
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద సాయుధ దళం ‘ఆర్మీ’పోరాట విభాగంలోనూ మహిళలను చేర్చుకోవాలని నిర్ణయించింది. ముందుగా ఆర్టిలరీ (శతఘ్ని)దళాల్లో మహిళా అధికారులను చేర్చుకునేందుకు ఉద్దేశించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని భావిస్తున్నామన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే బోఫోర్స్ హౌవిట్జర్, కె–9 వజ్ర, ధనుష్ వంటి తుపాకులను ఇకపై మహిళలు కూడా ఉపయోగించగలుగుతారు. వీరు ఆర్టిలరీ పోరాట సహాయక విభాగంలో ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
పదాతి దళం తర్వాత రెండో అతిపెద్ద రెజిమెంట్ శతఘ్ని దళమే. నిర్ణాయక విభాగంగా భావించే కీలకమైన ఈ దళంలో మిస్సైళ్లు, మోర్టార్లు, రాకెట్ లాంఛర్లు, డ్రోన్లు మొదలైనవి ఉంటాయి. పదాతి దళం, శతఘ్ని, మెకనైజ్డ్ శతఘ్ని రెజిమెంట్లలో ఇప్పటి వరకు మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్లు లేవు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్మీ మార్పులు తెచ్చింది. మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2022లో ఖడక్‌వాస్లాలోని డిఫెన్స్ అకాడమీలోకి 19 మంది మహిళా కేడెట్లతో మొదటి బ్యాచ్‌కు మూడేళ్ల శిక్షణ ప్రారంభించింది. అయితే, ఇన్‌ఫాంట్రీ, ఆర్మర్డ్ రెడ్ కార్ప్స్, మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీల్లోకి మహిళా అధికారులను చేర్చుకోవాలన్న ప్రణాళికలేవీ లేవని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment