సాక్షి, ఇండోర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుస్తాన్ (భారత్) కేవలం హిందువుల కోసమేనని అయన స్పష్టం చేశారు. అయితే హిందుస్తాన్‌లో ఇతర మతస్తులు కూడా జీవించవచ్చని ఆయన చెప్పారు. ఇండోర్‌లో శనివారం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. జర్మన్ల కోసం జర్మనీ, బ్రిటీషర్ల కోసం బ్రిటన్, అమెరికన్ల కోసం అమెరికా.. అలాగే హిందువుల కోసం హిందుస్తాన్ అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందుస్తాన్‌లో హిందువులేకాక.. ఇతర మతస్తులు కూడా జీవించేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ఇక్కడ హిందువులు అంటే.. భారతమాత బిడ్డలని ఆయన విశ్లేషించారు. పురాతన భారతీయ వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే వారసులంతా భారతీయులే.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదని మోహన్ భగవత్ చెప్పారు.
భారతదేశాన్ని ఏ ఒక్క పార్టీనో, లేక ఏ ఒక్క వ్యక్తో అభివృద్ధి చేయడం అసాధ్యమని.. సమాజం కూడా తమవంతు పాత్ర పోషిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. కేవలం ప్రభుత్వం వల్లే సమాజంలో మార్పు, అభివృద్ధి జరగదని.. ఇందుకోసం అందరూ కృషి చేయాలని అయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment