అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో తుదితీర్పు
హైదరాబాద్ : మజ్లిస్ పార్టీ శాసన సభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం కేసులో కోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నలుగురిని (సలీం బిన్, అబ్దుల్లా, అవద్, హసన్ బిన్) నాంపల్లిలోని 7వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి న్యాయస్థానం శుక్రవారం శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పహిల్వాన్‌పై న్యాయస్థానం కేసు కొట్టివేసింది. పహిల్వాన్ సహా పదిమంది నిందితులకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కస్-బాలాపూర్ రోడ్డులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో అక్బరుద్దీన్‌కు తీవ్రగాయాలు కాగా... ఆయన గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో ఇబ్రాహిం అనే యువకుడు మరణించాడు. ఈ కేసులో 13మంది నిందుతులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటివరకు 19మంది సాక్షులను విచారించింది నాంపల్లి కోర్టు. అక్బరుద్దీన్ స్టేట్ మెంట్‌ను కూడా రికార్డు చేశారు. ఆరేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇవాళ తుది తీర్పు నేపథ్యంలో... అటు పహిల్వాన్ గ్యాంగ్, ఇటు ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కోర్టుకు వచ్చారు. దీంతో పోలీసులు పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.