‘మరణం నా తలుపు తడుతోంది. నా మనస్సు అనంతత్వం వైపు ఎగిరిపోతోంది. అలాంటి ఆహ్లాదకర, అలాంటి తీక్షణ, అలాంటి గంభీర క్షణంలో నేను మీకు ఏం ఇవ్వగలను? ఒక్కటే ఒక్కటి ఇవ్వగలను! అది నా కల. నా బంగారు స్వప్నం ఇవ్వగలను. ఏప్రిల్18, 1930న జరిగిన చిట్టగాంగ్ తూర్పు దిక్కు తిరుగుబాటును మరచిపోకండి! భారతమాత స్వేచ్ఛ కోసం త్యాగాలు చేస్తూ బలిపీఠాలు ఎక్కిన దేశభక్తుల పేర్లు మీ గుండెలలో లిఖించుకోండి! ’ఒక విప్లవకారుడు తన సహచరులకి రాసిన ఆఖరి లేఖ ఇది. ఆ ఉత్తరం రాసిన తరువాత ఆయనను ఉరి తీశారు. బ్రిటిష్ పాలన నాటి జైళ్ల గోడలకి నోరొస్తే మొదట తీవ్ర జాతీయవాదుల మీద జరిగిన అకృత్యాల గురించి చెబుతాయి. చిట్టగాంగ్ కేంద్ర కారాగారపు గోడలు మాత్రం ఆ విప్లవకారుడి మీద జరిగిన చిత్రవధ గురించి పలుకుతాయి. ఆ ఉరి కంబానికి నోరుంటే ఆ శిక్ష అమలైన తీరు ఎంత ఘోరమో మొదట చెబుతుంది.
కారాగారంలోని గదిలో నుంచి ఆ విప్లవకారుడిని బ్రిటిష్ పోలీసులు, అధికారులు ఈడ్చుకుని వచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో హింసించారు. పరమ కిరాతకంగా ప్రవర్తించారు. సుత్తితో కొట్టి పళ్లన్నీ ఊడగొట్టారు. చేతులూ కాళ్లూ సుత్తితోనే కొట్టి విరిచేశారు. కీళ్లు బద్దలుకొట్టారు. అన్ని గోళ్లు ఊడబెరికారు. అంత బాధను ఆయన మౌనంగానే భరించడం విశేషం. ఆఖరికి స్పృహ తప్పిన ఆ దేహాన్నే ఉరికంబం ఎక్కించి, శిక్ష అమలు చేశారు. భౌతికకాయాన్ని ఒక బోనులో పెట్టి సముద్రంలోకి విసిరేశారు. జనవరి 12, 1934న ఈ ఘాతుకం జరిగింది. సూర్యకుమార్ సేన్ అనే విప్లవవీరుడి మరణ దృశ్యమిది. సూర్యసేన్‌గా, మాస్టర్‌దా పేరుతో ప్రసిద్ధుడైన ఆయనంటే శ్వేతజాతికి ఎందుకంత ద్వేషం? ఆయన మీద అంత క్రూరత్వం ఎందుకు? సూర్యసేన్ (మార్చి 22, 1894–జనవరి 12, 1934) వంగదేశంలోని చిట్టగాంగ్ దగ్గరి నవ్‌పారాలో జన్మించారు (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది). తండ్రి నిరంజన్ సేన్.
తల్లి శీలాబాలా దేవి. నిరంజన్ ఉపాధ్యాయుడు. సూర్యసేన్ మొదట తీవ్ర జాతీయవాదిగా విప్లవోద్యమంలో పనిచేశారు. కొద్దికాలం భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు. చిట్టగాంగ్ జిల్లా శాఖ అధ్యక్షుడు కూడా అయ్యారు. మళ్లీ విప్లవోద్యమం వైపే నడిచారు. వంగ భంగ (బెంగాల్ విభజన) సమయంలో సేన్ నవ్‌పారాలో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్నారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం తరువాత తీవ్ర జాతీయవాదంగా కూడా పరిణమించింది. చిట్టగాంగ్‌లోనే ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు తన అధ్యాపకుల నుంచి తొలిసారి భారత స్వాతంత్య్రోద్యమం గురించి ఆయన విన్నారు. పైగా ఆనాడు బెంగాల్‌లో అనేక తీవ్ర జాతీయవాద సంస్థలు పనిచేసేవి. వాటిలో అనుశీలన్ సమితి ఒకటి. శరత్‌చంద్రబోస్ ఈ సంస్థను ఆరంభించారు. శరత్‌చంద్రకు స్వామి వివేకానంద, సిస్టర్ నివేదితల అండ ఉండేది. అనుశీలన్ సమితి సాయుధ పంథాని నమ్మింది. సంస్థ కోసం నిబద్ధతతో పనిచేస్తామని కొత్త సభ్యుల చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించేవారు.
బెంగాలీల ఆరాధ్యదేవత కాళీమాత బొమ్మ ఎదురుగా ఆయుధాలను వినియోగించడంలో వారు తర్ఫీదు తీసుకునేవారు. సతీశ్‌చంద్ర చక్రవర్తి అనే అధ్యాపకుడు సమితిలో పనిచేసేవారు. ఆయన ప్రోద్బలంతో సేన్ అనుశీలన్ సమితిలో సభ్యుడయ్యారు. అనుశీలన్ సమితి అనే పేరు బంకించంద్ర ఛటర్జీ రాసిన ఒక వ్యాసం నుంచి విప్లవకారులు తీసుకుని తమ సంస్థకు పెట్టుకున్నారు. తరువాత 1916 నాటికి బీఏ చదవడానికి సేన్ బెర్హంపూర్ వెళ్లారు. అక్కడ యుగాంతర్ పార్టీలో చేరారు. ఇది కూడా తీవ్ర జాతీయవాద సంస్థే. సాయుధ పంథాను నమ్మేదే. 1918లో బీఏ పూర్తి చేసి చిట్టగాంగ్ వచ్చిన సేన్ నందన్‌కానన్ అనే చోట ఉపాధ్యాయునిగా చేరారు. అక్కడ జుగాంతర్ పార్టీని స్థాపించడానికి ప్రయత్నాలు ఆరంభించారు. ఇంగ్లిష్ వారి చమురు సంస్థలో, టీతోటలో సమ్మె జరిగితే దానిని సూర్యసేన్ నాయకత్వంలోని యుగాంతర్ పార్టీ చిట్టగాంగ్ శాఖ సమర్థించింది. జలియన్‌వాలా బాగ్ ఉదంతానికి నిరసనగా ఉద్యమం నిర్వహించింది. సేన్ గొప్ప వక్త. మనుషులను ఏకం చేయగలిగే ఆకర్షణ ఉన్నవారు.
నిర్వహణా సామర్థ్యం కలవారు. అందుకే అనతికాలంలోనే అందరి చేతా మాస్టర్‌దా అని పిలిపించుకునేటంత గౌరవం సంపాదించారు. ఆ తరువాతే సేన్ జీవితం చిన్న మలుపు తిరిగింది. 1921లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపునిచ్చారు. పైగా కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలోనే ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానం విషయంలో చిత్తరంజన్‌దాస్ కీలకంగా వ్యవహరించారు. దాస్‌తో సేన్‌కు సాన్నిహిత్యం ఉండేది. ఏమైనప్పటికీ ఆ సమయంలో సేన్ కూడా జాతీయ కాంగ్రెస్ పట్ల, గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షణ పెంచుకున్నారు. కానీ 1922 ఫిబ్రవరిలో జరిగిన చౌరీచౌరా ఉదంతంతో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం నిలిపివేశారు. ఆయన నిర్ణయం దేశంలో ఒక నిరాశా ప్రభంజనాన్ని వదిలిపెట్టింది. రాజకీయ శూన్యాన్ని ఏర్పరించింది. యువకులలో ఎక్కువ మంది కాంగ్రెస్ అప్పటిదాకా బోధించిన అహింసా, విన్నపాల మార్గం మీద ఒక్కసారిగా నమ్మకం కోల్పోయారు. విశాఖమన్యంలో రామరాజు, ఉత్తర పరగణాలలో చంద్రశేఖర ఆజాద్, చిట్టగాంగ్‌లో సూర్యసేన్ అలాంటి వారే.
బ్రిటిష్ జాతి నుంచి దేశానికి విముక్తి కల్పించడమనేది ఒక్క సాయుధ సమరంతోనే సాధ్యమని వీరంతా నమ్మారు. బ్రిటిష్ వారి ఆయుధాలను దొంగిలించాలి. వాటితోనే బ్రిటిష్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేయాలి. ఇందుకు గెరిల్లా పోరాట పంథాను అనుసరించాలి. చిత్రంగా రామరాజు, ఆజాద్, సేన్ ముగ్గురిదీ ఒకటే ఆలోచన. ఒకటే వ్యూహం. వీరు ఒకరికి ఒకరు తెలియదనే చెప్పాలి. తెలిసే అవకాశం లేదు. ఒక కాలం, ఆ కాలం పంచిన క్షోభ వీరిలో ఏకాభిప్రాయానికి ఆస్కారం కల్పించింది. కానీ సేన్ మధ్య మధ్య మళ్లీ కాంగ్రెస్ కార్యకలాపాలలో కూడా పాలు పంచుకునేవారు. సూర్యసేన్ దాదాపు తను పుట్టి పెరిగిన చిట్టగాంగ్‌ను తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. గణేశ్ ఘోష్, లోక్‌నాథ్ బాల్, అంబికా చక్రవర్తి, అనంత్‌సింగ్, నిర్మల్ సేన్, అన్రూప్‌సేన్, నాగేశ్ సేన్, చారుబికాస్ దత్ వంటి విప్లవకారులతో తన ఉద్యమం నిర్వహించారు. కల్పనా దత్, ప్రీతిలాల్ వదేదార్ అనే ఇద్దరు మహిళలు కూడా ఆయన ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. చిట్టగాంగ్‌లో విప్లవ సేనల ప్రభుత్వం ఏర్పడింద
Comments
Please login to add a commentAdd a comment