పెద్దల సభలో నిరసనలు, నినాదాలు
న్యూఢిల్లీ : సభ్యుల ఆందోళనలు.. నినాదాలు, నిరసనల మధ్య రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. అంతకు ముందు మతహింస నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లుపై వివరణ ఇవ్వాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దాంతో మంత్రి కపిల్ సిబల్ మాట్లాడేందుకు డిప్యూటీ ఛైర్మన్ అనుమతి ఇచ్చారు. మతహింస బిల్లును బీజేపీ, టీఎంసీ వ్యతిరేకించాయి.
కాగా ఓవైపు.. సీమాంధ్ర సభ్యుల తమ నిరసనను కొనసాగిస్తుండగానే.. నిరసన మధ్యనే.. మతహింస నిరోధక బిల్లును ఎలా ప్రవేశపెడతారంటూ.. బీజేపీ సభ్యులు డిప్యుటీ ఛైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో సభ స్థంభించిపోయింది. అంతకు ముందు సభ ప్రారంభం కాగానే .. ఛైర్మన్.. హమీద్ అన్సారీ వారించినా ఎంపీలు ఛైర్మన్ వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేయడంతో తొలుత సభను వాయిదా వేశారు.
రెండు సార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ఎటువంటి మార్పు లేకపోవడంతో పెద్దల సభ మూడవసారికూడా వాయిదా బాట పట్టింది. వాయిదాల అనంతరం సమావేశాలు ప్రారంభమైనా గందరగోళం సద్దుమణగకపోవటంతో సభను డిప్యూటీ ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.