స్త్రీలకు శాశ్వత కమిషన్: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | SC Unhappy With Army Process of Granting Women Permanent Commission | Sakshi
Sakshi News home page

స్త్రీలకు శాశ్వత కమిషన్: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Published Thu, Mar 25 2021 12:52 PM | Last Updated on Thu, Mar 25 2021 3:27 PM

SC Unhappy With Army Process of Granting Women Permanent Commission - Sakshi

ప్రతీకాత్మక చిత్రం (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది సుప్రీంకోర్టు తీర్పు మేరకు రక్షణ శాఖ మహిళలకు ఆర్మీలో శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేసే ఆర్మీ ప్రక్రియపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ పొందడానికి నిర్దేశించిన మెడికల్‌ ఫిట్‌నెస్‌ పద్దతి అనేది ఏకపక్షంగా.. అహేతుకంగా, వివక్షాపూరితంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సైన్యంలో శాశ్వత కమిషన్ కోసం సుమారు 80 మంది మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

"మన సమాజ నిర్మాణం మగవారి కోసం.. మగవారిచే సృష్టించబడిందని ఇక్కడ మనం గుర్తించాలి" అని కోర్టు అభిప్రాయపడింది. సైన్యం సెలెక్టివ్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఎస్‌సీఏఆర్) మూల్యాంకనం ఆలస్యం చేయడం, మెడికల్ ఫిట్‌నెస్ క్రైటిరియాను అమలు చేయడం అనేది మహిళా అధికారులపై వివక్ష చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. "ఎస్ఎస్‌సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) మూల్యాంకనం విధానం మహిళా అధికారులకు ఆర్థిక, మానసిక హాని కలిగిస్తుంది" అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఏర్పాటైన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. 

ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. "కోర్టు ముందుకు వచ్చిన అనేక మంది మహిళా అధికారులు అనేక అవార్డులు గెలుచుకున్నారు. చాలామంది విదేశీ కార్యకలపాల అంశంలో బాగా పనిచేశారు" అన్నారు. ‘‘క్రీడా పోటీలలో రాణించిన వారిని విస్మరించినట్లు మేం గుర్తించాం, మహిళలు సాధించిన విజయాల వివరణాత్మక లిస్టు తీర్పులో ఇవ్వబడింది ... దీన్ని బట్టి చూస్తే ఈ బోర్డు ఎంపిక కోసం కాకుండా తిరస్కరణ కోసం పని చేసినట్లు కనిపిస్తోంది’’ అని చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత మిలిటరీకి సంబంధించి గతేడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు శాశ్వత కమిషన్ని ఏర్పాటు చేసి సైన్యంలోని మహిళా అధికారులకు పురుష అధికారులతో సమానంగా కమాండ్ స్థానాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. మహిళల సర్వీసుతో సంబంధం లేకుండా శాశ్వత కమిషన్ అందరికీ అందుబాటులో ఉండాలని కోర్టు తెలిపింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం చేసిన వాదనలు "వివక్షత", "కలతపెట్టేవి"గా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.

ఇప్పటికే భారత వైమానిక దళం, భారత నావికాదళం మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ని మంజూరు చేసింది. దీని ప్రకారం ఐఏఎఫ్‌ మహిళలను ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీలలో అధికారులుగా అనుమతిస్తుంది. మహిళా ఐఏఎఫ్‌ షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్రస్తుతం హెలికాప్టర్, రవాణా విమానం, ఫైటర్ జెట్లను కూడా నడుపుతున్నారు. నావికాదళంలో లాజిస్టిక్స్, లా, అబ్జర్వర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మారిటైమ్ నిఘా పైలట్లు, నావల్ ఆర్మేమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్లలో ఎస్‌ఎస్‌సీ ద్వారా చేరిన మహిళా అధికారులను నావికా దళం అనుమతిస్తుంది.

చదవండి:
ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్‌
సాయం చేయాలని ఉంది.. కానీ: సుప్రీంకోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement