mim mla
-
ఎంఐఎం ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ : యాకుత్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సమయంలో ముంతాజ్ ఖాన్ పూర్తి ఆస్తుల వివరాలు వెల్లడించలేదని రూప్ రాజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆధారాలతో పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. దీనిని విచారించిన హైకోర్టు ఈ నెల 18 వరకు ఆస్తులకు సంబంధించి పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించాలని ఎమ్మెల్యేకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. -
అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో తుదితీర్పు
హైదరాబాద్ : మజ్లిస్ పార్టీ శాసన సభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం కేసులో కోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నలుగురిని (సలీం బిన్, అబ్దుల్లా, అవద్, హసన్ బిన్) నాంపల్లిలోని 7వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి న్యాయస్థానం శుక్రవారం శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పహిల్వాన్‌పై న్యాయస్థానం కేసు కొట్టివేసింది. పహిల్వాన్ సహా పదిమంది నిందితులకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కస్-బాలాపూర్ రోడ్డులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అక్బరుద్దీన్‌కు తీవ్రగాయాలు కాగా... ఆయన గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో ఇబ్రాహిం అనే యువకుడు మరణించాడు. ఈ కేసులో 13మంది నిందుతులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటివరకు 19మంది సాక్షులను విచారించింది నాంపల్లి కోర్టు. అక్బరుద్దీన్ స్టేట్ మెంట్‌ను కూడా రికార్డు చేశారు. ఆరేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇవాళ తుది తీర్పు నేపథ్యంలో... అటు పహిల్వాన్ గ్యాంగ్, ఇటు ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కోర్టుకు వచ్చారు. దీంతో పోలీసులు పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
'ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయ్'
-
'ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయ్'
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే ముందుగా ఎన్నికల ఖర్చును తగ్గించుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాయని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో టెర్రరిజం అదుపులోకి వస్తుందని చెప్పారని అయితే అలాంటిదేమీ జరగలేదని ఆక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. 'ఇప్పటికే బ్యాంకుల్లో 13 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఆయా బ్యాంకుల వద్ద రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు కరెన్సీ ఉంది. రూ. 17 లక్షల కోట్లు లెక్క తేలాక ఇక బ్లాక్ మనీ ఎక్కడుంది' అని ఆయన ప్రశ్నించారు. -
‘భారత మాత’ ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ‘భారత్ మాతాకి జై’ అని నినాదం చేయనందుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేసింది. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేయాల్సిందిగా పఠాన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు ఈ వివాదం పఠాన్ సస్పెన్షన్‌కు దారితీసింది. ఆయన సస్పెన్షన్‌ను బీజీపీ, ఆరెస్సెస్ పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా సమర్ధించడం ఆశ్చర్యకరం. విశ్వంలో అల్లా ఒక్కడే దేవుడని నమ్మే ముస్లింలు కనకదుర్గకు ప్రతిరూపంగా హిందుత్వ జాతీయవాదులు కొలిచే భారత మాతాకు జై అని నినాదం చేయాలంటే వారి మత విశ్వాసాలను కాదనడమే. పరమత వాదాన్ని దౌర్జన్యంగా రుద్దడమే. ప్రస్తుత సందర్భంలో భారత దేశానికి భారత మాతను ప్రతిరూపంగా చూద్దాం అంటే ఆమె చేతిలో దేశ పటానికి బదులు ఆరెస్సెస్ జెండా ఉంటుంది. అసలు భారత మాత ఎలా పుట్టింది? బ్రిటీష్ పరిపాలనలో భారత దేశం నలిగిపోతున్నప్పుడు 1905లో భారత్ మాత అనే పదం పుట్టుకొచ్చింది. అందుకనే భారత మాత వెనకాల కనిపించే మ్యాప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్ దేశాలు కూడా ఉంటాయి. అదే సంవత్సరంలో బెంగాల్, బంగ్లాదేశ్‌గా, పశ్చిమ బెంగాల్‌గా విడిపోయింది. తొలుత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అదబిందో ఘోష్ భారతమాత అనే పదానికి శ్రీకారం చుట్టారు. అప్పటి గుజరాత్ రాజకీయవేత్త, రచయిత కేఎం మున్షీ అసలు దేశభక్తి ఏమిటని అరబిందో ఘోష్‌ను ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన తన ఇంటిగోడపై వేలాడుతున్న బ్రిటీష్ పాలనలోని భారత మ్యాప్‌ను చూపిస్తూ ‘ఇది భారత మాత చిత్రం. నగరాలు, నదులు, పర్వతాలు ఆమె శరీర భాగాలు, ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు, పెద్దలు ఆమె నరాలు. ఆమెను తొమ్మిది విధాలుగా పూజించాలి’ అని చెబుతారు. ఆయన వ్యాఖ్యలు భారత మాతా అవతరణకు నాంది పలికాయి. బెంగాల్ సాహిత్యం నుంచి భారత మాత దేవతా రూపాన్ని సంతరించుకుంది. కాళీ, దుర్గ, చండీలను బెంగాల్ ప్రజలు ఎక్కువ పూజిస్తారు. ఆనంద్ మఠ్ ద్వారా ముందుగా భారత మాతకు ప్రచారం లభించింది. తర్వాత బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ గీతాన్ని భారత మాతకు ఆపాదించడం వల్ల మరింత ప్రచారం లభించింది. వాస్తవానికి ఆయన దుర్గాదేవిని ఉద్దేశించి వందేమాతరం గీతాన్ని రాశారు. ఓ సందర్భంలో ఈ గీతాన్ని జాతీయ గీతంగా అంగీకరించాలనే చర్చ వచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యతిరేకించారు. ఠాగూర్ మేనల్లుడు, తొలి భారత ఆధునిక పెయింటర్‌గా గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ భారత మాతకు చిత్ర రూపం ఇచ్చారు. ఆయన కూడా భారత మాతను దుర్గాదేవి రూపానికి దగ్గరగా ఉండేలా చిత్రించారు. అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో ఈ చిత్రాలను విరివిగా ఉపయోగించారు. రానురాను ఈ చిత్రం భారతమాతకు పది చేతులున్నట్లు, సింహంపై స్వారీ చేస్తున్నట్లు రూపాంతరం చెందింది. చివరకు ఆమె చేతులోకి ఆరెస్సెస్ జెండా కూడా వచ్చి చేరింది. భారత మాతకు వారణాసిలో, మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లో, హరిద్వార్‌లో ఆలయాలు వెలశాయి. ఇంత చరిత్ర కలిగిన భారత మాతకు ‘జై’ కొడితే దేశానికి జై కొట్టినట్లా? హిందుత్వ జాతీయవాదుల దేవతకు జై కొట్టినట్లా? మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండైన వారిస్ పఠాన్ మాత్రం తాను ‘ఐ లవ్ మై కంట్రీ’ అని, ‘జై హింద్’ అనమంటే అంటానని చెబుతున్నారు. -
ఎమ్మెల్యే బలాలకు బెయిల్
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ తనయుడు అజం అలీపై దాడికి యత్నించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఉదయం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి బలాలను నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ బలాల డిప్యూటీ సీఎం ఇంటి ఎదురుగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. బలాలను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనపై 341, 448, 427, 506, 147, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
పాతబస్తీలో టెన్షన్... టెన్షన్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓల్డ్‌సిటీలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. పురానాపూల్‌లో కాంగ్రెస్ - ఎంఐఎం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌస్ అరెస్ట్‌కు నిరసనగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో.. పోలీసులు గౌస్‌ను విడుదల చేశారు. అదే సమయంలో అక్కడకు ఎంపీ అసదుద్దీన్ చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఉత్తమ్ కారుపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయన కారు ధ్వంసమైంది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఈ ఘటనపై ఉత్తమ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ ఖూనీ చేస్తోందన్నారు. పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్ధి గౌస్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఎన్నికల సంఘం కూడా టీఆర్ఎస్కు తొత్తులా వ్యవహారిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం దేనికి...నేరుగా కార్పొరేటర్లను ప్రకటిస్తే సరిపోతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ తీరుకు నిరసనగా డీజీపీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని ఉత్తమ్ హెచ్చరించారు.