6,000 మంది తప్పించుకున్న వైనం
పోలీసుల కాల్పుల్లో 33 మంది మృతి
మపుటో: మొజాంబిక్‌లో ఎన్నికల అనంతర హింస చల్లారడం లేదు. రాజధాని మపుటో శివార్లలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన సెంట్రల్ జైల్లో బుధవారం అల్లర్లు చెలరేగాయి. పోలీసు సిబ్బంది నుంచి కొందరు ఖైదీలు ఆయుధాలు లాక్కుని తోటివారిని విడిపించడం మొదలు పెట్టారు. అల్లర్లు, తిరుగుబాటును అణిచేందుకు భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో 33 మంది మృతి చెందారు.
15 మందికి పైగా గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారం. ఆ క్రమంలో జైలు గోడ కూలిపోవడంతో ఏకంగా 6,000 మందికి పైగా జైలు నుంచి తప్పించుకున్నట్టు దేశ పోలీసు జనరల్ కమాండర్ బెర్నార్డినో రఫెల్ తెలిపారు. వారిలో 150 మందిని పట్టుకున్నామన్నారు. ‘‘నేరారోపణలు రుజువైన 29 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను కూడా ఖైదీలు విడిపించుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో రెండు జైళ్లలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి’’అని వివరించారు. ఖైదీలు జైలు నుంచి పారిపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి.
అధికార పార్టీకి వ్యతిరేకంగా
గత అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ఫ్రెలిమో పార్టీ విజయం సాధించింది. ఫలితాలను నిరసిస్తూ అప్పట్నుంచే దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. అధికార పార్టీ విజయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ధ్రువీకరించింది. దాంతో ఒక్కసారిగా అల్లర్లు తీవ్రతరమయ్యాయి. వాటిలో ఒక్క రోజే కనీసం 21 మంది మరణించినట్టు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment