Waris Pathan
-
మజ్లిస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు..
సాక్షి, కరీంనగర్: మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై మంగళవారం కరీంనగర్లో కేసు నమోదైంది. గత ఫిబ్రవరిలో హిందువుల పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు విమర్శిస్తు పోలీసులను ఆశ్రయించారు. కాగా పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదును స్వీకరించి న్యాయమూర్తి సాయిసుధ కేసు నమోదు చేసి విచారణ జరపాలని త్రీ టౌన్ పోలీసులను ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశంతో త్రీటౌన్ ఎస్ఐ రామ్, మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై 121, 121-A, 124-A, 153, 153-A, 153-B, 295-A, 298, 505, 506 పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. -
‘భారత మాత’ ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ‘భారత్ మాతాకి జై’ అని నినాదం చేయనందుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేసింది. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేయాల్సిందిగా పఠాన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు ఈ వివాదం పఠాన్ సస్పెన్షన్‌కు దారితీసింది. ఆయన సస్పెన్షన్‌ను బీజీపీ, ఆరెస్సెస్ పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా సమర్ధించడం ఆశ్చర్యకరం. విశ్వంలో అల్లా ఒక్కడే దేవుడని నమ్మే ముస్లింలు కనకదుర్గకు ప్రతిరూపంగా హిందుత్వ జాతీయవాదులు కొలిచే భారత మాతాకు జై అని నినాదం చేయాలంటే వారి మత విశ్వాసాలను కాదనడమే. పరమత వాదాన్ని దౌర్జన్యంగా రుద్దడమే. ప్రస్తుత సందర్భంలో భారత దేశానికి భారత మాతను ప్రతిరూపంగా చూద్దాం అంటే ఆమె చేతిలో దేశ పటానికి బదులు ఆరెస్సెస్ జెండా ఉంటుంది. అసలు భారత మాత ఎలా పుట్టింది? బ్రిటీష్ పరిపాలనలో భారత దేశం నలిగిపోతున్నప్పుడు 1905లో భారత్ మాత అనే పదం పుట్టుకొచ్చింది. అందుకనే భారత మాత వెనకాల కనిపించే మ్యాప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్ దేశాలు కూడా ఉంటాయి. అదే సంవత్సరంలో బెంగాల్, బంగ్లాదేశ్‌గా, పశ్చిమ బెంగాల్‌గా విడిపోయింది. తొలుత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అదబిందో ఘోష్ భారతమాత అనే పదానికి శ్రీకారం చుట్టారు. అప్పటి గుజరాత్ రాజకీయవేత్త, రచయిత కేఎం మున్షీ అసలు దేశభక్తి ఏమిటని అరబిందో ఘోష్‌ను ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన తన ఇంటిగోడపై వేలాడుతున్న బ్రిటీష్ పాలనలోని భారత మ్యాప్‌ను చూపిస్తూ ‘ఇది భారత మాత చిత్రం. నగరాలు, నదులు, పర్వతాలు ఆమె శరీర భాగాలు, ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు, పెద్దలు ఆమె నరాలు. ఆమెను తొమ్మిది విధాలుగా పూజించాలి’ అని చెబుతారు. ఆయన వ్యాఖ్యలు భారత మాతా అవతరణకు నాంది పలికాయి. బెంగాల్ సాహిత్యం నుంచి భారత మాత దేవతా రూపాన్ని సంతరించుకుంది. కాళీ, దుర్గ, చండీలను బెంగాల్ ప్రజలు ఎక్కువ పూజిస్తారు. ఆనంద్ మఠ్ ద్వారా ముందుగా భారత మాతకు ప్రచారం లభించింది. తర్వాత బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ గీతాన్ని భారత మాతకు ఆపాదించడం వల్ల మరింత ప్రచారం లభించింది. వాస్తవానికి ఆయన దుర్గాదేవిని ఉద్దేశించి వందేమాతరం గీతాన్ని రాశారు. ఓ సందర్భంలో ఈ గీతాన్ని జాతీయ గీతంగా అంగీకరించాలనే చర్చ వచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యతిరేకించారు. ఠాగూర్ మేనల్లుడు, తొలి భారత ఆధునిక పెయింటర్‌గా గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ భారత మాతకు చిత్ర రూపం ఇచ్చారు. ఆయన కూడా భారత మాతను దుర్గాదేవి రూపానికి దగ్గరగా ఉండేలా చిత్రించారు. అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో ఈ చిత్రాలను విరివిగా ఉపయోగించారు. రానురాను ఈ చిత్రం భారతమాతకు పది చేతులున్నట్లు, సింహంపై స్వారీ చేస్తున్నట్లు రూపాంతరం చెందింది. చివరకు ఆమె చేతులోకి ఆరెస్సెస్ జెండా కూడా వచ్చి చేరింది. భారత మాతకు వారణాసిలో, మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లో, హరిద్వార్‌లో ఆలయాలు వెలశాయి. ఇంత చరిత్ర కలిగిన భారత మాతకు ‘జై’ కొడితే దేశానికి జై కొట్టినట్లా? హిందుత్వ జాతీయవాదుల దేవతకు జై కొట్టినట్లా? మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండైన వారిస్ పఠాన్ మాత్రం తాను ‘ఐ లవ్ మై కంట్రీ’ అని, ‘జై హింద్’ అనమంటే అంటానని చెబుతున్నారు. -
మహారాష్ట్ర అసెంబ్లీలో మజ్లిస్ ఎమ్మెల్యే సస్పెన్షన్
‘భారత్ మాతాకీ జై’ అనేందుకు నిరాకరించిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సస్పెండ్ చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీలకు అతీతంగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ముంబై: ‘భారత్ మాతాకీ జై’ అనేందుకు నిరాకరించిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సస్పెండ్ చేసింది. పార్టీలకతీతంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సౌత్ ముంబైలోని బైకుల్లా స్థానం నుంచి గెలిచిన పఠాన్‌పై సస్పెన్షన్ వేటు ప్రస్తుత బడ్జెట్ సెషన్స్ అయ్యే వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ‘‘జాతీయ నాయకులను అగౌరవ పరచడంతో పాటు ‘భారత్ మాతాకీ జై’ అనేందుకు పఠాన్ నిరాకరించారు’’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గిరీష్ బపత్ చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఔరంగాబాద్‌కు చెందిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యలతో ఈ రగడ మొదలైంది. ‘‘ప్రజలు కట్టే పన్నుల సొమ్మును ‘గొప్ప వ్యక్తుల’ స్మారక చిహ్నాలు కట్టడానికి వెచ్చించడం ప్రభుత్వానికి తగదు’’ అని జలీల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఓ శివసేన ఎమ్మెల్యే స్పందిస్తూ... ‘జలీల్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ భారత్ మాతాకీ జై అనేది లేదని ఇటీవల వ్యాఖ్యానించారు’ అని గుర్తు చేశారు. పఠాన్ కలుగజేసుకుని... ‘‘మేం ‘జైహింద్’ అంటాం కానీ ‘భారత్ మాతాకీ జై’ అనం. కచ్చితంగా ఈ నినాదం చెప్పాలని చట్టంలో ఎక్కడా లేదు’’ అన్నారు. దీంతో కోపోద్రిక్తులైన అధికార బీజేపీ, శివసేనతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పఠాన్‌ను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో హోంమంత్రి రంజిత్ పాటిల్ పఠాన్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘వాక్స్వాతంత్య్రాన్ని పఠాన్ దుర్వినియోగపరిచారు. సభ సంప్రదాయాన్ని మంటగలిపారు’ అని పాటిల్ చెప్పారు. మజ్లిస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ చీఫ్ ఎంపీ అసదుద్దీన ఒవైసీ అన్నారు. అసదుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్ఎస్ జమ్మూ: ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదం తాను చేయనన్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. భారత్‌ను తమ మాతృభూమిగా భావించనివారు దేశం వదిలి వెళ్లిపోవాలని సూచించింది. ‘ఒవైసీ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాతృభూమికి గౌరవం ఇవ్వనివారు దేశం వదిలి తమకు నచ్చిన చోటుకి వెళ్లవచ్చు. ఇలాంటి వారు పార్లమెంట్‌కు ఎన్నికవడం దురదృష్టకరం. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని ఆర్ఎస్ఎస్ జమ్మూ కశ్మీర్ ప్రాంత్ సంగ్ చాలక్ బ్రిగ్ సుచెట్ సింగ్ అన్నారు. ‘తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అని అనను’ అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనిలా స్పందించారు.