
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలని, మహిళా అధికారులు కమాండ్ పోస్టింగ్‌కూ అర్హులని సర్వోన్నత న్యాయస్ధానం సోమవారం చారిత్రక తీర్పు వెలువరించింది. సర్వీసులో ఎంతకాలం ఉన్నారనే దానితో సంబంధం లేకుండా మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ హోదా వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఆర్మీలో మహిళా అధికారులందరికీ మూడునెలల్లోగా శాశ్వత కమిషన్ హోదాను మంజూరు చేయాలని ఆదేశించింది.
పురుషుల మాదిరే మహిళా అధికారుల నియామక నిబంధనలు ఒకేలా ఉండాలని తేల్చిచెప్పింది. శారీరక లక్షణాలను కారణంగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్ హోదా నిరాకరించడాన్ని కోర్టు తప్పుపడుతూ లింగ అసమానత్వపు ధోరణిని కేంద్రం విడనాడాలని హితవు పలికింది. మహిళల శారీరక లక్షణాలతో వారి సామర్ధ్యాన్ని అంచనావేయడం మహిళలకు, సైన్యానికీ అవమానకరమని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా అధికారులను కమాండ్ పోస్టులకు నిరాకరించడం పక్షపాతపూరిత నిర్ణయమని, సమానత్వ హక్కుకు విరుద్ధమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment