ఇద్దరు నావికాదళ మహిళా అధికారుల సాహస యాత్ర
భారత నౌకా దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు జలమార్గాన ప్రపంచాన్ని చుట్టబోతున్నారు. లెఫ్టినెంట్ కమాండర్లు ఎ.రూప, కె.దిల్నా అతి త్వరలో ఈ సాహసానికి పూనుకోనున్నట్టు నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ ఆదివారం వెల్లడించారు. నావికా దళానికి చెందిన ఐఎన్‌ఎస్వీ తరిణి నౌకలో వారు ప్రపంచాన్ని చుట్టి రానున్నట్టు తెలిపారు. వారిద్దరూ మూడేళ్లుగా ‘సాగర్ పరిక్రమ’ యాత్ర చేస్తున్నారు.
‘‘సాగర్ పరిక్రమ అత్యుత్తమ నైపుణ్య, శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత అవసరమయ్యే అతి కఠిన ప్రయాణం. అందులో భాగంగా వారు కఠోర శిక్షణ పొందారు. వేల మైళ్ల ప్రయాణ అనుభవమూ సంపాదించారు’’ అని మాధ్వాల్ వెల్లడించారు. ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’ విజేత కమాండర్ (రిటైర్డ్) అభిలాష్ టోమీ మార్గదర్శకత్వంలో వారిద్దరూ శిక్షణ పొందుతున్నారు.
గతేడాది ఆరుగురు సభ్యుల బృందంలో భాగంగా గోవా నుంచి కేప్‌టౌన్ మీదుగా బ్రెజిల్‌లోని రియో డిజనీరో దాకా వాళ్లు సముద్ర యాత్ర చేశారు. తర్వాత గోవా నుంచి పోర్ట్‌బ్లెయిర్ దాకా సెయిలింగ్ చేపట్టి తిరిగి డబుల్ హ్యాండ్ పద్ధతిలో బయలుదేరారు. ఈ ఏడాది ఆరంభంలో గోవా నుంచి మారిషస్‌లోని పోర్ట్ లూయిస్ దాకా డ్యూయల్ హ్యాండ్ విధానంలో విజయవంతంగా సార్టీ నిర్వహించారు.
నౌకాయాన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి భారత నావికాదళం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని, సముద్ర వారసత్వాన్ని పరిరక్షించడానికి ఇలాంటి యాత్రలను ప్రోత్సహిస్తోందని మాధ్వాల్ తెలిపారు. ఐఎన్‌ఎస్–తరంగిణి, ఐఎన్‌ఎస్–సుదర్శిని, ఐఎన్‌ఎస్‌వీ–మహదీ, తరిణి నౌకల్లో సముద్రయానం ద్వారా భారత నావికాదళం సాహసయాత్రలకు కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. 2017లో జరిగిన చరిత్రాత్మక తొలి ‘నావికా సాగర్ పరిక్రమ’లో భాగంగా మన మహిళా అధికారుల బృందం ప్రపంచాన్ని చుట్టొచి్చంది ఐఎన్‌ఎస్వీ తరిణిలోనే! 254 రోజుల ఆ సముద్రయానంలో బృందం ఏకంగా 21,600 మైళ్లు ప్రయాణించింది.
– న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment