waterways
-
జలమార్గాన ప్రపంచయానం
భారత నౌకా దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు జలమార్గాన ప్రపంచాన్ని చుట్టబోతున్నారు. లెఫ్టినెంట్ కమాండర్లు ఎ.రూప, కె.దిల్నా అతి త్వరలో ఈ సాహసానికి పూనుకోనున్నట్టు నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ ఆదివారం వెల్లడించారు. నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో వారు ప్రపంచాన్ని చుట్టి రానున్నట్టు తెలిపారు. వారిద్దరూ మూడేళ్లుగా ‘సాగర్ పరిక్రమ’ యాత్ర చేస్తున్నారు. ‘‘సాగర్ పరిక్రమ అత్యుత్తమ నైపుణ్య, శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత అవసరమయ్యే అతి కఠిన ప్రయాణం. అందులో భాగంగా వారు కఠోర శిక్షణ పొందారు. వేల మైళ్ల ప్రయాణ అనుభవమూ సంపాదించారు’’ అని మాధ్వాల్ వెల్లడించారు. ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’ విజేత కమాండర్ (రిటైర్డ్) అభిలాష్ టోమీ మార్గదర్శకత్వంలో వారిద్దరూ శిక్షణ పొందుతున్నారు. గతేడాది ఆరుగురు సభ్యుల బృందంలో భాగంగా గోవా నుంచి కేప్‌టౌన్ మీదుగా బ్రెజిల్‌లోని రియో డిజనీరో దాకా వాళ్లు సముద్ర యాత్ర చేశారు. తర్వాత గోవా నుంచి పోర్ట్‌బ్లెయిర్ దాకా సెయిలింగ్ చేపట్టి తిరిగి డబుల్ హ్యాండ్ పద్ధతిలో బయలుదేరారు. ఈ ఏడాది ఆరంభంలో గోవా నుంచి మారిషస్‌లోని పోర్ట్ లూయిస్ దాకా డ్యూయల్ హ్యాండ్ విధానంలో విజయవంతంగా సార్టీ నిర్వహించారు. నౌకాయాన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి భారత నావికాదళం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని, సముద్ర వారసత్వాన్ని పరిరక్షించడానికి ఇలాంటి యాత్రలను ప్రోత్సహిస్తోందని మాధ్వాల్ తెలిపారు. ఐఎన్ఎస్–తరంగిణి, ఐఎన్ఎస్–సుదర్శిని, ఐఎన్ఎస్వీ–మహదీ, తరిణి నౌకల్లో సముద్రయానం ద్వారా భారత నావికాదళం సాహసయాత్రలకు కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. 2017లో జరిగిన చరిత్రాత్మక తొలి ‘నావికా సాగర్ పరిక్రమ’లో భాగంగా మన మహిళా అధికారుల బృందం ప్రపంచాన్ని చుట్టొచి్చంది ఐఎన్ఎస్వీ తరిణిలోనే! 254 రోజుల ఆ సముద్రయానంలో బృందం ఏకంగా 21,600 మైళ్లు ప్రయాణించింది. – న్యూఢిల్లీ -
ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. వీటితో 113 ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. ఇందులో ఇప్పటివరకు 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. విశాఖ పోర్టు ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విశాఖ పోర్టును సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నామని, ఆధునికీకరణ, యాంత్రీకరణతో మెరుగు పరుస్తున్నామని వివరించారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. -
దేశంలో మూడో స్వచ్ఛ నౌకాశ్రయంగా విశాఖ పోర్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్ట్ ట్రస్ట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే మూడో స్వచ్ఛ నౌకాశ్రయంగా అవార్డును దక్కించుకుంది. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా 2019 సంవత్సరానికి సంబందించి ఈ అవార్డును కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో అన్ని విభాగాలు, శాఖల్లో స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పోర్టు లోపలే కాకుండా పరిసర ప్రాంతాల్లోను, జ్ఞానాపురంలో కూడా పరిశుభ్రత కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించింది. సాలిగ్రామపురం, జాలారిపేట, బీచ్ రోడ్డులలో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పరిశుభ్రతపై పోటీలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా మేజర్ పోర్టులు నిర్వహించిన ఈ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్‌కు 3వ క్లీనెస్ట్ పోర్ట్‌గా కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ గుర్తిస్తూ అవార్డును ప్రకటించింది. దీనిపై విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె.రామమోహనరావు పోర్టు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. -
అనువైనది లేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జలరవాణాకు ద్వారాలు మూసుకున్నట్లే! రోడ్డు, రైలు మార్గాల రద్దీ, పర్యావరణ సమతుల్యత దృష్ట్యా జలరవాణాకు పెద్దపీట వేయాలని కేంద్రం భావిస్తుండగా, రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు. బీమా, తుంగభద్ర, మంజీరా, కృష్ణాల్లో జల రవా ణాకు అనువైన పరిస్థితులు లేవని, గోదావరిలో కొంత అనుకూలత ఉందని ఇరిగేషన్ శాఖ జాతీయ అంతర్గత జలరవాణా సంస్థకి నివేదిక అందించింది. అధ్యయన వివరాలు.. జలరవాణా చౌక దేశ వ్యాప్తంగా 101 నదుల్ని జలమార్గాలుగా మార్చాలని కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. నదులను రవాణా మార్గాలుగా మార్చడం వల్ల సాధారణ ప్రజల ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుందని, రోడ్డు, రైలు రవాణాతో పోల్చుకుంటే నీటి రవాణా ఎంతో తక్కువ ఖర్చుతో కూడుకున్నదని కేంద్రం చెబుతోంది. కిలో మీటరు దూరానికి నీటి రవాణా ఖర్చు 30పైసలే కాగా, రైల్వే రూపాయి, రోడ్డు రవాణా రూ.1.50 పైసలు ఖర్చు అవుతుంది. మంజీరా నదిపై... మంజీరాపై సింగూర్ నుంచి కందకుర్తి వరకు 245 కి.మీ. జలమార్గంలో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండదు. నీటి లభ్యత ఉన్న సమయాల్లోనూ ఎప్పటికప్పుడు సాగు, తాగు అవసరాలకు మళ్లిస్తున్నందున రవాణాకు కావాల్సిన మట్టం ఉండదు. పుట్టీల ద్వారా స్థానిక రవాణా చేసే అవకాశం మాత్రమే ఉంది. వెయిన్‌గంగ–ప్రాణహిత మార్గంలో... వెయిన్‌గంగ–ప్రాణహిత మార్గంలోనూ జలమార్గాల అభివృద్ధికి అవసరమైన భౌగోళిక పరిస్థితులు లేవు. ఏడింటికి ప్రతిపాదనలు తెలంగాణలో ఏడు జాతీయ మార్గాలను కేంద్రం ప్రతిపాదించింది. ఇక్కడి జల రవాణా సాధ్యాసాధ్యాలు, హైడ్రోగ్రాఫిక్ అధ్యయనాలు, సాంకేతిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఐడబ్ల్యూఏఐ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. పెనుగంగ–వార్థా మార్గంలో పెనుగంగ–వార్థా మార్గంలో వేసవిలో తగినంత నీటి లభ్యత ఉండదు. అవసరమైన నీటిమట్టాలను నిర్వహించాలంటే నేవిగేషన్ లాక్స్, బ్యారేజీని నిర్మించాల్సి ఉంటుంది. ఈ పరీవాహకంలోని పరిశ్రమల అవసరాలు, ప్రజా రవాణాకు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో రోడ్డు, రైల్ మార్గాలు అనువుగా ఉన్నందున ఇక్కడ జలరవాణా అవసరం లేదు. భీమా, తుంగభద్ర, కృష్ణాలో.. భీమా, తుంగభద్ర నదీపరీవాహకంలో ఎక్కడా పట్టణాలు లేనందున అక్కడ ఈ మార్గాలు చేపట్టాల్సిన అవసరం లేదు. కృష్ణానదిపై వజీరాబాద్ నుంచి కర్ణాటకలోని గలగాలి ప్రాంతం వరకు ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండదు. రాజమండ్రి–భద్రాచలం–నాసిక్‌పైనే ఆశలన్నీ.. గోదావరిపై భద్రాచలం నుంచి ఏపీలోని రాజమండ్రి మీదుగా కాకినాడ తీరం వరకు ఒక మార్గాన్ని గతంలో ప్రతిపాదించగా, తెలంగాణలో గోదావరి పరీవాహక జిల్లాలైన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌కు ప్రయోజనం లేదని తెలంగాణ ప్రభుత్వం అప్పటి కేంద్ర నౌకాయాన మంత్రి గడ్కరీ దృష్టికి తెచ్చింది. దీంతో భద్రాచలం–మహారాష్ట్రలోని నాసిక్ మార్గాన్ని అధ్యయనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై ప్రస్తుతం అధ్యయనం సాగుతోంది. -
రోడ్డు మీద రూపాయిన్నర.. రైల్లో రూపాయి.. నీళ్లలో 30 పైసలు
న్యూఢిల్లీ: 'సరుకు ఏదైనా కానివ్వండి.. దాని రవాణాకు అయ్యే ఖర్చుమాత్రం ఇంతే.. ఒక కిలోమీటరుకు రోడ్డు మార్గంలో రూపాయిన్నర. అదే గూడ్స్ రైలు వ్యాగనయితే రూపాయి. అయితే జలరవాణాను ఆశ్రయిస్తేమాత్రం ఆ ఖర్చు కిలోమీటరుకు 30 పైసలు కూడా దాటదు. అంతెందుకు చైనాలో సరుకు రవాణా 47 శాతం జలమార్గంలో జరిగేవే. యూరోపియన్ యూనియన్ లోనైతే అది 40 శాతంగా ఉంది. అదే ఇండియాలో జలరవాణా కేవలం 3.3 శాతం మాత్రమే. అందుకే జలరవాణాను విస్తృతం చేయాలనుకుంటున్నాం' అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన జలరవాణా వ్యాప్తికి చేపట్టబోతోన్న చర్యలను వివరించారు. దేశంలోని 101 నదులను జలమార్గాలుగా మార్చబోతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీనికి సంబంధించిన బిల్లును జులై 21 నుంచి ప్రారంభంకానున్న వర్షాకాల సమావేశాల్లోనే సభలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. -
ప్రైవేటుకు జలమార్గాలపై పార్లమెంటరీ కమిటీ నో
న్యూఢిల్లీ: లాభదాయకమైన జాతీయ జలమార్గాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలన్న నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పార్లమెంటరీ స్థాయీ సంఘం వ్యతిరేకించింది. నాలుగు, ఐదో జాతీయ జలమార్గాలను పీపీపీ పద్ధతిలో అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఈ మేరకు రవాణా, పర్యాటకం, సాంస్కృతిక అంశాలపై నియమితమైన పార్లమెంటరీ సంఘం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. లాభదాయకమైన మార్గాలనే ప్రైవేటుకు అప్పగించాలన్న ఈ ప్రతిపాదనను సీతారాం ఏచూరి నేతృత్వంలోని కమిటీ ప్రశ్నించింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిని కలుపుతూ గోదావరి, కృష్ణా నదులతోకూడిన మార్గాన్ని నాలు గో జాతీయ జలమార్గంగా, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ను కలుపుతూ ఉన్న మార్గా న్ని ఐదో జాతీయ జలమార్గంగా 2008లో ప్రకటించగా.. ఇంకా రవాణా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు.