పాతబస్తీలో టెన్షన్... టెన్షన్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓల్డ్సిటీలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. పురానాపూల్లో కాంగ్రెస్ - ఎంఐఎం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీంతో పోలీసులు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌస్ అరెస్ట్కు నిరసనగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో.. పోలీసులు గౌస్ను విడుదల చేశారు. అదే సమయంలో అక్కడకు ఎంపీ అసదుద్దీన్ చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఉత్తమ్ కారుపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయన కారు ధ్వంసమైంది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు.
ఈ ఘటనపై ఉత్తమ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ ఖూనీ చేస్తోందన్నారు. పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్ధి గౌస్ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఎన్నికల సంఘం కూడా టీఆర్ఎస్కు తొత్తులా వ్యవహారిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం దేనికి...నేరుగా కార్పొరేటర్లను ప్రకటిస్తే సరిపోతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ తీరుకు నిరసనగా డీజీపీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని ఉత్తమ్ హెచ్చరించారు.