సాక్షి,న్యూఢిల్లీ: భారత ఆర్మీలో మహిళా అధికారుల పాత్రను పెంచేందుకు సైన్యం కసరత్తు చేస్తున్న క్రమంలో సైబర్ వారియర్లుగా మహిళా అధికారులను నియమించాలని యోచిస్తున్నారు.ఈ ప్రతిపాదనపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సీనియర్ కమాండర్లతో ఇప్పటికే చర్చించారు. మహిళా అధికారుల సేవలను చురుకుగా ఉపయోగించుకోవాలని సైన్యం భావిస్తుండటంతో మహిళా సైబర్ అధికారుల నియామక ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. దేశీయ, విదేశీ శక్తుల నుంచి సైబర్ ముప్పు పొంచిఉండటంతో ఈ విభాగంలో దీటైన సైబర్ అధికారులను రిక్రూట్ చేయాలని ఇండియన్ ఆర్మీ యోచిస్తోందని సైనిక వర్గాలు వెల్లడించాయి. సైనిక దళాల నెట్‌వర్క్స్, కంప్యూటర్లు చైనా, పాక్ వంటి ప్రత్యర్థుల నుంచి నిరంతర ముప్పు ఎదుర్కొనే క్రమంలో సైబర్ వార్‌ఫేర్ ఆర్మీకి సవాల్‌గా మారింది. కీలక బాధ్యతలను సైబర్ ఆఫీసర్లకు అప్పగించేందుకు ఈ విభాగంలో మహిళా అధికారుల సేవలు వినియోగించుకోవాలని ఆర్మీ నిర్ణయించింది.
ఏ రంగంలో మహిళలు తమ సత్తా చాటగలరో ఆయా విభాగాల్లో వీలైనంత మేర మహిళా అధికారులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నదే ఆర్మీ ఉద్దేశమని సైనిక వర్గాలు తెలిపాయి. మరోవైపు మహిళలను జవాన్లుగా రిక్రూట్ చేసుకునేందుకూ ఆర్మీ సంసిద్ధమైంది. ముఖ్యంగా మహిళలు పాల్గొనే ఆందోళనలు, రాళ్ల దాడుల వంటి సందర్భాల్లో అల్లరి మూకలను నియంత్రించే క్రమంలో మహిళా జవాన్ల సేవలు ఉపయోగించుకోవాలని ఆర్మీ భావిస్తోంది.
ఇందులో భాగంగా మిలటరీ పోలీస్ బ్రాంచ్‌లో 850 మంది మహిళా జవాన్లను రిక్రూట్ చేసుకోనున్నారు. ముందుముందు మహిళా జవాన్లు, అధికారుల సంఖ్యను క్రమంగా పెంచాలని ఆర్మీ యోచిస్తోంది. ప్రస్తుతం జర్మనీ, ఆస్ర్టేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్ వంటి కొన్ని దేశాలే యుద్ధ రంగంలో మహిళలను అనుమతిస్తున్నాయి. ఇక భారత వాయుసేన ఇటీవల ముగ్గురు మహిళా అధికారులను యుద్ధ విమాన పైలట్లుగా నియమించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment