సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీ దేశంలో విద్వేషం సృష్టిస్తోందని..ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలు దేశానికి చేటు చేస్తాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. చైనా ఓ పక్క దేశాన్ని ఆక్రమిస్తుంటే, కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మణిపూర్, హరియాణాలో జరుగుతున్న హింసాకాండకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలన్నారు. దేశాన్ని ఓ దుకాణదారుడు, ఓ చౌకీదార్ ఏలుతున్నారని, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదని..ఇది ఇలానే కొనసాగితే దుకాణదారుడి దుకాణం మూతపడుతుందని, చౌకీదార్ మారుతాడని స్పష్టం చేశారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఒవైసీ మాట్లాడారు. నుహ్ హింస, యూసీసీ, హిజాబ్, మణిపూర్ సహా పలుఅంశాలను ఆయన ప్రస్తావించారు. అక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీ మనస్సాక్షి ఎక్కడికి పోయిందని కేంద్రాన్ని ప్రశ్నించారు. సీఎం సహకరిస్తున్నారు కాబట్టి ఆయన్ను తొలగించడం ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. హరియాణాలోని నూహ్‌లో 750 భవనాలను ముస్లింలవి అనే కారణంగానే నిబంధనలు పాటించకుండా కూల్చివేశారని, అవి పూర్తిగా చట్టవిరుద్ధమని, హైకోర్టు పేర్కొందని గుర్తు చేసిన ఒవైసీ, భవనాలు కూలుస్తున్నప్పుడు దేశ మనస్సాక్షి ఎక్కడికి పోయిందన్నారు.
క్విట్ ఇండియా నినాదం ముస్లిందే
ఇటీవల మీనాసాహబ్ అనే వ్యక్తిని అతను ధరించిన దుస్తులు, గడ్డం చూసి, పేరు అడిగి ఒకరు చంపారు...అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో బతకాలంటే మోదీకి ఓటేయాలన్నారు. ఇది ఛాందస వాదానికి ఉదాహరణ కాదా? అని ఒవైసీ ప్రశ్నించారు. ఇక దేశంలో హిజాబ్‌ను సమస్యగా మార్చి, ముస్లిం బాలికలను చదువుకు దూరంగా ఉంచారని దుయ్యబట్టారు. ‘బిల్కిస్‌బానో ఈ దేశపు పుత్రిక కాదా అని నేను అడుగుతున్నా. బిల్కిస్‌బానోపై 11 మంది అత్యాచారం చేశారు, ఆమె తల్లిపై అత్యాచారం చేసి హత్య చేశారు. మీరు నేరస్తులను విడుదల చేశారు. మీరు మెజారిటీ కోసం పనిచేస్తున్నారు’అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
బీజేపీ నేతలు మాట్లాడితే ‘క్విట్ ఇండియా’అంటున్నారని, అయితే ఈ నినాదం ఒక ముస్లిం ఇచ్చారని తెలిస్తే మాత్రం ఈ మాట చెప్పడం మానేస్తారని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీ ఆమోదించిన క్విట్ ఇండియా నినాదాన్ని యూసుఫ్ మెహర్ అలీ రూపొందించారని చెప్పారు. పాకిస్తాన్‌లో ఉన్న కులభూషణ్ జాదవ్‌ను ఎందుకు తీసుకురావడం లేదన్నారు. ‘విశ్వగురు–విశ్వగురు అంటారు కానీ మీరు కులభూషణ్ జాదవ్‌ను మర్చిపోయారు. నేవీ అధికారులు ఖతార్‌లో ఒక సంవత్సరం జైలులో ఉన్నారు, కానీ మీరు వారిని తీసుకురాలేకపోయారు’అని అన్నారు.
చైనా ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారు
ఇక చైనా అంశాన్ని ప్రస్తావిస్తూ ‘మీరు చైనా గురించి ఏమీ మాట్లాడరు. 2013లో మోదీ సమస్య ఢిల్లీలో ఉందని, సరిహద్దులో లేదన్నారు. ఈ రోజు చైనా మన భూమిపై కూర్చోలేదా?, ప్రభుత్వం ఏం చేస్తోంది. మోదీ అహ్మదాబాద్‌లో జిన్‌పింగ్‌ను పిలిచి, హత్తుకున్నారు.అతన్ని చెన్నైకి తీసుకెళ్లారు. అయితే ఏం జరిగింది, ఫలితం ఏమిటి?’అని అడిగారు. ఒకదేశం, ఒకేచట్టం అనే యూసీసీ ఫార్ములా ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. దేశంలో ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే భాష అనేది నియంతల ఫార్ములా అని పేర్కొన్నారు. దేశంలో లెక్కలేనన్ని భాషలు, అనేక మతాలు ఉన్నాయని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment