది. ఒక చోట బీజేపీ కార్యకర్తలు జై శ్రీ రాం, మోదీ, మోదీ.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌లు విసురుతూ వారిని కలుసుకునేందుకు వెళ్లారు. సంబంధిత వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. తర్వాత ర్యాలీలో మాట్లాడుతూ.. ‘సుమారు 3 కిలోమీటర్ల దూరంలో 20 నుంచి 25 మంది వరకు బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని మా బస్సు ముందుకు వచ్చారు. నేను బస్సు దిగి వచ్చే సరికి వారంతా పారిపోయారు. ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వశర్మ ఎవరొచ్చినా మేం భయపడేది లేదు’అని రాహుల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment