Manipur violence: మోదీ నోరు విప్పాలి | Parliament Session 2023: Parliament Both Houses adjourned on Manipur issue | Sakshi
Sakshi News home page

Manipur violence: మోదీ నోరు విప్పాలి

Published Thu, Aug 3 2023 4:46 AM | Last Updated on Thu, Aug 3 2023 4:46 AM

Parliament Session 2023: Parliament Both Houses adjourned on Manipur issue - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు తమ డిమాండ్‌పై మెట్టు దిగడం లేదు. ఫలితంగా లోక్‌సభ, రాజ్యసభలో ఆందోళనలు, నినాదాలు, నిరసనలు, వాయిదాలు నిత్యకృత్యంగా మారాయి. మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష సభ్యులు తొమ్మిదో రోజు బుధవారం సైతం ఉభయ సభలను స్తంభింపజేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతుండడంతోపాటు విపక్ష, అధికారపక్ష సభ్యుల తీరుతో కలత చెందిన స్పీకర్‌ ఓం బిర్లా బుధవారం లోక్‌సభకు రాలేదు. సభా గౌరవాన్ని కాపాడాలని స్పీకర్‌ ఆరాటపడుతున్నారని, సభ్యుల నుంచి సహకారం లభించక కలతతో సభకు హాజరు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.  

సమాధానం చెబుతా: అమిత్‌ షా  
లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్‌ ఓం బిర్లా రాకపోవడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు, ప్యానెల్‌ స్పీకర్‌ మిథున్‌రెడ్డి సభాపతి స్థానంలో కూర్చొని ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే విపక్ష ఎంపీలు మణిపూర్‌ అంశాన్ని లేవనెత్తారు. నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో గందరగోళం నెలకొనడంతో ప్యానల్‌ స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు.

మణిపూర్‌ అంశంపై చర్చ ప్రారంభిద్దామని, తాము సమాధానం చెబుతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రతిపాదించగా, విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానమంత్రి రావాల్సిందేనని పట్టుబట్టారు. ఈసారి సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ కిరీట్‌ సోలంకీ సభకు సహకరించాలంటూ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు కిరీట్‌ సోలంకీ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సులే స్పీకర్‌తో సమావేశమైనట్లు తెలిసింది.  

మోదీని ఆదేశించలేను: ధన్‌ఖఢ్‌  
మణిపూర్‌ హింసపై రూల్‌ 267 కింద సభలో చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. వాటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ చెప్పడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. మణిపూర్‌లో కనీవినీ ఎరుగని హింస జరుగుతోందని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ౖవిపక్ష నేత, కాంగ్రెస్‌ సభ్యుడు మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం చెప్పారు. ఈ దీనిపై మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. ప్రధాని రావాలనుకుంటే రావొచ్చని, రావాలంటూ ఆదేశించలేనని తేలి్చచెప్పారు. మణిపూర్‌ వ్యవహారంపై రూల్‌ 176 కింద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. సభనుంచి వాకౌట్‌ చేశారు.

ఖర్గే, శరద్‌ పవార్‌తో ధన్‌ఖడ్‌ భేటీ  
ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ బుధవారం ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌తో పార్లమెంట్‌లోని తన చాంబర్‌లో సమావేశమయ్యారు. మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో జరుగుతున్న విపక్షాల రగడపై చర్చించారు. సభా సజావుగా సాగేలా సహకారం అందించాలని కోరారు.   

‘మణిపూర్‌’పై ప్రకటన చేసేలా మోదీని ఆదేశించండి
31 మంది ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు బుధవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌లో ప్రకటన చేసేలా ప్రధాని మోదీని ఆదేశింంచాలని కోరుతూ వినతి పత్రం సమరి్పంచారు. హింసకు స్వస్తి పలికి, సోదరభావాన్ని పెంచుకోవాలని ప్రధానే స్వయంగా ప్రజలకు పిలుపునివ్వాలని డిమాండ్‌ చేశారు. హరియాణా ఘర్షణలను కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. మణిపూర్‌పై చర్చ విపక్షాలకు ఇష్టం లేదని, అందుకే సభ జరగకుండా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ప్రహ్లాద్‌ జోషీ  ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement