నారీ.. సైన్యాధికారి  | Women Officers Should Be Appointed In Command Postings Says Supreme Court | Sakshi
Sakshi News home page

నారీ.. సైన్యాధికారి 

Published Tue, Feb 18 2020 2:19 AM | Last Updated on Tue, Feb 18 2020 5:20 AM

Women Officers Should Be Appointed In Command Postings Says Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: కమాండ్‌ రోల్స్‌లో మహిళా సైనికాధికారుల నియమించే విషయంలో కొనసాగుతోన్న వివక్షకు చెల్లుచీటీ ఇస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. శారీరక పరిమితులు, సామాజిక కట్టుబాట్ల పేరుతో సైనిక పటాలాల కమాండింగ్‌ బాధ్యతల్లో మహిళా అధికారులను నియమించకపోవడం తగదని స్పష్టం చేసింది. భారత సైన్యంలో పనిచేస్తోన్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది.

అందులో భాగంగానే షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)లోని మహిళా సైనికాధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్‌(పర్మనెంట్‌ కమిషన్‌–పీసీ) ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. గతంలో ఎందరో మహిళాఅధికారులు దేశానికి అత్యున్నత పురస్కారాలను తెచ్చిపెట్టిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేస్తూ సాయుధ దళాలలో లింగపరమైన వివక్షకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు తమ ఆలోచనావిధానాలను మార్చుకోవాల్సి ఉంటుందని హితవు పలికింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో.. కమాండ్‌ పోస్టింగ్స్‌తో పాటు పురుష అధికారులతో సమానంగా పదోన్నతులు, ర్యాంక్స్, పెన్షన్సు, ఇతర ప్రయోజనాలు  దక్కనున్నాయి.

2010 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సమర్థన 
రక్షణ రంగంలో ఎన్నేళ్ళ సర్వీసు ఉన్నదనే విషయంతో సంబంధం లేకుండా పురుష సైనికుల మాదిరిగానే మహిళా సైనికులకు వృత్తిపరమైన ఎంపిక కోసం శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. మహిళా సైనికుల విషయంలో వివక్ష తగదంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును  సమర్థించింది. పదేళ్లుగా ఈ ఆదేశం అమలుపై కేంద్రం శ్రద్ధ చూపలేదని తప్పు పట్టింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.

ఆ పరిమితులు అడ్డు కాదు 
సైన్యంలో ఉన్నత పదవులను నిర్వర్తించడంలో మహిళలకు వారి సహజ శారీరక పరిమితులూ, సామాజిక కట్టుబాట్లు అడ్డుగా ఉన్నాయన్న కేంద్రం వివరణను కోర్టు తోసిపుచ్చింది.  ‘మాతృత్వం, పిల్లల పోషణ లాంటి సవాళ్ళు’ కూడా ఉన్నాయన్న కేంద్రం వివరణను కోర్టు తప్పు పట్టింది. మహిళల శారీరక పరిమితులు వారి విధి నిర్వహణకు ఏ విధంగానూ అడ్డురావని కోర్టు స్పష్టం చేసింది.

కేవలం 4 శాతమే 
మహిళా అధికారులకు పర్మనెంట్‌ కమిషన్‌ ఏర్పాటును, కమాండ్‌ పోస్టింగ్స్‌ను నిరాకరించడం ఆందోళనకరమని, ఇది సమానత్వ భావనకు వ్యతిరేకమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఆర్మీలో ఉన్న మొత్తం కమిషన్డ్‌ అధికారుల్లో మహిళా అధికారుల సంఖ్య కేవలం 1,653 అని, అది 4% కన్నా తక్కువేనని గుర్తు చేసింది. ‘లింగపరమైన వివక్షతో వారి సామర్థ్యాన్ని తక్కువచేయడం మహిళలుగా వారిని మాత్రమే కాదు.. మొత్తం భారతీయ సైన్యాన్ని అవమానించడమే’ అని పేర్కొంది. ‘ఎస్‌ఎస్‌సీలో ఉన్న మహిళాఅధికారులందరికీ శాశ్వత కమిషన్‌ను అనువర్తింపచేయాలి. 14 ఏళ్ల పైబడిన సర్వీస్‌ ఉన్నమహిళా అధికారులు పీసీలో చేరేందుకు ఇష్టపడనట్లయితే.. పెన్షన్‌ అర్హతకు అవసరమైన 20 ఏళ్ల సర్వీస్‌ పూర్తయేంతవరకు విధుల్లో కొనసాగించాలి’ అని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.  కమాండ్‌ పోస్టింగ్స్‌ను ఇవ్వడంలో అడ్డంకులు కల్పించరాదని స్పష్టం చేసింది. యుద్ధ విధుల్లో మహిళా అధికారుల సేవలను వినియోగించుకోవడం విధానపర నిర్ణయమని ధర్మాసనం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement