►మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు లోక్‌సభలో పెను దుమారం సృష్టించాయి. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తొలిసారిగా సభలో మాట్లాడిన ఆయన ఘాటు వ్యాఖ్యలతో బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రెండోరోజు బుధవారం కూడా కొనసాగింది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి.
►మణిపూర్‌లో హింసాకాండను అరికట్టడంలో నరేంద్ర మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని రాహుల్ నిప్పులు చెరిగారు. మణిపూర్ ప్రజలను హత్య చేయడం ద్వారా భారతదేశాన్ని హత్యచేశారని, అందుకే ప్రధాని అక్కడికి వెళ్లడం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు దేశ భక్తులు కాదు, ముమ్మాటికీ దేశ ద్రోహులేనని మండిపడ్డారు. విపక్షాల ఆరోపణలను లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిప్పికొట్టారు.
►మణిపూర్ అంశాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని విపక్షాలపై ధ్వజమెత్తారు. అగి్నకి ఆజ్యం పోయవద్దని సూచించారు. పొరుగు దేశం మయన్మార్ నుంచి కుకీ తెగ గిరిజనులు మణిపూర్‌కు వలస రావడం వల్లే అక్కడ సమస్య మొదలైందని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో ఘర్షణలు తగ్గు ముఖం పట్టాయని వెల్లడించారు. హింసకు ఇక స్వస్తి పలికి శాంతియుతంగా కలిసిమెలసి ఉండాలని మణిపూర్ తెగలకు ఆయన విజ్ఞప్తి చేశా రు. మణిపూర్‌లో శాంతిని కోరుకుంటూ అమిత్ షా ప్రతిపాదించిన తీర్మానాన్ని లోక్‌సభలో ఆమోదించారు.
రాజకీయం చేయడం సిగ్గుచేటు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంలో ప్రతిపక్షాల వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ వ్యవహారాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. విపక్ష నేత రాహుల్ గాంధీ తీరును తప్పుపట్టారు. మణిపూర్‌లో ముఖ్యమంత్రిని మార్చడం గానీ, రాష్ట్రపతి పాలన గానీ అవసరం లేదని తేలి్చచెప్పారు. మణిపూర్‌లో శాంతిని కాంక్షిస్తూ అమిత్ షా ప్రతిపాదించిన తీర్మానాన్ని లోక్‌సభలో ఆమోదించారు. సభలో అమిత్ షా ప్రసంగం ఆయన మాటల్లోనే...
రాహుల్ 13సార్లు విఫలం
‘‘మణిపూర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెద్ద డ్రామా నడిపించారు. ఆయన పర్యటనకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. వాటిని తిరస్కరించారు. చురాచాంద్‌పూర్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలని కోరితే రోడ్డు మార్గంలో వెళ్తానన్నారు. మొదటిరోజు సత్యాగ్రహం చేశారు. రెండోరోజు హెలికాప్టర్‌లో వెళ్లారు. 13 సార్లు రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాయకుడు(రాహుల్ గాం«దీ) ఈ సభలో ఉన్నారు. ఆయన 13 సార్లు విఫలమయ్యారు. మహారాష్ట్రలోని విదర్భలో కళావతి అనే పేద మహిళతో కలిసి రాహుల్ భోజనం చేశారు. ఆమె అనుభవిస్తున్న కష్టాలను ఈ సభలో ప్రస్తావించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఆరేళ్లు అధికారంలో ఉంది. కానీ, కళావతి పేదరికాన్ని పోగొట్టడం కోసం రాహుల్ చేసిందేమీ లేదు. మోదీ ప్రభుత్వమే కళావతికి ఇళ్లు, కరెంటు, గ్యాస్ సౌకర్యాలు కలి్పంచింది. రేషన్ సరుకులు ఇస్తోంది.
మోదీ సర్కారు ఎన్నో ఘనతలు సాధించింది
ప్రధాని మోదీ గత తొమ్మిదేళ్లలో 50 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆయన శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో మణిపూర్‌లో ఎన్నోసార్లు హింసాత్మక సంఘటనలు జరిగాయి. అప్పట్లో హోంమంత్రి మణిపూర్‌లో పర్యటించలేదు. కానీ, నేను ఆ రాష్ట్రంలో 23 రోజులపాటు పర్యటించా. ఈశాన్యంలో గత తొమ్మిదేళ్లలో 8 వేల మంది సాయుధ తీవ్రవాదులు లొంగిపోయారు. దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. ఎన్నో ఘనతలు సాధించింది.
ఆ వీడియో వెనుక ఆంతర్యం ఏమిటి?
‘‘మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న జరిగింది. ఈ వీడియో జూలై 19న బయటికొచి్చంది. వీడియోను సోషల్ మీడియాలో పెట్టే బదులు రాష్ట్ర డీజీపీకి అందజేస్తే బాగుండేది. తద్వారా నేరçస్తులను వెంటనే గుర్తించి, అరెస్టు చేసేందుకు వీలుండేది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారు. దాని వెనుక ఆంతర్యం ఏమిటి? వీడియో బయటపడిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. తొమ్మిది మంది నిందితులను అరెస్టు
చేసింది.
అందువల్లే అసలు సమస్య
మయన్మార్‌లో 2021లో అక్కడి సైనిక ప్రభుత్వం మిలిటెంట్లపై కఠిన చర్యలు ప్రారంభించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడున్న కుకీలు మన దేశంలోని మణిపూర్‌కు వలసవచ్చారు. మణిపూర్ లోయలోని అడవుల్లో వారు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అందువల్ల ఇక్కడ సమస్య మొదలైంది. వలసవచి్చన కుకీల స్థావరాలను గ్రామాలుగా అధికారికంగా ప్రకటిస్తున్నారని వదంతులు రావడంతో అశాంతి ప్రారంభమైంది. మైతేయిలను ఎస్టీల్లో చేర్చే ప్రక్రియ ప్రారంభించాలని మణిపూర్ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో సమస్య ఇంకా ముదిరింది. మణిపూర్‌లో ఘర్షణల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. హింసను చాలావరకు అరికట్టాం.
కాంగ్రెస్‌కు అవినీతి పనులు అలవాటే
ప్రభుత్వాలను కాపాడుకోవడానికి అవినీతికి పాల్పడిన ఘన చరిత్ర కాంగ్రెస్‌దే. విపక్ష కూటమి అసలు రూపం ప్రజలకు తెలుసు. 1999లో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వాజ్‌పేయి తప్పుడు మార్గాలు ఎంచుకోలేదు. మౌనంగా పదవి నుంచి దిగిపోయారు. ముడుపులు ఇచ్చి ప్రభుత్వాలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు అలవాటే. 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని అలాగే రక్షించుకున్నారు. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా అదేవిధంగా సంక్షోభం నుంచి గట్టెక్కింది.
కాంగ్రెస్ పార్టీ అసలు రంగు ఇదే. బీజేపీ ఎప్పటికీ విలువలకు కట్టుబడి ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలకు విశ్వాసం లేకపోవచ్చు గానీ ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పొందిన నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమే. ఆయన రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఇలా జరగడం 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అవినీతి.. క్విట్ ఇండియా, వారసత్వ రాజకీయాలు.. క్విట్ ఇండియా, బుజ్జగింపు రాజకీయాలు.. క్విట్ ఇండియా అని మేము నినదిస్తున్నాం.
చేతులు జోడించి ప్రార్థిస్తున్నా..
చేతులు జోడించి ప్రారి్థస్తున్నా. హింసకు ఇక స్వస్తి పలికి శాంతియుతంగా కలిసిమెలసి ఉండాలని మణిపూర్ తెగలను కోరుతున్నా. సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు జరపడానికి కుకీలు, మైతేయిలు ముందుకు రావాలి. మణిపూర్ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు. అరాచకాలను ఎవరూ సమరి్థంచరు. మణిపూర్‌లో జరిగిన ఘటనలు సిగ్గుచేటు. వాటిని రాజకీయం చేయడం సిగ్గుచేటు. మణిపూర్‌లో అగి్నకి ఆజ్యం పోయవద్దని ప్రతిపక్షాలను కోరుతున్నా.
మణిపూర్‌లో జరిగిన ఘర్షణల్లో మే 3వ తేదీ నుంచి ఇప్పటిదాక 152 మంది మరణించారు. 14,898 మంది నిందితులు అరెస్టయ్యారు. 1,106 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మరణాలు తగ్గుతున్నాయి. మే నెలలో 107 మంది, జూన్‌లో 30 మంది, జూలైలో 15 మంది మరణించారు. మణిపూర్ ముఖ్యమంత్రిని తొలగించే అవకాశం లేదు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించే విషయంలో సీఎం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. అక్కడ రాష్ట్రపతి పాలన అవసరం లేదు’’ అని అమిత్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment