
తిరువనంతపురం : కనీవినీ ఎరుగని వరదలతో భీతిల్లిన కేరళలో రెండు వారాలుగా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో అధికారులు తీరిక లేకుండా తలమునకలయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం, సహాయ పునరావాస శిబిరాలకు తరలించడం, నిత్యావసరాల సరఫరా వంటి కీలక బాధ్యతలను ఎన్నో సవాళ్ల మధ్య చాకచక్యంగా చేపట్టిన ఇద్దరు మహిళా జిల్లా కలెక్టర్‌ల సేవలను పలువురు ప్రస్తుతిస్తున్నారు. సంక్షోభ సమయంలో త్రిసూర్ జిల్లా కలెక్టర్ ఇన్‌చార్జ్ టీవీ అనుపమ, తిరువనంతపురం జిల్లా కలెక్టర్ ఇన్‌చార్జ్ కే వాసుకిల చొరవకు సోషల్ మీడియాలో నెటిజన్లు కితాబిస్తున్నారు.
డేరింగ్ ఆఫీసర్ అనుపమ..
అలప్పుజ జిల్లాలో కలెక్టర్ ఇన్‌చార్జ్‌గా గడతంలో పనిచేసిన అనుపమ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడరనే పేరుంది. గతంలో రవాణా శాఖ మాజీ మంత్రి థామస్ చాందీ భూ ఆక్రమణపై ఆమె చేపట్టిన నిజనిర్ధారణ నివేదిక ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పలుకుబడి కలిగిన రాజకీయ నేతలు, లాబీయింగ్ గ్రూపులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాలకు ప్రజల్లో అనూహ్యమైన మద్దతు లభించింది.
త్రిసూర్ కలెక్టర్‌గా ఈ ఏడాది జూన్‌లో బాధ్యతలు చేపట్టిన అనుపమకు విధులు చేపట్టగానే వరద రూపంలో తొలి సవాల్ ఎదురైంది. సహాయ శిబిరాలకు నిత్యావసరాల సరఫరా కోసం బార్ అసోసియేషన్‌తో ఆమె పోరాడిన తీరు ప్రశంసలు అందుకున్నారు. జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినా తమ ప్రాంగణంలో వరద సాయం కోసం అందించే నిత్యావసరాలు నిల్వ చేసేందుకు బార్ అసోసియేషన్ నిరాకరించింది. దీంతో అనుపమ ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు బార్ అసోసియేషన్ తాళాలను బద్దలు కొట్టి నిత్యావసరాలను నిల్వ చేసేలా చొరవ చూపారు.
స్ఫూర్తి నింపిన వాసుకి..
ఇక వరదల్లో ఎర్నాకుళం, అలప్పుజ, ఇడుక్కి, వయనాడ్ జిల్లాల మాదిరిగా తిరువనంతపురం జిల్లాకు పెద్దగా వరద ముప్పు లేకున్నా కలెక్టర్ ఇన్‌చార్జ్ కే వాసుకి పరిస్థితిని ఎదుర్కొన్న తీరు ప్రశంసలు కురిపిస్తోంది. నిత్యావసరాలు, సహాయ సామాగ్రిని ఆమె పర్యవేక్షణలో సిబ్బంది 54 ట్రక్కుల లోడ్ మెటీరియల్‌ను కేవలం రెండు రోజుల్లోనే సమీకరించి ఇతర ప్రాంతాలకు తరలించారు. సహాయ, పునరావాస శిబిరాల్లో మైక్రోఫోన్‌ను చేతపట్టిన వాసుకి అధికారులు, వాలంటీర్లను పరుగులు పెట్టించి అందరిలో స్ఫూర్తి నింపారు. సైనికుల తరహాలో మీరు ఈ ఆపద సమయంలో పనిచేస్తున్నారని వాలంటీర్లను ప్రోత్సహించారు.
Comments
Please login to add a commentAdd a comment