Communal Violence Bill
-
స్తంభించిన పార్లమెంట్
నాలుగో రోజూ సాగని సభలు సమైక్య, తెలంగాణ నినాదాల హోరు వెల్‌లోకి దూసుకెళ్లి సభ్యుల నిరసన లోక్‌సభలో వైఎస్సార్సీపీ సహా 4 అవిశ్వాసం నోటీసులు గందరగోళం మధ్య సభ ముందు పెట్టలేకపోయిన స్పీకర్ రాజ్యసభలో పత్రాలు చించిన డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు ఉభయసభలూ నేటికి వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా స్తంభించిపోయాయి. ఆంధ్రప్రదేశ్ విభజన అంశంతో పాటు.. మత హింస బిల్లు, తమిళ జాలర్ల సమస్యలపై పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టి, నినాదాలు చేయటంతో ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం తలెత్తింది. లోక్‌సభ ఒకసారి, రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడినా పరిస్థితి మారకపోవటంతో ఎలాంటి కార్యకలాపాలూ సాగలేదు. లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సీమాంధ్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నోటీసు ఇచ్చారు. వాటిని కూడా స్పీకర్ సభ ముందు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో అయితే పలువురు ఇతర ప్రాంత సభ్యులు అధికారిక పత్రాలను చింపివేసి చైర్మన్ వైపు విసిరేయటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. చివరకు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే రెండు సభలనూ సభాపతులు మంగళవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ 12 నిమిషాల్లోనే వాయిదా.. సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ సభ్యులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డిలతో పాటు పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి సమైక్య నినాదాలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అయినప్పటికీ సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించగా ఓ సభ్యుడు నదీకాలుష్యంపై ప్రశ్నించారు. ఆ హోరులోనే మంత్రి వీరప్పమొయిలీ సమాధానం ఇచ్చారు. కానీ సమాధానం వినిపించే పరిస్థితి లేకపోవడంతో ప్రారంభమైన మూడు నిమిషాల్లోనే స్పీకర్ మీరాకుమార్ సభను 12 గంటలకు వాయిదావేశారు. తిరిగి సభ సమావేశమయ్యాక వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు సమైక్య నినాదాలు చేయగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు శైలేంద్రకుమార్, ధర్మేంద్రయాదవ్, ఎం.ఆనందం తదితరులు వెల్‌లోకి వెళ్ళి తమ ప్రాంతాల సమస్యలపై నినాదాలు చేశారు. స్పీకర్ మాట్లాడుతూ ‘‘సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, కొనకళ్ల నారాయణరావు, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిల నుంచి అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మూడు నోటీసులు వచ్చాయి. ఈ విషయాన్ని సభ ముందు ఉంచుతున్నాను. ఈ తీర్మానాలకు మద్దతిచ్చేందుకు 50 మంది సభ్యులు వారి స్థానాల్లో లేచి నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు నేను లెక్కించి వీటిని అనుమతించాలో లేదో నిర్ణయించగలను. కానీ ఈ ప్రక్రియకు సభ అదుపులో లేదు..’’ అని అన్నారు. సభ్యులు తమతమ సీట్లలోకి వెళ్లాలంటూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభ అదుపులోకి రాలేదు. ఈ గందరగోళం మధ్యే సభను కొనసాగించగా పలువురు మంత్రులు తమ వార్షిక నివేదికలను సభ ముందుంచారు. గందరగోళం మరింత పెరగటంతో స్పీకర్ సభను 12 నిమిషాల్లోనే మంగళవారానికి వాయిదావేశారు. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ తీవ్ర ఆగ్రహం రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు వెల్‌లోకెళ్లి ప్లకార్డులతో సమైక్య నినాదాలుచేశారు. సభాకార్యక్రమాలకు అంతరాయం కొనసాగుతుండగానే.. అస్సాంకు చెందిన సభ్యుడు బీరేంద్రప్రసాద్ మణిపురి బాలికపై అత్యాచారం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అలాగే పలువురు సభ్యుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. గత వారంలో వివిధ అంశాలపై నిరసనల తెలుపుతూ సభా నిబంధనలను అతిక్రమించారన్న కారణంతో వై.ఎస్.చౌదరి, సి.ఎం.రమేష్ (టీడీపీ), ఎన్.బలగంగ, ఎ.డబ్ల్యు.రబీబెర్నార్డ్, కె.ఆర్.అర్జునన్, టి.రత్నివేల్, ఆర్.లక్ష్మణన్ (ఏఐఏడీఎంకే), వసంతి స్టాన్లీ, ఎ.ఎ.జిన్నా, టి.ఎం.సెల్వగణపతి (డీఎంకే)లపై చర్యలు చేపట్టనున్నట్లు హౌస్ బులెటిన్‌లో పేర్కొనటం పట్ల ఆయా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ై మెత్రేయన్ (ఏఐఏడీఎంకే), సెల్వగణపతి (డీఎంకే)లు హౌస్ బులెటిన్ పత్రాలను చింపివేసి చైర్మన్ వైపు విసిరివేశారు. సభ అదుపు తప్పటంతో 10 నిమిషాలపాటు వాయిదావేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత బీరేంద్రప్రసాద్ మాట్లాడుతూ మన్మోహన్సింగ్ సర్కారు అత్యాచార ఘటనలను అడ్డుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. సభ నడిచే పరిస్థితి కనిపించకపోవడంతో రెండు నిమిషాల్లోనే 12 గంటలకు వాయిదా పడింది. మళ్లీ సమావేశమైన తర్వాత కేంద్ర మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, జైరాంరమేశ్ తదితరులు వార్షిక నివేదికలను ప్రవేశపెట్టారు. అయినప్పటికీ సభ అదుపులోకి రాకపోవటంతో మరోసారి వాయిదాపడింది. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, టీడీపీ సభ్యుడు సి.ఎం.రమేశ్ తదితరులు పెద్దసైజు ప్లకార్డులతో పోడియం వద్ద ఆందోళన చేశారు. ఈ సమయంలో తన ముఖం కనిపించకుండా చేయకండంటూ డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ కాస్త గట్టిగానే చెప్పినా ఫలితం లేకపోయింది. మైత్రేయన్ ఏకంగా చైర్మన్ ఎదుట ఉన్న మైక్రోఫోన్‌ను లాగివేసేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఓ ఎంపీ ఏకంగా డిప్యూటీ చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ పరిస్థితుల్లో డిప్యూటీ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సరైన ప్రవర్తన కాదని, వారికిది తగదని హితవు పలికారు. ఎయిడ్స్ రోగులకు సంబంధించిన బిల్లు అని, వారికి సహాయం చేయాలని మీకు లేదా? అని ప్రశ్నించారు. కానీ ఆందోళన చేస్తున్న సభ్యులు ఆయన మాట వినకపోవడంతో మూడు నిమిషాలకే తిరిగి మంగళవారానికి వాయిదాపడింది. -
వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ
-
పెద్దల సభలో నిరసనలు, నినాదాలు
న్యూఢిల్లీ : సభ్యుల ఆందోళనలు.. నినాదాలు, నిరసనల మధ్య రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. అంతకు ముందు మతహింస నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లుపై వివరణ ఇవ్వాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దాంతో మంత్రి కపిల్ సిబల్ మాట్లాడేందుకు డిప్యూటీ ఛైర్మన్ అనుమతి ఇచ్చారు. మతహింస బిల్లును బీజేపీ, టీఎంసీ వ్యతిరేకించాయి. కాగా ఓవైపు.. సీమాంధ్ర సభ్యుల తమ నిరసనను కొనసాగిస్తుండగానే.. నిరసన మధ్యనే.. మతహింస నిరోధక బిల్లును ఎలా ప్రవేశపెడతారంటూ.. బీజేపీ సభ్యులు డిప్యుటీ ఛైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో సభ స్థంభించిపోయింది. అంతకు ముందు సభ ప్రారంభం కాగానే .. ఛైర్మన్.. హమీద్ అన్సారీ వారించినా ఎంపీలు ఛైర్మన్ వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేయడంతో తొలుత సభను వాయిదా వేశారు. రెండు సార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ఎటువంటి మార్పు లేకపోవడంతో పెద్దల సభ మూడవసారికూడా వాయిదా బాట పట్టింది. వాయిదాల అనంతరం సమావేశాలు ప్రారంభమైనా గందరగోళం సద్దుమణగకపోవటంతో సభను డిప్యూటీ ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు. -
‘గురి’ కుదరని బిల్లు
విశ్లేషణ: చిన్న పుకారు, చిన్న సంఘటన అగ్గిని రేపుతుంది. ఇది పోలీసులకు తెలుసు. ప్రతిసారీ దాడికి ముందే కొంత సమీకరణ జరుగుతుంది. అవసరమైన సరంజామా ముందే పోగు చేసుకుంటారు. ఆయుధాలు ఒక్కొక్కరికీ అందజేసి ఉంచుతారు. కాబట్టి నేరం జరగబోతున్నదని ముందే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. కాని చర్య తీసుకోరు. ‘కొట్టాలని ఉంది కాని, దెబ్బ తగులుతుందేమోనని భయం’ అన్నట్టుగా ఉన్నది 2013, మత, కుల గురి పెట్టిన హింసల బిల్లు. ఇది 2011లోనే తయారైంది. పెనం మీద రొట్టెను అటు ఇటు తిప్పి మాడ్చినట్టు 2013లో మరొక రూపం ఇచ్చారు. దీనిని కేంద్ర ప్రభు త్వం ఆమోదించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఇది బీజేపీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నది. ససేమిరా అంగీకరించనని బీజేపీ చెప్పేసింది కూడా. ఆ పార్టీ అంగీకరిస్తుందన్న ఆశతోనే మొదటి బిల్లును సవరించి, 2013 బిల్లు అని పేరు పెట్టి లోక్‌సభలో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు ఇప్పుడు. బీజేపీకి ఏమిటి అభ్యంతరం! 2011 బిల్లును ఒప్పుకోని బీజేపీని కొంత మెత్తపరచడానికి ఒకటి రెండు మార్పులు చేశామన్నారు. అయినా విపక్షం అంగీకరించేటట్లు లేదు. బీజేపీని దెబ్బ తీయడానికీ, ‘చూశారా! మేం ఎంత లౌకికవాదులమో!’ అని చెప్పుకో వటానికీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఈ బిల్లుతో విన్యాసాలు చేస్తున్నది. అంతగా బీజేపీ అభ్యంతరం పెట్టే అంశాలేమున్నాయి అందులో? ఈ బిల్లులో ప్రధానంగా పదమూడు రకాల నేరాలను పేర్కొన్నారు. కొన్ని మతానికి సంబం ధించిన హింసాత్మక ఘటనలు, కొన్ని కులానికి సంబంధించినవి, మరికొన్ని ‘గురిపెట్టిన హింస’కు సంబంధించినవి. అంటే ఒక మతానికి లేదా కులానికి లేదా సమూహానికి చెందిన వ్యక్తులను లక్ష్యం చేసుకొని దాడి చేయటం, ఇళ్లు తగలబెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, పురుషులను చంపటం, పసిపిల్ల అని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికివేయటం, మనుషుల్ని చంపి మంటల్లో విసిరివేయటం, స్త్రీలను వారి కుటుంబ సభ్యులు చూస్తుండగా నగ్నం చేసి సామూహిక మానభంగానికి గురిచేసి చంపేయటం వంటి ఘోరకృ త్యాలు చేసి వికటాట్టహాసం చేస్తూ విజయోత్సవంలో కరాళనృత్యం చేయటం వంటి నేరాలు ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కిందకి వస్తాయి. వీటికి సంబంధించిన దర్యాప్తు నేర విచారణ లాంటివి సీఆర్పీసీ కింద జరుగుతాయి. అయినా కొత్తగా ఏవో నిబంధనలు ప్రవేశపెడుతున్నట్టు బీజేపీ గగ్గోలుపెడుతున్నది. కులానికి సంబంధించిన నేరా లు కూడా ఐపీసీ కిందకే వస్తాయి. అయితే న్యాయవిచారణ త్వరగా జరిపించ డానికి, జాప్యంలేకుండా ముద్దాయిలను అరెస్టుచేసి విచారణ జరిపి శిక్షలు వేయించటానికి, దీనికోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పరచటం వంటివి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద జరిపిస్తున్నారు. అవే నేరాలకు మళ్లీ ఈ బిల్లులో ప్రవేశపెట్టారు. అయితే ఒక కొత్త నేరాన్ని ప్రవేశ పెట్టారు. నిజానికి ఇదీ పాతదే. రూపం కొత్తది. ‘గురి పెట్టిన హింస’ అనేది ఒక మతానికి లేదా ఒక కులానికి, ఒక తెగకు లేదా ఒక సమూహానికి చెందిన వారిని గురిచేసి వారిపై హింసాకాండ జరపటం. అదే విధంగా ద్వేష ప్రభావం. ఇదీ పాతదే. పేర్లు మారిస్తే చాలదు జరగవలసింది ఏమిటంటే నేరాలు క్రోడీకరించి శిక్షలు సూచించటం కాదు. నేరం జరగకుండా చూడటం, నేరం జరిగిందని తెలిస్తే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నేరగాళ్లను అరెస్టు చేయటం, విచారణ ప్రక్రియను వేగవంతం చేయటం. అంతేకాని సమాజంలో జరుగుతున్న అవే నేరాలకు పేరు మార్చి శిక్షలు పెంచి ‘నేరాలను అరికట్టడానికి మేము ఏ చర్యలు తీసుకుంటున్నామో చూడండి’ అని చెప్పటం కాదు. నేరాన్ని ఆపలేకపోతే నేరం జరిగిన వెంటనే తీసుకోవలసిన చర్యలు తీసుకుంటే అవి మళ్లీ మళ్లీ జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి నేరాలు క్షణికోద్రేకంలో చేసినవి కావు. మత కలహాలు తలెత్తే అవకాశం ఉందని ముందే తెలిసిపోతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీలపై దాడి జరగబోతుందని ముందే తెలుస్తుంది. వాటిని సులువుగా అరికట్ట వచ్చు. మత లేదా కుల ఘర్షణ జరగబోతుందని తెలిసినప్పుడు పోలీసులు రంగంలోకి దిగటం లేదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరుగుతున్న మత కలహాలు, కుల దాడులు చూస్తే ఇదే దృశ్యం పదే పదే కనబడున్నది. కొన్ని కొన్ని సందర్భాలలో పోలీసులే లేదా రాజకీయ నాయకులే రంగంలో ఉండి దాడులు జరిపిస్తారు. ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? ముజఫర్ నగర్లో ఇటీవల జరిగిన మారణహోమం చూస్తే అది ఎంత పకడ్బం దీగా, స్థానిక నాయకుల అండదండలతో జరిగిందో తెలుస్తుంది. పిల్లలని చూడక, స్త్రీలని చూడక, ముసలి వాళ్లని చూడక, గర్భిణులని చూడక వారిపై ఎంత అమానుషంగా హింసాకాండ సాగించారో ఊహకందదు. గర్భిణుల గర్భాన్ని చీల్చి అందులోని పిండాలను, పెరుగుతున్న శిశువులను కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి చంపి వేసిన సంగతి లాంటిది ఏ దేశంలోనూ, ఏ ఆటవిక సమాజాలలోను జరిగి ఉండదు! నిన్నటి వరకూ ఇరుగు పొరుగుగా జీవిస్తున్న వారు, ఉప్పు పప్పు పంచుకున్న వారు, ఒకే మంచంపై కూర్చుని హుక్కా పీల్చిన వారు ఆ తెల్లవారి అంత అకృత్యానికి పాల్పడుతున్నారంటే అది ఉద్రేకంతో చేసినవి కావు. మెజారిటీ మతం అని చెప్పుకుంటున్న వారు మైనారి టీల పట్ల ఇంత ద్వేషాన్ని కడుపులో పెట్టుకు తిరుగుతున్నారంటే నిర్ఘాం తపరుస్తుంది. ఒడిశాలో ఆదివాసీలపై జరిపిన మారణహోమం కూడా ఇలాం టిదే. ఒక క్రైస్తవ డాక్టరు భారతదేశానికి వచ్చి, ఇదే తన సొంత దేశంగా చేసు కొని, ఆదివాసీలకు వైద్య సేవలందిస్తున్నాడు. అతని సేవానిరతికి మానవతా దృక్పథానికి ఆకర్షితులైనవారు, వైద్య సేవలు పొందిన వారు క్రైస్తవ మతం వైపు ఆకర్షితులైతే అయుండవచ్చు. అందులో తప్పేమీ లేదు. అది నేరమూ కాదు. పాపమూ కాదు, అనైతికమూ కాదు. ఆదివాసీలనందరినీ క్రైస్తవ మతంలోకి మార్చివేస్తున్నాడన్న అభియోగంపై ఆ డాక్టర్ స్టెయిన్స్ని, అతని కొడుకులిద్దర్ని పెట్రోలు పోసి సజీవదహనం చేశారు. ఇది క్షణికోద్రేకంతో చేసిన పని అనగ లరా? ఒక జిల్లా అంతటా స్వైరవిహారం చేసి భీతావహం సృష్టించారు. ఇదీ యాదృచ్ఛికం కాదు. ఆదివాసీలు హిందువులు కాదు. వారు తెగలు. హిందూ మతంలో ఉన్న కులాలకూ, వారికీ సంబంధం లేదు. వారు క్రైస్తవ మతంలోకి వెళ్లినా హిందువులనుకుంటున్న వారికి నష్టంలేదు. అక్కడ ఉన్న ఒక మతా చార్యుని ఆదేశాల మేరకు ఈ నరమేథం జరిగింది. అయితే ముస్లింలు కూడా ప్రతీకార చర్యలకు తలపడుతున్నారు. వారికి గత్యంతరం కనబడటం లేదు. చట్టాలు లేకనా! ఎంతో దూరం కాదు. నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లక్షింపేటలో మాలలపై మెజారిటీ మతానికే చెందుతామనుకుంటున్న ఒక కులం వారు దాడి చేసి ఐదుగురిని పట్టపగలు నరికి చంపేశారు. అంతకు ముందు జరిగిన అనేక దారుణాలకు, దీనికీ తేడా ఏమీ ఉండదు. దాడి తీవ్రత, క్రూరత్వం ఒకటే. మరణాల సంఖ్య మారుతుంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్లలో దళితుల్ని ఏభై చొప్పున, అరవై చొప్పున ఊచకోత కోస్తుంటారు. మెజారిటీ మత వర్గం ముస్లింల పట్ల జరుపుతున్న హింసాకాండ, ఎస్సీ, ఎస్టీల పట్ల అదే వర్గం జరుపుతున్న మారణకాండ ఎందుకు మళ్లీ మళ్లీ జరుగుతోంది? చట్టాలు లేకనా? లేక అవసరమైన చర్యలు తీసుకోవటానికి నిరాకరించటమా? నేరానికి సంబంధించి మూడు దశలు ఉంటాయి: ఒకటి నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవటం. రెండు: నేరం జరగకుండా నిరోధించటం. మూడు: సహాయ పునరావాస చర్యలు చేపట్టడం. ఇందులో ఏ ఒక్కటీ సవ్యంగా జరగటం లేదు. ఇదిలా జరగడానికి ప్రధాన కారణం, దాడులు చేస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న ‘హిందువులు’. దాడికి గురవుతున్న వారు ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు. వీరు ప్రతిచోటా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ దేశంలో ముస్లింలను, ఎస్సీ, ఎస్టీలను చాలా సులువుగా గుర్తించగలరు. పైగా ఒకే చోట ఉంటున్న వారికి ఆ ఇబ్బంది ఉండదు. వాళ్ల ఇళ్లూ, వాడలు సులువుగా గుర్తుపట్టవచ్చు. చిన్న పుకారు, చిన్న సంఘటన అగ్గిని రేపుతుంది. ఇది పోలీసులకు తెలుసు. ప్రతిసారీ దాడికి ముందే కొంత సమీకరణ జరుగుతుంది. అవసరమైన సరంజామా ముందే పోగు చేసుకుంటారు. ఆయుధాలు ఒక్కొక్కరికీ అందజేసి ఉంచుతారు. కాబట్టి నేరం జరగబోతున్నదని ముందే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. కాని చర్య తీసుకోరు. ఎందుకంటే హత్యాకాండకు సిద్ధమైన వాళ్లు, పాల్పడిన వారు మెజారిటీకీ చెందినవారు. అధికారంలో ఉన్న వారు వారే. పోలీసు విభాగంలో అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. నేర పరిశోధన చేయవలసిన వారు కూడా తల పక్కకు తిప్పుకుంటున్నారు కాబట్టి, వారి విధులను సక్రమంగా నిర్వర్తించటం లేదు కాబట్టి సాక్షాత్తు సుప్రీంకోర్టు తానే స్వయంగా దర్యాప్తును పర్యవేక్షణ చేస్తున్నది. ఈ పరిస్థితి మారనంత కాలం ఇదే పరిస్థితి పునరావృతమవుతుంది. ఎక్కడ జరుగుతుంది న్యాయం? కొత్త చట్టాలు చేయటం కాదు. ఈ బిల్లులో చూపిన అన్ని నేరాలకూ ఐపీసీ సమా ధానం చెబుతుంది. ఆ చట్టం ఉండి, ఆ చట్టం కింద నేరాలకు శిక్షలు వేసినా నేరాలు తగ్గటంలేదు. సంఘటన జరిగిన ఐదు, పది ఏళ్ల వరకూ కేసు అతీగతీ కనపడకపోతే, చివరకు ‘సాక్ష్యాలు చాలవు, లేదా నమ్మదగినవిగా లేవు’ అని కేసులు కొట్టేస్తే బాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇటువంటి పరి స్థితిని చక్కదిద్దటానికి కొత్త చట్టాలు రావాలి. కొత్త దృక్పథం ఏర్పడాలి. మతా నికి, కులానికి, జాతికి అతీతంగా నిష్పాక్షికంగా నేరపరిశోధన, న్యాయ విచారణ జరగాలి. అంబేద్కర్ అన్నట్టు ‘‘ప్రజాస్వామ్యం అనేది మనం తగిలించుకున్న ముసుగు, ప్రధానంగా ఈ దేశం అప్రజాస్వామికమే ఇంకా!’ -
మతహింస నిరోధక చట్టాన్ని వ్యతిరేకించండి
సీఎం కిరణ్‌కు నరేంద్ర మోడీ లేఖ కేంద్రం తీసుకువస్తున్న మతహింస నిరోధక చట్టాన్ని వ్యతిరేకించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ కోరారు. ఈ మేరకు కిరణ్‌కు లేఖ రాశారు. మతహింస నిరోధక చట్టం రాష్ట్రాల అధికారాలను హరించేలా ఉందన్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదని, కానీ ఈ చట్టంద్వారా కేంద్రం రాష్ట్ర అధికారాల్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమేగాక కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వం తనకు నచ్చని ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో దీనిద్వారా దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందన్నారు. -
ఓట్ల వేటలో మరో బిల్లు!
సంపాదకీయం ఇటీవలికాలంలో ఓట్ల రాజకీయం తప్ప మరేదీ పట్టకుండా పనిచేస్తున్న యూపీఏ ప్రభుత్వం తాజాగా మత హింస నిరోధక (న్యాయం, పరిహారాల లభ్యత) బిల్లు- 2013ను హడావుడిగా పార్లమెంటు ముందుకు తెస్తోంది. తనకు సంఖ్యాబలం సరిపోతుందా, అసలు నైతికంగా చెల్లుబాటవుతుందా అనే అంశాలతో నిమిత్తం లేకుండా చెయ్యద ల్చుకున్నవన్నీ చేసేయాలని సర్కారు తహతహలాడుతోంది. దాని వెనకున్న కారణం స్పష్టమే... ఈసారి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి రాసిపెట్టి ఉన్నదని సర్వేలన్నీ వేనోళ్ల చెబుతున్నాయి. అందులో వింతేమీ లేదు. పాలనలో అన్నివిధాలా విఫలమవడమే కాక, వరస కుంభకోణాలతో భ్రష్టుపట్టిన యూపీఏకు ఇంతకన్నా మెరుగైన ఫలితం రాగలదని ఎవరూ అనుకోరు. అయితే, అధికారం చేతిలో ఉన్నది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం ప్రజాస్వా మ్యంలో చెల్లదు. ఎంతో లోతుగా ఆలోచించి, అందరితోనూ కూలంకషంగా చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలను ‘లేడికి లేచిందే పరుగ’న్నట్టు చేయడంవల్ల ఫలితం వికటిస్తుంది. అందుకే, ఈ శీతాకాల సమావేశాల్లో మతహింస నిరోధక బిల్లు తెస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గుజ రాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు సీఎం జయలలిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇప్పటికే తమ నిరసనలు వ్యక్తంచేయగా మరికొందరు వారితో గళం కలపబోతున్నారు. మత హింస నిరోధక బిల్లు తెస్తామని 2004లోనే యూపీఏ చెప్పింది. అందుకోసమని కొంత కసరత్తు కూడా చేసింది. 2008లో ఆ బిల్లు విషయమై జాతీయ సమగ్రతా మండలి(ఎన్ఏసీ)లో చర్చ జరిగింది. అంతే...అటు తర్వాత దాని ఊసెత్తలేదు. ‘ఇదిగో తెస్తున్నాం... అదిగో తెస్తున్నాం’ అనడం తప్ప ఆ బిల్లు గురించి అటు తర్వాత భిన్న వేదికలపై చర్చించడానికి ప్రయత్నించలేదు. మరోపక్క ఈ బిల్లుపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, వివిధ రాష్ట్రాలూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. మెజారిటీ మతస్తులను ఈ బిల్లు నేరస్తులుగా చూస్తున్నదని బీజేపీ ఆరోపించగా, సమాఖ్య వ్యవస్థకు ఇది ముప్పు తెస్తుందని ముఖ్యమంత్రులు ఆందోళనపడుతున్నారు. నిజానికి దేశంలో మతకల్లోలాల తీవ్రత నానాటికీ పెరుగుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ దేశవ్యాప్తంగా 479 మతకలహాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 107మంది మరణించగా 1,697మంది గాయ పడ్డారు. ఒక్క యూపీలోనే 93 ఘటనలు జరిగాయి. ఎప్పుడూ లేనట్టు ఈసారి కేంద్ర హోంమంత్రిత్వశాఖ మృతుల్లో, క్షతగాత్రుల్లో హిందువులెందరో, ముస్లింలెం దరో లెక్కలిచ్చింది. ఈ ఘటనల సంగతలా ఉంచి వాటి తర్వాత పరిస్థితులు బాధితులను మరింత దుర్భర స్థితిలోకి నెట్టేస్తాయి. చెలరేగిన అల్లర్లు అదుపులోకి వచ్చినా వాటి పర్యవసానాలు ఏళ్లతరబడి తీవ్రంగా ఉంటాయి. ముజఫర్‌నగర్ ప్రాంతంలో దాదాపు 20,000 మంది తమ స్వస్థలాలకు వెళ్లలేక ఇంతటి చలికాలం లోనూ శిబిరాల్లో కాలక్షేపం చేస్తున్నారు. వెళ్లిన కొంతమందికి కూలి పనులు కూడా దొరకడంలేదు. ఎలా బతకాలో అర్ధంకాని స్థితిలో వారంతా ఎక్కడెక్కడికో వలస పోతున్నారు. గుజరాత్లో అయితే 2002నుంచే చాలాచోట్ల మత ప్రాతిపదికన ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఒకరితో ఒకరు కలిసే పరిస్థితే లేదు. జాతీయ సమగ్రతకు ఇంతగా ముప్పు తెస్తున్న మత కల్లోలాలను కఠినంగా అణచితీరాలని ఈ పరిణామాలన్నీ చెబుతున్నాయి. అయితే, ఇలాంటి స్థితిని చక్కదిద్దడానికి తాను తెచ్చిన బిల్లు ఎలా దోహదపడుతుందో యూపీఏ సర్కారు చెప్పలేకపోతోంది. కేవలం మతపరంగా, భాషాపరంగా మైనారిటీలైనవారికి, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా సాగే లక్షిత హింసను కట్టడిచేయడం ప్రధానోద్దేశమని మొదట తెచ్చిన బిల్లులో తెలిపారు. ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకాగా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మత హింస నిరోధక బిల్లుగా మార్చింది. మతకల్లోలాలను కట్టడిచేయడానికి, వాటికి సంబం ధించిన కేసులను పర్యవేక్షించడానికి గతంలో జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల్లోనూ పర్యవేక్షక సంస్థల ఏర్పాటును ప్రతిపాదించగా ఆ బాధ్యతలను ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ మానవహక్కుల సంఘాలకు అప్పగించారు. ఇప్పటికైతే కేవలం సలహా సంస్థలుగానే పనిచేస్తున్న వీటికి కొత్తగా ఎన్నో అధికారాలు కట్టబెడుతున్నారు. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడానికి, తగిన సలహాలిచ్చి వారిని కదిలించడానికి సంఘాలకు వీలుకల్పించారు. ఏదైనా ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించడానికి జిల్లా కలెక్టర్లకు అధికారమిచ్చే నిబంధనకూడా ఉంది. అల్లర్ల నివారణకు చర్యలు తీసుకోని, విధులు సరిగా నిర్వర్తించని అధికారులను శిక్షించేందుకు నిబంధనలున్నాయి. విద్వేషాలను రెచ్చగొట్టేలా వదంతులు వ్యాప్తిచేసే వారిని, అలా చేస్తారని అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకొనేందుకు ఈ బిల్లు అవకాశమిస్తున్నది. ఎన్నికైన తమ ప్రభుత్వాలను కాదని, మానవహక్కుల సంఘాలకే సకల అధికారాలూ దఖలు పరచడం అప్రజాస్వామికమని సీఎంలు భగ్గుమంటున్నారు. ఏదో ఒక సాకుతో కేంద్రం క్రమేపీ తమ అధికారాల్లోకి చొరబడుతున్నదని వీరి ఆరోపణ. అస్పష్టంగా ఉన్న కొన్ని నిబంధనలవల్ల చట్టం దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మత హింసకైనా, ఏ హింసకైనా ప్రాతిపదిక సామాజికార్ధిక సమస్యలే. ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తూ, అందుకు సహాయకారిగా చట్టాలు చేయాలి తప్ప చట్టమే అన్నిటికీ పరిష్కారమని భావించడం తెలివితక్కువ తనం అవుతుంది. సమస్యల సాకుతో ఓట్లు నొల్లుకుందామనో, రాష్ట్రాల అధికారాలను కొల్లగొడదామనో ప్రయత్నిస్తే ఎవరూ సహించరని కేంద్రం తెలుసుకోవాలి. అన్ని స్థాయిల్లోనూ సమగ్రమైన చర్చ జరిగాకే పార్లమెంటు ముందుకు బిల్లు తీసుకురావాలి. అందుకు ఇప్పుడు సమయం లేదనుకుంటే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆ పనిచేస్తుంది. ఆ వివేకం యూపీఏ పెద్దలకు కలగాలి. -
ప్రతిపక్ష సవాల్‌ను స్వీకరిస్తా: మన్మోహన్ సింగ్
మతహింస బిల్లు ఎన్నికల గిమ్మిక్కు కాదు ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలో దిగుతాం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే పెద్ద సవాల్ న్యూఢిల్లీ: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చేస్తున్న సవాళ్లపై కాంగ్రెస్ పార్టీ స్పందించడంలేదన్న విమర్శకు ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాన్ని తాము ఆషామాషీగా తీసుకోవడంలేదని, వారి విమర్శలను సీరియస్‌గా తీసుకుంటున్నవారిలో తానొకడినని స్పష్టం చేశారు. ప్రతిపక్షాన్ని నిర్లక్ష్యంగా చూడడానికి వీల్లేదన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన 11వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలోకి ఆత్మవిశ్వాసంతో దిగుతామన్నారు. మతహింస బిల్లు ఎన్నికల గిమ్మిక్కు, ‘విధ్వంసక వంటకం’ అని మోడీ విమర్శించడాన్ని తప్పుబట్టారు. అల్లర్లను నిరోధించడమే ఆ బిల్లు లక్ష్యమని చెప్పారు. ఉద్రిక్తతలు చోటుచేసుకున్నపుడు ప్రజలను రక్షించడానికి అది ఉపకరిస్తుందన్నారు. అధికారులు త్వరగా స్పందించి పనిచేయడానికి, అల్లర్లలో నష్టపోయిన వారికి తగిన పరిహారం అందించే ఉద్దేశంతో రూపొందించిందన్నారు. దేశంలో రాజకీయ వ్యవస్థ అవినీతిమయమైపోయిందని కొంతమంది వ్యాఖ్యానిస్తుం డడాన్ని కూడా ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యం వైఫల్యం చెందిందని చెప్పేవారు, పార్లమెంట్‌ను వ్యతిరేకించేవారు, ప్రజలకు ప్రజాస్వామ్యంపై ఎంత విశ్వాసం ఉందో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటింగ్ సరళిని చూసి తెలుసుకోవాలన్నారు. అధికారంలో ఉన్నవారు వస్తుంటారు, పోతుంటారని, అన్ని సందర్భాలలోనూ దేశ ప్రజల్లో అభివృద్ధి పథంలో పయనించాలనే స్ఫూర్తి మాత్రం కొనసాగుతూనే ఉండాలన్నారు. అభివృద్ధి సూచీలో మార్పులు వస్తుంటాయని, పెరిగినపుడు, తగ్గినప్పుడు వాటికి తగ్గట్టుగా వ్యూహాలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అభివృద్ధి రేటుపై చాలామంది అసంతృప్తిగా ఉన్నారని, కానీ పంచవర్ష ప్రణాళికల్లో 5 శాతం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్న విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు. అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలని అంగీకరించారు. దేశాన్ని మతాల వారీగా విడగొట్టడమే టైస్టుల ఉద్దేశమని, కానీ వారు దాడులు చేసినపుడల్లా తామంతా ఒక్కటే అని ప్రజలు చాటి చెప్పారని కొనియాడారు. భద్రతలో లోపాలుంటే మీడియా దాన్ని ఎత్తిచూపాలని, అయితే దాడులు జరిగినపుడు మాత్రం విచక్షణ పాటించాలని కోరారు. అదే సమయంలో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భద్రతా దళాల కృషిని కూడా కొనియాడాలని చెప్పారు.