- అరుపులు, కేకలతో హోరెత్తిన సభ
- గడ్కారీ రాజీనామాకు పట్టు
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాజీనామా వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. సభ ప్రారంభం అయినప్పటి నుంచి కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఏకమై గడ్కారీ రాజీనామా చేయకుండా సభను సాగనిచ్చేది లేదని భీష్మించాయి. చివరకు నితిన్ గడ్కారీ సభలో ప్రకటన చేయాల్సి వచ్చింది. విపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడిటర్ నివేదికను వక్రీకరిస్తున్నాయని ఆయన తన ప్రకటనలో ఆరోపించారు. తన కుటుంబానికి చెందిన ప్యూరిటీ గ్రూప్‌నకు రుణాన్ని మంజూరు చేయటంలో అవకతవకలు జరిగినట్లు కాగ్ ఆరోపించటంపై శనివారం నుంచి విపక్షాలు రాజ్యసభను స్తంభింప జేస్తున్న సంగతి తెలిసిందే. తనను కాగ్ ఎక్కడా తప్పు పట్టలేదని, జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ(ఐఆర్‌ఈడీఏ)అనుసరించిన విధానాలలో లోపాలు, అవకతవకలు ఉన్నాయని మాత్రమే కాగ్ పేర్కొందనీ గడ్కారీ అన్నారు. అయితే విపక్షాలు పట్టు వీడకపోవటంతో రోజంతా నినాదాల మధ్య రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది.
బంగ్లా సరిహద్దు బిల్లు మళ్లీ ఆమోదం
భారత, బంగ్లా సరిహద్దు బిల్లును రాజ్యసభ సోమవారం మరోసారి ఆమోదించింది. గత వారం ఆమోదించిన బిల్లులో స్వల్ప సవరణలు చేయాల్సి రావటంతో మరోసారి బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సి వచ్చింది. కాగా, ప్రభుత్వం బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనల)బిల్లును ఉపసంహరించుకుంది.