Permanent Commission in the Indian Army
-
'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారుగా!.. చేతల్లో చూపండి!
మహిళలు సున్నితమైన వాళ్లు అంటూ కొన్ని రంగాలకే పరిమితం చేయొద్దని గొంతెత్తినా.. ప్రయోజనం లేకుండా పోతుంది. అక్కడకి మహిళ సాధికారత పేరుతో చైతన్యం తీసుకొచ్చి మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా చేయగలరని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతోంది. పోనీ అంత కష్టపడ్డ లింగ సమానత్వపు హక్కు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఏదో ఒక పేరుతో వెనక్కిలాగేయడమే. ఆఖరికి ప్రభుత్వాలు కూడా 'నారీ శక్తి' అని మాటలు చెప్పడమే గానీ పదోన్నతుల విషయంలో నిబద్దతను చూపించడంలేదు. అందుకు ఉదహారణే కోస్ట్ గార్డ్‌లో మహిళకు శాశ్వత కమిషన్ ఏర్పాటు కేసు. ఈ విషయమే సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి అక్షింతలు వేసింది. ఇంతకీ ఏంటా కేసు? ఎవరు దాఖలు చేశారంటే..? కోస్ట్ గార్డ్‌లో అర్హులైన షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్ఎస్సీ) అధికారిణులతో పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేయడానికి అనుమతి లభించకపోవడంతో ప్రియాంక త్యాగి అనే అధికారిణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ప్రియాంక త్యాగి ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మహిళా సాధికారికత గురించి మాట్లాడే మీరు దాన్ని ఇక్కడ చూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. అసలు కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్‌పై "పితృస్వామ్య" విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారంటూ కేంద్రానికి అక్షింతలు వేసింది. "మాట్లాడితే 'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారు. ఇప్పడు ఇక్కడ ఎందుకు చూపించడం లేదు. ఈ విషయంలో నిబద్ధతను ప్రదర్శించాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. అయితే ఆర్మీ, నేవీలో ఈ విధానం సాధ్యమయ్యినప్పుడు కోస్ట్‌గార్డ్‌లో ఎందుకీ వివక్ష?. అసలు కోస్ట్ గార్డ్ పట్ల ఎందుకంత ఉదాసీన వైఖరి.. ఈ విషయంలో మీరు చాలా అగాథంలో ఉన్నారు.. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని మీరు రూపొందించాల్సిందే" అని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది ధర్మాసనం. అంతేగాదు మహిళలు కోస్ట్‌గార్డ్‌లో ఉండలేరని చెప్పే రోజులు పోయాయని, వాళ్లు సరిహద్దులను రక్షించగలిగినప్పుడూ తీరాలను రక్షించగలరని సుప్రీం కోర్టు పేర్కొంది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీ సదరు అదికారిణి త్యాగి ఆర్మీ, నేవీ కాకుండా తీర రక్షక దళంలో వేరొక డొమైన్లో పనిచేస్తున్నందున ఇది వర్తించదని వాదన వినిపించడంతో జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. అలాగే అధికారిణులకు 10% శాశ్వత కమిషన్ మంజూరు చేయవచ్చన్న విక్రమ్‌జిత్ బెనర్జీ వాదనపై కూడా దర్మాసనం మండిపడింది. అసలు మహిళలకు 10 శాతమే ఎందుకు?.. అంటే వారేమైనా తక్కువా? అని ధర్మాసనం చివాట్లు పెట్టింది. నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఉన్నప్పుడు కోస్ట్‌గార్డ్ అలా ఎందుకు చేయడం లేదని నిలదీసింది. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని రూపొందించాల్సిందే అని కేంద్రాన్ని ఉద్దేశించి స్పష్టం చేసింది. త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ల ఏర్పాటుపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పులిచ్చినా ఇంకా పూర్వకాల ఆలోచనలతోనే ఉన్నారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్రం అనుసరించే విధానం సమానత్వ భావనకు విరుద్ధమని, లింగ సమానత్వాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. అందువల్ల స్త్రీ పురుష సమానత్వం ఉన్న విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. (చదవండి: నాడు జర్నలిస్ట్ నేడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా..!) -
కేంద్రం కీలక నిర్ణయం: ఎన్డీఏలో మహిళల ప్రవేశాలకు అనుమతి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళలకు ప్రవేశం కల్పించడానికి త్రివిధ దళాల అధిపతులు అంగీకరించినట్లు కేంద్రం ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళలు ఎన్డీఏ కోర్సులు అభ్యసించేలా మార్గదర్శకాలను రూపొందించడానికి తగిన సమయం అవసరమని కేంద్రం పేర్కొంది. ఎన్డీఏ పరీక్షలకు మహిళలను అనుమతించకపోవడంపై సుప్రీం కోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు మహిళలను ఎన్డీఏ పరీక్షకు అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుసరిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, బుధవారం కోర్టుకు వివరణ ఇస్తూ...."నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఇవ్వాలని కేంద్రం, త్రివిద దళాలు అంగీకరించాయి. ఇది చాలా గొప్ప వార్త. దీనికి సంబంధించిన పూర్తి అఫిడవిట్ని అందజేస్తాం. జూన్ 24న జరగాల్సిన ఎగ్జామ్ నవంబర్ 14కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రవేశాలు యథాతథంగా జరిగేలా చేయండి" అని ధర్మాసనాన్ని కోరారు.(చదవండి: ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం) ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సాయుధ దళాలలు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో తమకెంతో ఆనందం కలిగించిందని పేర్కొంది. మహిళలు ఎన్డీఏ కోర్సలు చేసేలా మార్గం సుగమం చేయడానికి ప్రభుత్వానికి తగిన సమయం పడుతుందని..అలాగే ఒక్కరోజులో సంస్కరణలు తీసుకురాలేమని ధర్మాసనం వెల్లడించింది. దేశ సంరక్షణలో సాయుధ దళాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి అత్యున్నత శాఖ లింగ వివక్షతకు తావివ్వకుండా...లింగ సమానత్వం కోసం కృషి చేయాలంటూ ..జస్టీస్ ఎస్కే కౌల్, జస్టీస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం కోరింది. చదవండి: ‘ఆలస్యానికి మా బాధ్యత లేదు’ రైల్వేశాఖపై సుప్రీంకోర్టు ఫైర్ -
స్త్రీలకు శాశ్వత కమిషన్: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది సుప్రీంకోర్టు తీర్పు మేరకు రక్షణ శాఖ మహిళలకు ఆర్మీలో శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేసే ఆర్మీ ప్రక్రియపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ పొందడానికి నిర్దేశించిన మెడికల్ ఫిట్నెస్ పద్దతి అనేది ఏకపక్షంగా.. అహేతుకంగా, వివక్షాపూరితంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సైన్యంలో శాశ్వత కమిషన్ కోసం సుమారు 80 మంది మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "మన సమాజ నిర్మాణం మగవారి కోసం.. మగవారిచే సృష్టించబడిందని ఇక్కడ మనం గుర్తించాలి" అని కోర్టు అభిప్రాయపడింది. సైన్యం సెలెక్టివ్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఎస్‌సీఏఆర్) మూల్యాంకనం ఆలస్యం చేయడం, మెడికల్ ఫిట్నెస్ క్రైటిరియాను అమలు చేయడం అనేది మహిళా అధికారులపై వివక్ష చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. "ఎస్ఎస్సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) మూల్యాంకనం విధానం మహిళా అధికారులకు ఆర్థిక, మానసిక హాని కలిగిస్తుంది" అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఏర్పాటైన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. "కోర్టు ముందుకు వచ్చిన అనేక మంది మహిళా అధికారులు అనేక అవార్డులు గెలుచుకున్నారు. చాలామంది విదేశీ కార్యకలపాల అంశంలో బాగా పనిచేశారు" అన్నారు. ‘‘క్రీడా పోటీలలో రాణించిన వారిని విస్మరించినట్లు మేం గుర్తించాం, మహిళలు సాధించిన విజయాల వివరణాత్మక లిస్టు తీర్పులో ఇవ్వబడింది ... దీన్ని బట్టి చూస్తే ఈ బోర్డు ఎంపిక కోసం కాకుండా తిరస్కరణ కోసం పని చేసినట్లు కనిపిస్తోంది’’ అని చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత మిలిటరీకి సంబంధించి గతేడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు శాశ్వత కమిషన్ని ఏర్పాటు చేసి సైన్యంలోని మహిళా అధికారులకు పురుష అధికారులతో సమానంగా కమాండ్ స్థానాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. మహిళల సర్వీసుతో సంబంధం లేకుండా శాశ్వత కమిషన్ అందరికీ అందుబాటులో ఉండాలని కోర్టు తెలిపింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం చేసిన వాదనలు "వివక్షత", "కలతపెట్టేవి"గా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే భారత వైమానిక దళం, భారత నావికాదళం మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ని మంజూరు చేసింది. దీని ప్రకారం ఐఏఎఫ్ మహిళలను ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీలలో అధికారులుగా అనుమతిస్తుంది. మహిళా ఐఏఎఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్రస్తుతం హెలికాప్టర్, రవాణా విమానం, ఫైటర్ జెట్లను కూడా నడుపుతున్నారు. నావికాదళంలో లాజిస్టిక్స్, లా, అబ్జర్వర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మారిటైమ్ నిఘా పైలట్లు, నావల్ ఆర్మేమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్లలో ఎస్ఎస్సీ ద్వారా చేరిన మహిళా అధికారులను నావికా దళం అనుమతిస్తుంది. చదవండి: ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్ సాయం చేయాలని ఉంది.. కానీ: సుప్రీంకోర్టు -
సాయం చేయాలని ఉంది.. కానీ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆర్మీలో శాశ్వత కమిషన్(పీసీ) కింద లభించే ప్రయోజనాలు తాము కూడా పొందేందుకు వీలుగా కటాఫ్ తేదీని మార్చాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) మహిళా అధికారులకు నిరాశే మిగిలింది. ఈ మేరకు వారు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేయని వాళ్లకు పీసీ ప్రయోజనాలు కల్పించాలంటే గతంలో తాము ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సి వస్తుందని, అదే జరిగితే అన్ని బ్యాచ్‌లు ఇలాంటి ప్రతిపాదనతో ముందుకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఎస్ఎస్సీ కింద రిక్రూట్ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా... 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎస్ఎస్సీ అధికారులు పీసీ కింద పరిగణింపబడతారని, అదే విధంగా అంతకంటే ఎక్కువ కాలం ఎస్ఎస్సీలో కొనసాగిన వారికి మొత్తంగా 20 ఏళ్ల పాటు సర్వీసులో ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడే నాటికి 14 ఏళ్ల సర్వీసు కంటే ఒక నెల తక్కువ సర్వీసు ఉన్న 19 మంది మహిళా అధికారులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.(చదవండి: ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్) తద్వారా పదవీ విరమణ అనంతరం పీసీ కింద లభించే ప్రయోజనాలు(పెన్షన్) పొందే వీలు ఉంటుందని వారి తరఫు న్యాయవాది మీనాక్షి లేఖి సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఇందుకు స్పందించిన జస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ‘‘తీర్పు వెలువడే నాటికి 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందని, పీసీ కింద చేకూరే ప్రయోజనాలు చేకూరుతాయని ఆనాటి జడ్జిమెంట్‌లో పేర్కొన్నాం. తీర్పు చెప్పిన రోజే కటాఫ్ డేట్. ఒకవేళ మేం ఆ తేదీని మారిస్తే.. తర్వాతి బ్యాచ్‌లకు కూడా ఇలాగే మార్చాల్సి వస్తుంది. ముందు బ్యాచ్‌లపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఉంది. కానీ అదెలాగో అర్థం కావడం లేదు’’అని పిటిషనర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. (చదవండి: టీనేజర్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం ) ఇక ఈ పిటిషన్ విచారణ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది, కల్నల్ బాలసుబ్రహ్మణ్యం మహిళా అధికారుల అభ్యర్థనను వ్యతిరేకించారు. ‘‘జూలై 16 న శాశ్వత కమిషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఫిబ్రవరి 17 నాటికి 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లకు మాత్రమే పెన్సన్ వస్తుంది. ఒకవేళ మీరు దీనిని అనుమతిస్తే.. సంక్లిష్ట పరిస్థితులు తలెత్తుతాయి. ఎందుకంటే ప్రతీ ఆర్నెళ్లకొకసారి ఓ బ్యాచ్ బయటకు వస్తుంది. వాళ్లందరికీ ఇలాంటి ప్రయోజనాలు కల్పించలేము’’అని కోర్టుకు తెలిపారు. కాగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు రక్షణ శాఖ మహిళలకు ఆర్మీలో శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆర్మీ, ఎయిర్, డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్లు, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్లు, ఆర్మీ సర్వీసు కార్పొరేషన్, ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ వంటి విభాగాల్లో పని చేసేందుకు శాశ్వత కమిషన్ కింద నియామకాలు చేపట్టనున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. దీంతో మహిళలంతా పదవీ విరమణ వయసు వచ్చేంత వరకు సర్వీసులు కొనసాగే అవకాశం ఉంటుంది. -
ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్
న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) కింద రిక్రూట్ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పడం తెల్సిందే. ఈ తీర్పు మేరకు రక్షణ శాఖ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ద్వారా ఆర్మీలో మహిళలు విస్తృతమైన పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుందని, మహిళా సాధికారతకు బాటలుపడతాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ చెప్పారు. ఇండియన్ ఆర్మీలోని అన్ని విభాగాల్లోనూ షార్ట్ సర్వీసు కమిషన్డ్ కింద ఉన్న మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్ కిందకు తీసుకువస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్టు కల్నల్ వెల్లడించారు. ఇకపై ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్లు, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్లు, ఆర్మీ సర్వీసు కార్పొరేషన్, ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ వంటి విభాగాల్లో పని చేసే మహిళలంతా శాశ్వత కమిషన్ కింద నియామకాలే జరుగుతాయి. ఎస్ఎస్సీ కింద ఉన్న వారంతా శాశ్వత కమిషన్ కింద మారే డాక్యుమెంటేషన్ ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు. ఎస్ఎస్సీ కింద నియమించే వారిని తొలుత అయిదేళ్లకు నియమిస్తారు.ఆ తర్వాత వారి సర్వీస్‌ను 14 ఏళ్లకు పెంచే అవకాశం ఉంటుంది. శాశ్వత కమిషన్ ద్వారా మహిళలంతా పదవీ విరమణ వయసు వరకు సర్వీసులు కొనసాగుతారు. -
భారత ఆర్మీ.. కేంద్రం మరో కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైన్యానికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కార్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ రక్షణ శాఖ గురువారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సైన్యంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతోపాటు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వాళ్లు ఉన్నత పదవులు పొందడానికి అవకాశం లభిస్తుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆర్మీలోని మొత్తం 10 విభాగాల్లోనూ మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టు భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (మహిళా నాయకత్వం చెల్లని చోటు) భారత సైన్యంలో పనిచేస్తున్న అందరు మహిళాధికారులకు వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా శాశ్వత కమిషన్ వర్తింపజేయాలని కోర్టు వెల్లడించింది. ఈ ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయాలని సూచించింది. దాంతో కేంద్రం ఎట్టకేలకు మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల ఇకపై ఆర్మీ సర్వీస్ కార్ప్స్, ఆర్డినెన్స్, ఎడ్యుకేషన్ కార్ప్స్, అడ్వకేట్ జనరల్, ఇంజనీర్, సిగ్నల్, ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్-మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లోకి మహిళలు ప్రవేశించవచ్చు. నేటి ఉత్తర్వులతో బాధిత మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్ సెలక్షన్ బోర్డును నిర్వహించడానికి ఆర్మీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే సన్నాహక చర్యలను ప్రారంభించిందని అధికారులు తెలిపారు. అంతేకాక శిక్షణ, శారీరక ఓర్పు, పోస్టింగ్ వంటి అంశాలకు సంబంధింది ప్రస్తుత విధానాలను మార్చేందుకు ఆర్మీ సిద్ధమయ్యింది. త్వరలోనే బాధిత మహిళా అధికారులు అందరికి తమ ఆప్షన్‌ను వినియోగించుకుని, అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని సెలక్షన్ బోర్డు తెలిపింది. మెడికల్ కార్ప్స్, డెంటల్ కార్ప్స్, మిలిటరీ నర్సింగ్ సర్వీసులను మినహాయించి ఇప్పటివరకు భారత సైన్యంలో మహిళలు కేవలం 3.89 శాతం ఉండగా, నేవీలో 6.7 శాతం, వైమానిక దళంలో 13.28 శాతం మాత్రమే ఉన్నారు.(నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్) ఇప్పటివరకు ఆర్మీలో మహిళల ప్రవేశం షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) ద్వారా మాత్రమే జరిగింది. అయితే వారు 14 సంవత్సరాలకు మించి సేవ చేయలేకపోయారు. అయినప్పటికీ, కొంతమందికి పొడిగింపులను కొనసాగించారు. కాని వారికి శాశ్వత కమిషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆర్మీలో 300 మందికి పైగా మహిళా అధికారులుకు 14 ఏళ్ల సర్వీస్ పూర్తయ్యింది. వీరంతా ప్రస్తుతం పొడిగింపుపై పనిచేస్తున్నారు. మాతృత్వం, శారీరక పరిమితి, పిల్లల సంరక్షణ, గ్రామీణ నేపథ్యాల వంటి అంశాలను సాకుగా చూపుతూ మహిళలను కమాండ్ స్థాయి పదవులకు తీసుకోలేదు. ప్రస్తుత నిర్ణయంతో ఈ అడ్డంకి తొలగిపోనుంది. -
నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్
న్యూఢిల్లీ: భారత నావికా దళంలోని మహిళా ఉద్యోగుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి. వివక్షను అధిగమించేందుకు మహిళలకు అవకాశం కల్పించిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి’అని వ్యాఖ్యానించింది. నేవీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. ‘సాయుధ దళాల్లో లింగ సమానత్వ విధానం అమలుకు 101 సాకులు చూపడం సమాధానం కాదు. సామర్థ్యం, పోటీతత్వం ఆధారంగా బాధ్యతలను అప్పగిస్తే వారికి వివక్షను అధిగమించే అవకాశం ఇచ్చినట్లవుతుంది. మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమే అవుతుంది’అని వ్యాఖ్యానించింది. నేవీలో మహిళా అధికారులు చూపిన ధైర్యసాహసాలు, చేసిన త్యాగాలు మరువలేనివన్న కోర్టు..‘1991, 1998ల్లో కేంద్రం ప్రకటించిన విధానాల ప్రకారం నేవీలో మహిళలను నియమించుకోవచ్చు. వారిని పురుష అధికారులతో సమానంగా పరిగణించాల్సిందే’అని తెలిపింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ వాదనలు వినిపించారు. సముద్రంలో కొన్ని విధులు నిర్వహించేందుకు అవసరమైన శారీరక సామర్థ్యం పురుషులతో పోలిస్తే మహిళల్లో తక్కువన్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ మాదిరిగా కాకుండా నేవీ సిబ్బంది నెలలపాటు సముద్రంలోనే విధుల్లో ఉంటారని, అందుకే మహిళలను తీసుకోవడం లేదన్నారు. రష్యా నుంచి కొనుగోలు చేసే నౌకల్లో మహిళల కోసం టాయిలెట్ల వంటి సదుపాయాలు లేనందునే వారికి విధులు అప్పగించడం లేదని వివరించారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. మహిళల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నేవీలోని కొన్ని విభాగాల్లో మహిళలను నియమించరాదంటూ 2008లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయరాదని ధర్మాసనం ఆదేశించింది. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)లోని విద్య, న్యాయం, రవాణా విభాగాల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తించే వారందరికీ శాశ్వత కమిషన్ వర్తిస్తుందని స్పష్టంచేసింది. 2008కి ముందు విధుల్లో చేరి శాశ్వత కమిషన్ లేకపోవడంతో నష్టపోయిన మహిళా అధికారులు.. రిటైరైన తర్వాత అందే పింఛను ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. -
మహిళా నాయకత్వం చెల్లని చోటు
సైన్యంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు ఇప్పటికీ తమ పాత కాలపు భావాలకు గట్టిగా అంటిపెట్టుకుని ఉంటున్నారు. అందుకే సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్, నాయకత్వ స్థానాలు పొందటం అనేది చాలా ప్రాధాన్యత కల విషయం. ఇప్పటికీ సైన్యంలో మహిళలకు నాయకత్వ పాత్రలను కల్పించడం లేదు. నా సమర్థత కారణంగా కాకుండా నా జెండర్ కారణంగా నా పురుషాధికారి కంటే నేను తక్కువగా గుర్తింపు పొందడం అంటే ఈ అసలు సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదనే అర్థం. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో 1971 యుద్ధంలో భారతసైన్యం పోరాడింది. ఈ సైన్యానికే కులం, మతం ప్రాతిపదికలను తోసిపుచ్చిన చరిత్ర ఉంది. ఒక అధికారి కులం, మతం అనేవి అప్రాధాన్యమైనప్పుడు, వారి జెండర్ మాత్రం ఎల్లప్పుడూ ప్రశ్నార్థకంగా ఎందుకు మారుతోంది? సైనికుడు అనగానే మన మనసులో మెదిలే పరిభాష ఒక్కటే. ప్రతిష్ట, మన్నన, సమగ్రత. ఒక వ్యవస్థగా సైన్యం తన సర్వీసును స్వార్థానికి అతీతంగా ఉంచుతూ సాహసానికి అత్యంత విలువనిచ్చి కాపాడుకుంటుంది. అయితే సైన్యంలోని మహిళలను నాయకత్వంలోకి తీసుకునే సమస్య వచ్చేసరికి ఈ ప్రతిష్ట, గౌరవం, సాహసం అనే పదాలన్నీ పక్కకు జారుకుం టాయి. ఇక్కడే విషపూరితమైన పురుషత్వ భావన బుసలుకొడుతూ తన వికార ముఖాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించుకుంటుంది. ఏ ఇతర ప్రభుత్వ విభాగంలాగే సైన్యం కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజానికి ప్రతిబింబం మాత్రమే. కాబట్టి సమాజంలో జరుగుతున్నట్లే సైన్యంలో కూడా సామాజిక సంస్కరణ తప్పదు. అలాగే సమాజ పురోగమనం కోసం సైన్యంలోనూ మార్పులు చేయక తప్పదు. కానీ నూటికి నూరుశాతం పురుషులతో కూడిన ఉన్నత సైన్యాధికార వర్గం దృక్పథాన్ని చూస్తే తమతో కలిసి పోరాడుతున్న మహిళా కామ్రేడ్లకు సమానత్వం అనే అంశం విషయంలో తలుపులు మూసుకోవడమే కనిపిస్తుంది. మహిళాధికారుల పట్ల ముల్లు గుచ్చుకునేలా లెఫ్టినెంట్ జనరల్ రాజ్ కడ్యాన్ చేసే వ్యాఖ్యలకు పునాది ఇక్కడే ఉంది. మొదటగా, సైన్యంలోకి మహిళలను చేర్చుకోవడంపై ఇప్పుడు ఎలాంటి వాదనలు తలెత్తడం లేదు. ఎందుకంటే భారత సైన్యంలోకి 26 ఏళ్ల క్రితమే మహిళలు ప్రవేశించారు. అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని మనం దాటుకుని ముందుకెళ్లాం. మరి సైన్యంలో మహిళాధికారుల అజమాయిషీని జవాన్లు ఆమోదించరనే ప్రశ్న ఎక్కడినుంచి వస్తోంది? ఈ జవాన్లే రెండు దశాబ్దాలుగా సైనిక మహిళలను ఆమోదిస్తూ వస్తున్నారు. కాబట్టి మహిళలకు కూడా శాశ్వత కమిషన్ ఉండాలన్న అంశాన్ని వారు ఎందుకు వ్యతిరేకిస్తారు? సైన్యంలో మహిళల ప్రవేశాన్ని సామాజిక ప్రయోగం కోసం జరుగుతున్న ప్రయోగశాల వంటిదని ఎవరైనా వర్ణిస్తే, 1990లలో మాత్రమే అంటే సైన్యంలోకి మహిళలు ప్రవేశించినకాలంలో అయితే అది అర్థవంతంగా ఉండేది. ఆ ప్రయోగం ఇప్పటికే పూర్తయిందని, ఆచరణలో కూడా అది సానుకూల ఫలితాలతో విజయవంతమైందని జనరల్ కడ్యాన్ గుర్తించాల్సి ఉంది మరి. కాబట్టి మహిళలు మగవారికంటే తగ్గు స్థానాల్లోనే ఉండాలని లేక కొన్ని రంగాల్లోనే సమానులుగా నిలవవచ్చుననే ఆలోచన ఉన్నవారికే సైనిక రంగంలో నాయకత్వ స్థానాల్లో మహిళలకు అవకాశం కల్పించాలనేది సమస్యాత్మకంగా ఉండవచ్చు. మహిళలను కాస్త ఉన్నత స్థానంలో చేర్చడాన్ని అంగీకరించడం అంటే తేనె గూడును కదల్చడం లాంటిదే. అంటే ఇక్కడ సమస్య అల్లా జవాన్ మనస్తత్వంలో లేదు. మిలిటరీలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి మెదళ్లలోనే ఇది దాగి ఉంది. మహిళలను జిల్లా న్యాయమూర్తులుగా, పోలీసు అధికారిణులుగా గుర్తించి వారి ఆదేశాలను పాటించడాన్ని ఆమోదిస్తున్న ఈ సమాజం నుంచే జవాన్లు పుట్టుకొచ్చారు. మన సమాజంలో అందరూ ఒకేలా ఆలోచిస్తూ ఉండినట్లయితే మనందరం గతంలోలాగా కేవలం అగ్రకులం పాలనకు కట్టుబడి ఉండేవాళ్లం. సాధారణంగా గ్రామీణ భారతంలో కుల విభజన ఉంది కానీ సమానత్వాన్ని ఎత్తిపట్టే బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గాలన్నింటిలోనూ కొండప్రాంతాల్లోని మహిళలే అత్యంత కాయకష్టం చేసేవారుగా ఉంటున్నారని దాదాపు అన్ని అధ్యయనాలూ మనకు చెబుతున్నాయి. అయితే తన అభిప్రాయాలు సైన్యంలోని పురుషులు, మహిళల సాధారణ అభిప్రాయాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నాయని లెఫ్టినెంట్ జనరల్ కడ్యాన్ చెబుతున్నట్లయితే దాన్ని విధాయకంగానే చూడాల్సి ఉంది. కానీ, సైన్యంలోని పురుషులందరూ జెండర్ పరమైన దురభిమానులు కాదు. అదే నిజమైతే, భారతీయ వాయుసేనలో మహిళలు పోరాటరంగంలో విధుల్లోకి చేరగలగడం చాలా కష్టమైన పని అయ్యేది. మా తోటి అధికారులు ప్రధానంగా పురుషులనుంచి భారీ మద్దతు పొందడం వల్లే మేం ఆ యుద్ధంలో గెలుపొందగలిగామన్నది వాస్తవం. అయితే సైన్యంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు ఇప్పటికీ తమ పాత కాలపు భావాలకు గట్టిగా అంటిపెట్టుకుని ఉంటున్నారు. అందుకే సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్, నాయకత్వ స్థానాలు పొందటం అనేది చాలా ప్రాధాన్యతగల విషయం. ఇప్పటికీ సైన్యంలో మహిళలకు నాయకత్వ పాత్రలను కల్పించడం లేదు. ఈ విషయంలో సైన్యాన్ని సంస్కరించాలనే దృష్టి లోపిస్తూనే ఉంది. గత 26 సంవత్సరాలుగా సైన్యంలోని ముదివగ్గులు మహిళలను అణిచిపెట్టడానికి ఇదేరకమైన వాదనలు చేస్తుండటంపై ఎవరైనా సరే ఆలోచించాల్సి ఉంది. అయితే ప్రతిసారీ పాత గాయం కొత్తగా మన అనుభవంలోకి వస్తూంటుంది. నా సమర్థత కారణంగా కాకుండా నా జెండర్ కారణంగా నా పురుషాధికారి కంటే నేను తక్కువగా గుర్తింపు పొందడం అంటే ఈ అసలు సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదనే అర్థం. ఒక శాస్త్రీయపరమైన లేక తార్కిక భూమిక కలిగిన హేతువు అనేదే లేకుండా భారత సైన్యం ఈ అంశంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాన్ని ఇంత బాహాటంగా ఉల్లంఘించడమే ఆశ్చర్యకరం. మన రాజ్యాంగం ఎత్తిపట్టిన ఆదర్శాల కంటే భారత సైన్యం అతీతమైందన్న పూర్వ నిర్ధారణ నుంచి ఇలాంటి వాదనలు వస్తున్నాయి. పితృస్వామిక, కులస్వభావం కలిగిన భారత సమాజ క్షేత్ర వాస్తవాల పట్ల మన రాజ్యాంగ నిర్మాతలు పూర్తి అప్రమత్తతతోనే వ్యవహరించారు. ఆ క్షేత్ర వాస్తవాలను గుర్తించినప్పటికీ సమానత్వం, స్వేచ్ఛ, స్వతంత్ర భారత్ ఆదర్శాన్నే వారు ఎంపిక చేసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అద్భుతంగా రాశారు: ‘‘రాజ్యాంగ నీతి అనేది సహజ మనోభావం కాదు. దాన్ని రూపొందించాల్సి ఉంది. మన ప్రజలు ఆ నీతిని ఇంకా తెలుసుకోవాల్సి ఉందని మనం తప్పక గుర్తించాలి. భారతీయ ప్రజాస్వామ్యం అనేది సారాంశంలో అప్రజాస్వామికంగా ఉంటున్న భారత గడ్డపై బయటకు నిండుగా బట్టలు కట్టుకోవడం లాంటిదే’’. మన సైన్యంలోని ఉన్నతాధికారుల పేలవమైన వాదనలనే అంబేడ్కర్ కానీ, రాజ్యాంగ సభ కానీ పంచుకుని ఉన్నట్లయితే ఏం జరిగి వుండేదో ఊహించుకోండి మరి. అలాంటి స్థానభ్రంశ స్థితిలో జీవించాలని ఎవరైనా కోరుకుంటారా? హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టంపై వ్యతిరేకత, వాటికి ఇటీవలి సవరణలు, వీటితోపాటు ట్రిపుల్ తలాక్, శబరిమల తీర్పులపై తీవ్ర ఘర్షణలు వంటి వాటి నేపథ్యంలో రాజ్యాంగ నీతిని ఆనాడు మనపై బలవంతంగా రుద్ది ఉంటే అది ఎన్నటికీ ప్రజారంజకమై ఉండదు. ఇప్పుడు భారత సైన్యం... ఢిల్లీ హైకోర్టు, వింగ్ కమాండర్ అనుపమ జోషీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పుకు మరింతగా కట్టుబడి ఉండాలి, ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గేష్ మిర్జాసేట్ కేసులో.. ఎయిర్ ఇండియాలో మహిళా ఫ్లైట్ అటెం డెంట్ల ఉద్యోగ నిబంధనల్లో లైంగిక వివక్షను కోర్టు తోసిపుచ్చింది. సైన్యం అంతర్గత విధానాలను కెలకడానికి సంబంధించి కోర్టు అప్రమత్తత పాటించినప్పటికీ, అప్పటికే వారు తమ విధానాలను సమీక్షించుకోవడంపై దృష్టి పెట్టారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నేతృ త్వంలో 1971 యుద్ధంలో భారతసైన్యం పోరాడింది. ఈ సైన్యానికే కులం, మతం ప్రాతిపదికలను తోసిపుచ్చిన చరిత్ర ఉంది. ఒక అధి కారి కులం, మతం అనేవి అప్రాధాన్యమైనప్పుడు, వారి జెండర్ మాత్రం ఎల్లప్పుడూ ప్రశ్నార్థకంగా ఎందుకు మారుతోంది? సైన్యంలో మహిళలను మాత్రమే కింది స్థాయిల్లోనే ఎందుకు ఉంచేస్తున్నారు? జనరల్ కడ్యాన్ చెప్పిన అంశాల్లో మరొకటి ఏమిటంటే, సైన్యంలో పురుష అధికారులు అనుసరిస్తున్న అత్యంత కఠినమైన శిక్షణా వ్యవస్థను స్త్రీలు తట్టుకోలేరు అన్నదే. సర్, ముందుగా మహిళలను పోటీపడనివ్వండి. మీ ప్రమాణాల్లో నెగ్గినవారినే అర్హులుగా ప్రకటించండి. శిక్షణలో వారు తమ్ముతాము నిరూపించుకోనివ్వండి. వారు సైనిక శిక్షణా వ్యవస్థను తట్టుకుంటే మంచిదే. లేకుంటే అదేమంత చెడ్డ విషయంకాదు. వారు ఏదైనా అడ్డతోవలను చూపించమని అడిగితే ఆ ఐచ్ఛికాన్ని వారికి అసలు ఇవ్వవద్దు. పురుషులు పాల్గొనే అదే క్రీడా క్షేత్రంలో మహిళలనూ పోటీ పడనివ్వండి. వారికి రాయితీలు ఇవ్వవద్దు కానీ నాయకత్వం వహించేందుకు అవకాశం ఇవ్వండి చాలు. మరోసారి చెబుతున్నాను. వారి జెండర్ కారణంగా కాకుండా వారి సమర్థత ప్రాతిపదికనే వారిపై తీర్పు చెప్పండి సర్. అప్పుడు నేను నా కేసును వెనక్కు తీసుకుంటాను. అనుపమా జోషి (ది వైర్ సౌజన్యంతో) వ్యాసకర్త రిటైర్డ్ వింగ్ కమాండర్, భారతీయ వాయుసేన -
ఉద్యోగాలు
ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ పర్మినెంట్ కమిషన్ ‘టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (121వ బ్యాచ్)’లో ప్రవేశానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల (పురుషులు) నుంచి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్/ వర్క్‌షాప్ టెక్నాలజీ, ఏరోనాటికల్/ ఏవియేషన్/ ఏరోస్పేస్/ బాలిస్టిక్స్/ ఏవియానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్ఫోటెక్/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ శాటిలైట్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్/ఆప్టో ఎలక్ట్రానిక్స్/ ఫైబర్ ఆప్టిక్స్/ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆర్కిటెక్చర్/ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ/ బయో టెక్నాలజీ/ బయోమెడికల్ ఇం జనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ ఎక్స్‌ప్లోసివ్స్/ మెటలర్జికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్/మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్/ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్/ ప్రొడక్షన్. అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 20 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 1 నుంచి 31 వెబ్సైట్: www.joinindianarmy.nic.in