న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2030 నాటికి వార్షిక ప్రాతిపదికన ఒక కోటి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే ఈవీ విభాగం సుమారు 5 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనాగా చెప్పారు. 19వ ఈవీ ఎక్స్‌పో–2023 సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వాహన్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 34.54 లక్షల ఎలక్ట్రిక్ వెహికిల్స్ నమోదయ్యాయి. ప్రపంచంలోనే నంబర్–1 ఈవీ తయారీదారుగా భారత్ అవతరించే అవకాశం ఉంది.
స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో భారత్‌ను స్వావలంబన కలిగిన దేశంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే ఉన్న కాలుష్య వాహనాలను హైబ్రిడ్, పూర్తిగా ఈవీలుగా మార్చేందుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఖరారవడంతోపాటు సాంకేతిక ప్రదర్శనలు విజయవంతం అయ్యాయి. ప్రజా, సరుకు రవాణా వాహనాలను ఈవీలకు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment