తెలంగాణలో 1000 కి.మీ. జాతీయ రహదారి!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వెయ్యి కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాలు, ట్రాఫిక్ ఒత్తిడి అధికంగా ఉండే రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వచ్చే ఆరు నెలల్లో మూడున్నర లక్షల కోట్ల వ్యయమయ్యే జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు.
దేశంలో నదీ రవాణాను ప్రోత్సహిస్తున్న క్రమంలో తెలంగాణలో ఏడు జల రవాణా మార్గాలను ఎంపిక చేసినట్టు గడ్కరీ తెలిపారు. మంజీరా, భీమా, పెన్‌గంగా / వార్దా, తుంగభద్ర, ప్రాణహిత/వెన్‌గంగా, కృష్ణ, గోదావరి నదుల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు అనుసంధానంగా బకింగ్‌హామ్ కాలువద్వారా జల రవాణాకు వీలుగా ఈ ఏడే పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణలో రెండు చోట్ల డ్రై పోర్టులను, మల్టీమోడల్ హబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.
భూసేకరణ చట్టంతో గ్రామీణ వికాసం
అంబానీ, ఆదానీల కోసమే కొత్త భూసేకరణ చట్టమన్న ప్రచారం కుట్రతో కూడుకున్నదని గడ్కారీ అన్నారు. గ్రామీణ ప్రాంత వికాసాన్ని దృష్టిలో పెట్టుకునే 2013 నాటి భూసేకరణ చట్టాన్ని సవరిస్తున్నామన్నారు. రైతు సంఘాలతో చేపట్టిన ముఖాముఖిలో పాల్గొన్నారు.