రోడ్డు మీద రూపాయిన్నర.. రైల్లో రూపాయి.. నీళ్లలో 30 పైసలు
న్యూఢిల్లీ: 'సరుకు ఏదైనా కానివ్వండి.. దాని రవాణాకు అయ్యే ఖర్చుమాత్రం ఇంతే.. ఒక కిలోమీటరుకు రోడ్డు మార్గంలో రూపాయిన్నర. అదే గూడ్స్ రైలు వ్యాగనయితే రూపాయి. అయితే జలరవాణాను ఆశ్రయిస్తేమాత్రం ఆ ఖర్చు కిలోమీటరుకు 30 పైసలు కూడా దాటదు. అంతెందుకు చైనాలో సరుకు రవాణా 47 శాతం జలమార్గంలో జరిగేవే. యూరోపియన్ యూనియన్ లోనైతే అది 40 శాతంగా ఉంది. అదే ఇండియాలో జలరవాణా కేవలం 3.3 శాతం మాత్రమే. అందుకే జలరవాణాను విస్తృతం చేయాలనుకుంటున్నాం' అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ పేర్కొన్నారు.
ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన జలరవాణా వ్యాప్తికి చేపట్టబోతోన్న చర్యలను వివరించారు. దేశంలోని 101 నదులను జలమార్గాలుగా మార్చబోతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీనికి సంబంధించిన బిల్లును జులై 21 నుంచి ప్రారంభంకానున్న వర్షాకాల సమావేశాల్లోనే సభలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.