Amit Shah Writes Letter To Opposition Leaders in Both Houses for Manipur Debate - Sakshi
Sakshi News home page

Manipur Violence: మణిపూర్‌పై ఆరని మంటలు .. ప్రతిపక్షాలకు అమిత్ షా కీలక లేఖ

Published Tue, Jul 25 2023 9:24 PM | Last Updated on Tue, Jul 25 2023 9:31 PM

Amit Shah writes to Opposition leaders In Both Houses for Manipur debate - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపుర్‌ అల్లర్ల అంశం కుదిపేస్తోంది. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని ప్రతిపక్షాల కూటమి పట్టుబడుతుండటంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్‌ ఘటనపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం తరపున మంత్రులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. విపక్షాలు శాంతించడం లేదు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఉమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తూ.. సభా కార్యకలాపాలకు  అడ్డుపడ్డుతున్నాయి.

తాజాగా పార్లమెంట్‌ సమావేశాల్లో మణిపూర్‌ సమస్యపై విపక్షాలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేస్తూ.. పార్లమెంట్‌ ఉభయసభలకు చెందిన పత్రిపక్ష నేతలకు మంగళవారం ఆయన లేఖ రాశారు.

(పార్లమెంట్‌లో మణిపూర్‌ రగడ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు)

ఈ మేరకు లోక్‌సభలో అమిత్‌ షా మాట్లాడుతూ..‘ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి సహకరించాలనే ఆసక్తి లేదు. దళితులపైనా, మహిళల సంక్షేమంపైనా వారికి ధ్యాస లేదు. వారి చర్యలతో విపక్షాల నినాదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మణిపూర్‌పై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలకు లేఖ రాశాను.ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదు. చర్చించాలనుకునే వారెవరికైనా స్వాగతం. ఇందులో దాచాల్సింది ఏది లేదు. ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. ఈ సున్నితమైన అంశంపై చర్చకు అనువైన వాతావరణం కల్పించండి’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

చదవండి: చంద్రయాన్‌-3 ప్రయాణంలో కీలక దశ.. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు..

అదే విధంగా ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే(రాజ్యసభ ప్రతిపక్షనేత), కాంగ్రెస్‌నేత అధిర్‌ రంజన్‌ చౌదరికి(లోక్‌సభ ప్రతిపక్ష నేత) రాసిన లేఖను ట్విటర్‌లో షేర్‌ చేశారు అమిత్‌ షా.. ‘మణిపూర్ అల్లర్లపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి సహకారం కోరుతున్నాం. ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించడంలో అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను’ సదరు లేఖలో పేర్కొన్నారు.

కాగా మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్‌సభలో ప్రభుత్వంపై బుధవారం అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉందని వార్తలు వెలుడిన కొన్ని గంటలకే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక మణిపూర్‌లో మే 3న రెండు జాతుల మధ్య చెలరేగిన హింసా నానాటికీ తీవ్రతరం అవుతూ వినాశకరమైన పరిస్థితికి దారితీసింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement