గత మూడు నెలలుగా అత్యంత ఘోరమైన, దారుణమైన పరిణామాలను చవిచూస్తున్న మణిపుర్ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండిపోయారని ఆరోపిస్తూ లోక్‌సభలో విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం గురువారం వీగిపోయింది. మోదీ వాక్పటిమ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆయన రెండు గంటల పది నిమిషాల సుదీర్ఘ ప్రసంగం మరోసారి ఆ విషయాన్ని రుజువు చేసింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగి, ఆయన సభకు రావటం అటు విపక్షాలతోపాటు ఇటు అధికార పక్షానికి కూడా కలిసొచ్చింది. విపక్ష స్వరం దీటుగా వినబడ టానికి రాహుల్ దోహదపడితే... ఆయనపైనా, కాంగ్రెస్‌పైనా నిప్పులు చెరిగేందుకు అధికారపక్షానికి అవకాశం చిక్కింది. అయితే క్షతగాత్రగా మారిన మణిపుర్‌కు ఏమాత్రం సాంత్వన చేకూర్చామన్నది ఇరుపక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సేవుంది.
ఇది గతంలో అనేకమార్లు సభలో చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానాలవంటిది కాదు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి దాగుందంటూ 2018లో విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాసంతో కూడా దీన్ని పోల్చలేం. ఇది యావత్తు సమాజమూ సిగ్గుతో తలదించు కోవాల్సిన దురదృష్టకర ఉదంతాల పర్యవసానంగా చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానం.
మణిపుర్‌లో దాదాపు అంతర్యుద్ధ పరిస్థితులేర్పడటం, పరస్పరం భౌతిక దాడులు చేసుకోవటం, నివాసాలు తగలబెట్టుకోవటంతో మొదలై... చివరకు మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టే హీన స్థితికి చేరు కోవటం చరిత్రలో కనీవినీ ఎరుగనిది. ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి ప్రజలు చెట్టుకొకరూ, పుట్టకొకరూ కావటం, అలా వెళ్లలేనివారిని సాయుధ మూకలు చిత్రవధ చేయటం, పోలీసులే తమ కస్టడీలో ఉన్న మహిళలను సాయుధ గుంపులకు అప్పగించాన్న ఆరోపణలు రావటం మామూలు విషయం కాదు.
ఈ హింసాపర్వం మొదలై మూడు నెలలు దాటుతున్నా ఇప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులు నెల కొనకపోవటం, పోలీసులూ, కేంద్ర బలగమైన అస్సాం రైఫిల్స్ పరస్పరం నిందారోపణలు చేసు కోవటం దిగ్భ్రాంతికరం. ఆఖరికి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని జవాబిస్తున్న సమయంలో కూడా మే 3 నాటి మరో దారుణ ఉదంతం వెలుగులోకొచ్చింది.
ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె ఇంటిని తగులబెట్టారన్నది ఆ ఉదంతం సారాంశం. ఇప్పటికీ స్వస్థలాలకు వెళ్లే సాహసం చేయలేనివారు వేలాదిమందివుంటే, వెళ్లినవారు భయాందోళనల్లో మునిగి తేలు తున్నారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను సంజాయిషీ ఇచ్చుకునేలా చేయటంలో అవి శ్వాస తీర్మానం బ్రహ్మాస్త్రం వంటిది. అందునా రాక్షసమూకల కొమ్ముకాసిందన్న ఆరోపణలెదుర్కొంటున్న మణిపూర్ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవటంలో తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టడానికి దీనికి మించిన ఆయుధం లేదు. మూడురోజులపాటు ఇరుపక్షాల నేతలూ ప్రసంగించారు.
అయితే ఆ వాగ్ధాటి హోరులో మణిపుర్ విషాదం మరుగున పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రధాన అంశాన్ని మరిచి సవాళ్లూ, ప్రతిసవాళ్లూ, అర్థరహితమైన ఆరోపణలూ విసురు కుంటూ రెండు పక్షాలూ కాలక్షేపం చేశాయి. వర్తమాన దుఃస్థితికి గతంలో పాలించిన కాంగ్రెసే కారణమని అధికారపక్షం అంటే... కేంద్ర బలగాలను ఉద్దేశపూర్వకంగానే వినియోగించుకోలేదనీ, అందువల్లే ఇంతటి హింస చెలరేగిందనీ విపక్షాలు ఆరోపించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపుర్ గురించి సవివరమైన ప్రకటనే చేశారు.
అమిత్ షాయే మాట్లాడతారని మొదటినుంచీ అధి కారపక్షం చెబుతోంది. కాదు, ప్రధానే మాట్లాడాలన్నది విపక్షం డిమాండ్. ప్రధాని సుదీర్ఘ ప్రసంగంలో మణిపుర్ ప్రస్తావన వచ్చింది. దుండగులపై చర్య తీసుకుంటామని, శాంతి నెలకొల్పుతా మన్న హామీ కూడా ఇచ్చారు. ఈశాన్యానికి తమ హృదయంలో కీలక స్థానమున్నదని చెప్పారు. మణి పుర్ మహిళలతో భుజం భుజం కలిపి నడుస్తామన్నారు. కానీ ఇది మాత్రమే సరిపోతుందా?
అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మణిపుర్ ప్రజానీకానికి ఈ సభావేదిక నుంచి సహానుభూతి ప్రకటిస్తూ, ఈ ఉదంతాలు పునరావృతం కానీయబోమనీ, దోషులను కఠినంగా దండిస్తామనీ వాగ్దానం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించివుంటే దాని ప్రభావం వేరుగా ఉండేది. వారి పునరా వాసానికి అవసరమైన పథకాలు ప్రకటిస్తే బాగుండేది. అధికార పక్షం వీటిని విస్మరించిందనుకున్నా ప్రతిపక్షం మాత్రం చేసిందేమిటి? ప్రధాని ప్రసంగం పూర్తిగా వినకుండానే వాకౌట్ చేసింది.
అధికార పక్షానికి తిరుగులేని మెజారిటీ ఉన్న సభలో అవిశ్వాసం చివరికేమవుతుందో అందరికీ తెలుసు. అయినా ఆ సందర్భంగా జరిగే చర్చలను ప్రజానీకం ఆసక్తిగా గమనిస్తుంది. విపక్షం ఏయే అంశాలపై అధికారపక్షాన్ని నిలదీస్తున్నదో, వాటికి అధికారపక్షం ఏం చెబుతున్నదో తెలుసుకోవ టమే ఆ ఆసక్తిలోని ఆంతర్యం. ఆ సందర్భంగా ఎవరి మంచిచెడ్డలేమిటో బేరీజు వేసుకుంటారు.
ముఖ్యంగా మణిపుర్ ప్రజలూ, ఈశాన్య రాష్ట్రాల ప్రజానీకం తమకు జరగబోయే న్యాయం గురించి ఆలోచిస్తారు. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికలు, అందులో గెలుపోటములే చర్చల్లో ప్రధానంగా వినబడ్డాయి. ఇది సరైందేనా? మణిపుర్ విషాదంపై సుప్రీంకోర్టు ఇప్పటికే చొరవ తీసుకుని లైంగిక హింసపై సాగే సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించింది.
పునరావాసం, పరిహారం, ఆవాసాల, ప్రార్థనామందిరాల పునర్నిర్మాణం తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు రిటైర్డ్ మహిళా న్యాయమూర్తులతో కమిటీ ఏర్పరిచింది. తనవంతుగా చేయబోయేదేమిటో కేంద్రం ప్రకటిస్తే ఈ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు అర్థవంతమైన ముగింపు ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment