ఇప్పటివరకూ మనం ఒక భవనం ఎత్తును మీటర్లలోనే చెప్పుకుంటున్నాం... ఇకపై మాత్రం కిలోమీటర్లలో చెప్పుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి కిలోమీటరు ఎత్తైన భవనం తాలూకూ నిర్మాణం పూర్తవుతోంది మరి! ఎక్కడుందీ భవనం? ఎవరు కడుతున్నారు? ఎందుకు? ఖర్చెంత?...
ఎడారి దేశం సౌదీ అరేబియాలో కొత్త కొత్త ప్రపంచ రికార్డులు నమోదు కావడం కొత్త కాదు. ఎడారి మధ్యలో 170 కిలోమీటర్ల పొడవైన నగరం ‘ద లైన్’ నిర్మాణ దశలో ఉండగానే బోలెడన్ని రికార్డులు బద్ధలు కొట్టింది. తాజాగా ‘జేఈసీ టవర్స్’ పేరుతో సౌదీ అరేబియాలో నిర్మిస్తున్న కిలోమీటరు భవనం కూడా కొత్త రికార్డును సృష్టించింది. అన్నీ సవ్యంగా సాగితే సుమారు 1007 మీటర్లు అంటే కిలోమీటరు కన్నా పిసరంత ఎక్కువ ఎత్తు ఉన్న ఈ భవనం 2028 నాటికి అందుబాటులోకి రానుంది.
కిలోమీటర్ ఎత్తు అంటే ఎంత? అని అనుకుంటూ ఉంటే కొన్ని పోలికలు చూద్దాం. ఈఫిల్ టవర్‌కు మూడు రెట్లు ఎక్కువ. లేదా న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకు రెట్టింపు. భారత్‌లోనే అతి ఎత్తైన బిల్డింగ్ లోఖండ్‌వాలా మినర్వా (78 అంతస్తులు, 301 మీటర్ల ఎత్తు) కంటే మూడు రెట్లు ఇంకొంచెం ఎక్కువన్నమాట.
మొదట్లో ఈ జేఈసీ టవర్స్‌కు ‘కింగ్‌డమ్ టవర్’ అని పేరు పెట్టారు. కాకపోతే అప్పుడు లక్ష్యం ఒక మైలు ఎత్తు. ఇసుక నేలల్లో ఇంత ఎత్తైన భవనం కట్టలేమని స్పష్టమైన తరువాత దీన్ని కిలోమీటరుకు పరిమితం చేశారు. పేరు కూడా ముందు ‘జెడ్డా టవర్స్’ అని తాజాగా ‘జెడ్డా ఎకనమిక్ టవర్’ అని మార్చారు.
దుబాయిలోని ఎత్తైన భవం ‘బుర్జ్ ఖలీఫా’ (828 మీటర్ల ఎత్తు)ను డిజైన్ చేసిన ఆడ్రియన్ స్మిత్, గార్డన్ హిల్‌లు ఈ జేఈసీ టవర్‌కూ రూపకల్పన చేశారు. ఎడారిలో పెరిగే ఓ చెట్టు ఆకుల మాదిరిగా త్రికోణ ఆకారంలో ఆకాశాన్ని అంటేలా ఉంటుందీ భవనం. ఎర్ర సముద్ర తీరంలోని జెడ్డా నగరం బీచ్ ఒడ్డునే కడుతున్నారు.
భవనం ఎత్తు పెరిగిన కొద్దీ పై అంతస్తుల్లో గాలి చాలా బలంగా వీస్తుంటుందని మనకు తెలుసు. అందుకే జేఈసీ టవర్ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. బలమైన గాలులను తట్టుకోవడమే కాకుండా.. సూర్యుడి ఎండ ప్రతాపాన్ని తగ్గించేందుకూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇసుక నేలలో సుమారు 344 అడుగుల లోతైన 270 కాంక్రీట్ దిమ్మెల పునాదులపై నిర్మాణమవుతోంది.
అంతస్తులు ఎన్నో తెలుసా?
లోఖండ్ వాలా మినర్వాలో మొత్తం 78 అంతస్తులు ఉండగా.. జేఈసీ టవర్‌లో ఏకంగా 157 అంతస్తులు ఉండబోతున్నాయి. మొత్తం 59 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బుర్జ్ ఖలీఫాలో దుబాయి నగరం మొత్తన్ని వీక్షించేందుకు 128వ అంతస్తులో ఏర్పాట్లు ఉంటే.. జేఈసీ టవర్‌లో ఇంతకంటే ఎత్తైన అంతస్తులో వ్యూపాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు మాత్రమే కాకుండా.. ఒక లగ్జరీ హోటల్, కార్యాలయాలు కూడా భవనం లోపల ఏర్పాటవుతాయి.
జేఈసీ టవర్ నిర్మాణం పదేళ్ల క్రితమే మొదలైనా 60వ అంతస్తు స్థాయికి చేరేటప్పటికి ఆగిపోయింది. కొన్నేళ్ల విరామం తరువాత మూడేళ్ల క్రితం మళ్లీ నిర్మాణం మొదలై పూర్తి చేసుకోబోతోంది. ఇంతకీ ఈ భవనం కట్టేందుకు అయ్యే ఖర్చు ఎంతో చెప్పలేదు కదా... అక్షరాలా... 720 కోట్ల సౌదీ అరేబియా రియాళ్లు! రూపాయల్లో చెప్పుకోవాలంటే 159,662,700,000! పదిహేను వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువన్నమాట!!!
-జి.గోపాలకృష్ణ మయ్యా
Comments
Please login to add a commentAdd a comment