బుర్జ్ ఖలీఫాను మించేలా చత్రపతి టవర్!
ముంబయి: దుబాయ్లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్ ఖలిఫాలాంటి నిర్మాణాన్ని అంతకంటే ఎత్తులో ముంబయిలో నిర్మించాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మరాఠ వీరుడు చత్రపతి శివాజీకి గుర్తుగా దానిని నిర్మించాలని ఉందన్నారు.
అయితే, ఇది అధికారిక ప్రకటన కాదని కేవలం తన మనసులో మాట అని మాత్రమే చెప్పారు. ప్రపంచంలో ఎత్తయిన బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తయిన భవనం ముంబయి సముద్ర తీరంలో ఉండాలని, దానిని చత్రపతి శివాజీ టవర్ అని పిలిస్తే చూడాలనేది తన కోరిక అని అన్నారు. అందులో 30 ఫ్లోర్స్ కేవలం సమావేశాలకోసమే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.మరో 30 ఫ్లోర్లు రెస్టారెంట్లు, మరో 30 హోటల్స్, 20 షాపింగ్ మాల్స్, మరెన్నో ఫ్లోర్స్ పార్కింగ్ కు ఉండాలని చెప్పారు. బుర్జ్ ఖలీపా ప్రపంచంలోనే 829.8 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా ఉంది.